దక్షిణాదిని దున్నేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-02-28T08:57:55+05:30 IST

ఒక భాషలోనే హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది దక్షిణాదిన పలు భాషా చిత్రాల్లో అవకాశాలు కొల్లగొడుతున్నారు కొందరు కథానాయికలు.

దక్షిణాదిని దున్నేస్తున్నారు!

ఒక భాషలోనే హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది దక్షిణాదిన పలు భాషా చిత్రాల్లో అవకాశాలు  కొల్లగొడుతున్నారు కొందరు కథానాయికలు. ఏకకాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాలు చేస్తున్నారు.ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమను దున్నేస్తున్న సినీతారలు వీరే. 


దక్షిణాదిన చెరగని కీర్తి

మహానటితో తెలుగు తెరపై తరగని కీర్తిని సంపాదించుకున్నారు కీర్తి సురేష్‌. ప్రస్తుతం దక్షిణాదిన డిమాండ్‌ ఉన్న కథానాయికల్లో ఆమె ఒకరు. 


తెలుగులో..

ప్రస్తుతం తెలుగులో అరడజను చిత్రాలతో బిజీగా ఉన్నారు మహానటి కీర్తిసురేశ్‌. ‘రెండు జళ్ల సీత’, ‘రంగ్‌ దే’,  ‘పవర్‌ పేట’, ‘గుడ్‌లక్‌ సఖి’, ‘సర్కార్‌ వారి పాట’, చిత్రాలు చేస్తున్నారు. వీటిలో కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంకాగా, మరికొన్ని చిత్రీకరణ పూర్తయ్యాయి. కొన్ని షూటింగ్‌ దశలో ఉన్నాయి. 


తమిళంలో..

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ‘అన్నాత్తే’లో కథానాయికగా నటించే అవకాశం దక్కించుకున్నారు కీర్తి. ఈ చిత్రంతో పాటు దర్శకుడు సెల్వరాఘవన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘సాని కాయిదమ్‌’ చిత్రంలో కీర్తి నటిస్తున్నారు. ఇందులో ఆమె పూర్తిగా డీ గ్లామర్‌ రోల్‌లో నటిస్తున్నారు.

 

మలయాళంలో..

మలయాళంలో ‘‘మరక్కార్‌: అరబ్బీ కడలింటి సింహం’’ (పూర్తయింది), వాషీ అనే రెండు చిత్రాల్లో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘మరక్కార్‌’ చారిత్రక చిత్రంలో ఆమె మోహన్‌లాల్‌ సరసన కథానాయికగా నటిస్తున్నారు. 


దక్షిణాది అగ్రతార నయనతార

2003లో ‘మనస్కినక్కారే’ అనే మలయాళ చిత్రంతో నయనతార సినీరంగ ప్రవేశం చేశారు. 18 ఏళ్లుగా దక్షిణాదిన అగ్రతారగా కొనసాగుతున్నారు. కథానాయికగా గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే నటనా ప్రాధాన్య చిత్రాలతో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు నయనతార. 


తమిళంలో

నయనతార తమిళంలో ఐదు చిత్రాలు చేస్తున్నారు. రజనీకాంత్‌ సరసన నటిస్తోన్న ‘అన్నాత్తే’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. విజయ్‌ సేతుపతి సరసన నటిస్తోన్న ‘కాథువాకుల రెండు కాదల్‌’ చిత్రంలో సమంత, నయనతార కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది. నయనతార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. హారర్‌ నేపథ్యంలో ఆయన నిర్మిస్తోన్న ‘నెట్రికన్‌’ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపిస్తున్నారు. ఇది ఆమెకు 65వ చిత్రం. ‘మూకుత్తి అమ్మన్‌’ చిత్రం నిర్మించిన వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో రెండు కథానాయిక ప్రాథాన్య చిత్రాలు నయనతార అంగీకరించారు. త్వరలోనే ఇవి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 


మలయాళంలో 

మాతృభాష మలయాళంలో నయనతార రెండు చిత్రాలు చేస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘నిళల్‌’(నీడ) చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘మహేషింటే ప్రతీకారమ్‌’ ఫేమ్‌ ఫాహద్‌ ఫాజిల్‌ సరసన ‘పాట్టు’ అనే మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. 


దక్షిణాదిపై కన్నడ బావుటా 

కన్నడ కస్తూరి రష్మిక మందన్న. ఈ అమ్మడు తొలుత కన్నడ చిత్రాలతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకొని అగ్రతారగా ఎదిగారు. దక్షిణాది భాషల్లో చిత్రాలు చేస్తూనే ‘మిషన్‌ మజ్ను’, ‘డెడ్లీ’ చిత్రాలతో బాలీవుడ్‌ అరంగేట్రం చేసి హీరోయిన్‌ రేసులో దూసుకుపోతున్నారు.


తెలుగులో

అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’లో రష్మిక పల్లెటూరి యువతిగా మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించబోతున్నారు.  పూర్తిగా డీ గ్లామర్‌ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. 


తమిళంలో

కార్తీకి జోడీగా నటించిన ‘సుల్తాన్‌’ విడుదలకు సిద్ధమైంది. ఇది ఆమెకు తమిళంలో తొలిచిత్రం. పలు తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా రష్మిక అంగీకరించేందుకు తొందరపడటం లేదు.


కన్నడలో

మాతృభాష కన్నడలో చేసిన కరాబు (తెలుగులో ‘పొగరు’)చిత్రం ఇటీవల విడుదలైంది. ఇలా మూడు దక్షిణాది భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిసున్నారు రష్మిక. 


దక్షిణాది ఐశ్వర్యం 

మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్యాలక్ష్మీ మాతృ పరిశ్రమ మలయాళంతో పాటు తెలుగు, తమిళ చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతున్నారు. 


తెలుగులో

తొలుత మాతృభాష మలయాళంలో అవకాశాలు అందుకొని తర్వాత తమిళ చిత్రసీమలో నిలదొక్కుకొని ఇప్పుడు ‘గాడ్సే’ చిత్రంతో తెలుగు తెరకు ఐశ్వర్యా లక్ష్మి పరిచయమవుతున్నారు. సత్యదేవ్‌ సరసన ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. త్వరలో తెలుగులో ఆమె మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. 


తమిళంలో

ధనుష్‌ కథానాయకుడుగా నటించిన ‘జగమే తంథిరమ్‌’ చిత్రంతో తమిళ సీమలోకి అడుగుపెట్టారు ఐశ్వర్యా లక్ష్మి. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మణిరత్నం తెరకిక్కిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. టోవినో థామస్‌ సరసన ‘కానేక్కానే’ చిత్రంలోనూ నటిస్తున్నారు.  


మలయాళంలో

ఐశ్వర్యాలక్ష్మి మలయాళంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘అర్చనా 31 నాటౌట్‌’ చిత్రంలో తొలిసారి లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. జానపద గాథ నేపథ్యంలో ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘కుమారి’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ‘ప్రేమమ్‌’ కథానాయకుడు నివీన్‌ పౌలీ సరసన ‘బిస్మీ స్పెషల్‌’ చిత్రంలోనూ ఐశ్వర్య కథానాయిక.  



‘ప్రేమమ్‌’ కెరటం అనుపమా పరమేశ్వరన్‌

తొలి చిత్రం ‘ప్రేమమ్‌’తో గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళం, మలయాళంలో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా రాణిస్తున్నారు. 


తెలుగులో

నిఖిల్‌ సిద్ధార్థ సరసన ‘18 పేజెస్‌’ చిత్రంలో నటిస్తున్నారు. 


తమిళంలో 

అథర్వ సరసన ‘తల్లి పొగేతే’ చిత్రం చేస్తున్నారు.

 

మలయాళంలో

అనుపమ నటించిన ‘ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’ యూట్యూబ్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఇటీవల విడుదలైంది. దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటించిన ‘కురుప్పు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


దక్షిణాదికే అందాల రాశి

కథానాయికగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు రాశీఖన్నా. 2013లో వచ్చిన ‘మద్రాస్‌ కేఫ్‌’తో ఆమె సినీ అరంగేట్రం చేశారు. 


తెలుగులో 

‘జిల్‌’, ‘ఆక్సిజన్‌’ చిత్రాల తర్వాత గోపీచంద్‌ సరసన మూడోసారి కథానాయికగా నటించబోతున్నారు రాశీఖన్నా. ఈ చిత్రానికి ‘పక్కా కమర్షియల్‌’ టైటిల్‌ ఖరారైంది. మారుతి దర్శకుడు. 


తమిళంలో

విజయ్‌ సేతుపతి సరసన నటిస్తోన్న ‘తుగ్లక్‌ దర్బార్‌’ చిత్రంలో రాశీ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ఆమె మార్వాడీ యువతి పాత్రలో నటిస్తున్నారు. పూర్తి స్థాయి హారర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆరణ్‌మణై 3’ చిత్రంలో ఆర్య తో రాశీ జోడీ కడుతున్నారు. అలాగే విక్రమ్‌ సరసన కథానాయికగా ఆమె ఓ చిత్రం అంగీకరించారు. 


మలయాళంలో 

హిందీ ‘అంధాధున్‌’ మలయాళ రీమేక్‌లో రాశీఖన్నా నటిస్తున్నారు. హిందీలో రాధికా ఆప్టే పాత్రలో ఆమె నటిస్తున్నారు. 

Updated Date - 2021-02-28T08:57:55+05:30 IST