దక్షిణ గోవర్ధన గిరి

ABN , First Publish Date - 2021-08-06T05:30:00+05:30 IST

మా కృష్ణయ్య గోపాలుడు మాత్రమే కాదు.. వన్యప్రాణుల రక్షకుడు కూడా!’’ అంటారు కర్ణాటకలోని హంగాలా గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు.

దక్షిణ గోవర్ధన గిరి

‘‘మా కృష్ణయ్య గోపాలుడు మాత్రమే కాదు.. వన్యప్రాణుల రక్షకుడు కూడా!’’ అంటారు కర్ణాటకలోని హంగాలా గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు. బండిపూర్‌ నేషనల్‌ పార్క్‌కు ఉత్తరం వైపు కొలువైన గోపాలస్వామిని ఆర్తరక్షకుడిగా, అభయప్రదాతగా వారు పూజిస్తారు. 


కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేటకు పదహారు కిలోమీటర్ల దూరంలో హిమవద్‌ గోపాలస్వామి బెట్ట (కొండ) ఉంది. ‘హిమవద్‌’ అంటే ‘మంచుతో కప్పి ఉన్న’ అని అర్థం. ఆ పేరు వెనుక కథేమిటంటే... హిమాలయాలకు సమీప ప్రాంతాల్లో ఉండే వాతావరణం ఇక్కడ ఏడాదిలో ఎక్కువ రోజులు కనిపిస్తుంది. ఆలయ శిఖరాన్ని మబ్బులు, పరిసరాల్ని పొగ మంచు కమ్మేస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉంటుంది. ఈ హిమవద్‌ గోపాలస్వామి కొండ ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. టేకు, రోజ్‌వుడ్‌ లాంటి అనేక రకాల చెట్లున్న బండిపూర్‌ అభయారణ్యంలో వన్యప్రాణుల సంచారం కూడా ఎక్కువే. రాత్రి సమయంలో ఏనుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాగా, ఇక్కడ ఉన్న హంస తీర్థంలో పూర్వం ఒక కాకి మునిగి హంసగా మారిపోవడంతో... ఈ ఆలయం చుట్టుపక్కల కాకులు కనిపించవని స్థానికులు చెబుతారు. 


గోపాలస్వామి కొండను ‘దక్షిణ గోవర్ధన గిరి’ అనీ, ‘కమలాచలం’ అనీ పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో... సముద్ర మట్టానికి సుమారు 4,770 ఎత్తులో ఉన్న ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనదనీ, అగస్త్య మహాముని ఈ కొండపై వేణుగోపాలుణ్ణి ప్రతిష్ఠించాడనీ స్థల పురాణం చెబుతోంది. కాగా, ఉత్తర ముఖంగా ఉండే ఈ ఆలయ నిర్మాణం ఏడువందల సంవత్సరాలకు పూర్వం... హోయసల రాజుల కాలంలో జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. గర్భగుడిలో... మురళీధరుడై, కుడికాలి బొటన వేలును ఎడమకాలి బొడన వేలిపై ఉంచి... చెట్టు కింద నృత్య భంగిమలో స్వామి దర్శనమిస్తారు. ఆయన దేవేరులైన రుక్మిణి, సత్యభామ, గోవులు, గోపాలకులు, కృష్ణావతార గాథల్లో ప్రస్తావితమైన అనేక పాత్రల శిల్పాలు గర్భగుడి గోడల మీద కనిపిస్తాయి. ముఖమండపంలో చెక్కిన దశావతారాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. గర్భగుడి ద్వారం పైనుంచి ఏడాది పొడుగునా చల్లటి నీటి బొట్లు పడుతూ ఉండడం ఈ ఆలయంలోని మరో విశేషం.

Updated Date - 2021-08-06T05:30:00+05:30 IST