కమాన్.. మా దగ్గరికి రండి.. యూఏఈ కంటే చవగ్గా ఐపీఎల్ నిర్వహిస్తాం: దక్షిణాఫ్రికా ఆహ్వానం

ABN , First Publish Date - 2022-01-26T02:53:18+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ప్రారంభానికి మరికొన్ని నెలలు మాత్రమే..

కమాన్.. మా దగ్గరికి రండి.. యూఏఈ కంటే చవగ్గా ఐపీఎల్ నిర్వహిస్తాం: దక్షిణాఫ్రికా ఆహ్వానం

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ప్రారంభానికి మరికొన్ని నెలలు మాత్రమే ఉంది. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ సగం యూఏఈ తరలిపోయింది. భారత అభిమానులను ఇది తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఈసారి మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.


ప్రస్తుతం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న కరోనా కేసులు అప్పటికి తగ్గుముఖం పట్టి పోటీల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయని ఆశాభావంతో ఉంది. ఒకవేళ అలాకాని పక్షంలో యూఏఈ, దక్షిణాఫ్రికాలలో ఒకదానిని ఎంచుకోవాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. బీసీసీఐ మాత్రం శ్రీలంక వైపు మొగ్గు చూపుతోంది. 


ఈ నేపథ్యంలో బీసీసీఐకి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) బ్రహ్మాండమైన ప్రతిపాదన పంపింది. ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించుకోవాలని కోరింది. యూఏఈ కంటే చవగ్గానే తాము నిర్వహిస్తామని ప్రతిపాదించినట్టు ‘క్రిక్‌బజ్’ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ విషయంలో బీసీసీఐ-సీఎస్ఏ మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలిపింది. ఆటగాళ్లు స్టేడియాల వద్దకు చేరుకునేందుకు తక్కువ ప్రయాణ చార్జీలు, యూఏఈ కంటే హోటల్ టారిఫ్‌లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయని, ఫలితంగా ఫ్రాంచైజీలకు ఖర్చులు భారీగా తగ్గుతాయని పేర్కొంది.


జొహన్నెస్‌బర్గ్‌లో బయో సురక్షిత వాతావరణంలో ఉంటూనే దాని చుట్టుపక్కల ఉన్న నాలుగు స్టేడియాలు.. వాండరర్స్ స్టేడియం (జొహన్నెస్‌బర్గ్), సెంచూరియన్ పార్క్ (ప్రిటోరియా),  విల్లోమూర్ పార్క్ (బెనోని), సెన్వెస్ క్రికెట్ స్టేడియం (పోట్చెఫ్‌స్ట్రూమ్)లలో మ్యాచ్‌లు నిర్వహించవచ్చని తెలిపింది. ఈ స్టేడియాలన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని, ప్రయాణ దూరం కూడా ఎక్కువగా ఉండదని పేర్కొంది. అలాగే, కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలోనూ ఆడుకోవచ్చని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే, సీఎస్ఏ ఆహ్వానంపై అటు దక్షిణాఫ్రికా బోర్డు కానీ, ఇటు బీసీసీఐ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 


ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఆడనుండగా, మొత్తంగా 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. గత సీజన్‌లో మాత్రం 60 మ్యాచ్‌లే జరిగాయి. కాగా, ఐపీఎల్ మ్యాచ్ వేదికలను ఫిబ్రవరి 20న బీసీసీఐ ఖరారు చేయనుంది.

Updated Date - 2022-01-26T02:53:18+05:30 IST