దక్షిణాఫ్రికా కంటే ముందే.. ఐరోపాలోకి ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2021-12-02T07:05:42+05:30 IST

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ఆఫ్రికా కంటే ముందే ఐరోపా దేశాల్లోకి ప్రవేశించిందా ? అంటే ఔననేందుకు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి....

దక్షిణాఫ్రికా కంటే ముందే.. ఐరోపాలోకి ఒమైక్రాన్‌

నవంబరు 19న నెదర్లాండ్స్‌లో.. 21న జర్మనీలో.. 22న బెల్జియంలో కేసులు

11 ఐరోపా దేశాల్లో కొత్త వేరియంట్‌

బాధితుల్లో ఆఫ్రికాకు వెళ్లొచ్చిన వారే ఎక్కువ 

కొవిషీల్డ్‌ ‘బూస్టర్‌’కు అనుమతులివ్వండి.. 

డీసీజీఐకి ‘సీరం’ దరఖాస్తు


న్యూఢిల్లీ/జెనీవా, డిసెంబరు 1: కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ఆఫ్రికా కంటే ముందే ఐరోపా దేశాల్లోకి ప్రవేశించిందా ? అంటే ఔననేందుకు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఒమైక్రాన్‌ కేసును గుర్తించినట్లు నవంబరు 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు దక్షిణాఫ్రికా తెలిపింది. అంతకంటే కొన్ని రోజుల ముందే నెదర్లాండ్స్‌, బెల్జియం, జర్మనీ దేశాల్లో ఒమైక్రాన్‌ కేసులను గుర్తించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. నవంబరు 19, 23 తేదీల్లో చెరో ఒమైక్రాన్‌ కేసును గుర్తించామని నెదర్లాండ్స్‌లోని ఆర్‌ఐవీఎం హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం 16 ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నవంబరు 21 ఓ ప్రయాణికుడి  శాంపిల్‌లో ఆ వేరియంట్‌ను గుర్తించామని జర్మనీ వెల్లడించగా, నవంబరు 22న ఒక ఒమైక్రాన్‌ కేసును గుర్తించామని బెల్జియం ప్రకటించింది. ఇప్పటివరకు 11 ఐరోపా దేశాల పరిధిలో 44 ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ వెల్లడించింది. ఒమైక్రాన్‌ బాధితుల్లో ఎక్కువ మంది ఇటీవలకాలంలో వివిధ ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చిన వారే ఉన్నట్లు తెలిపింది. ఒమైక్రాన్‌ తొలి కేసును గుర్తించినట్లు సౌదీ అరేబియా బుధవారం ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఈ నెల 11 వరకు పొడిగిస్తూ ఆస్ట్రియా నిర్ణయం తీసుకుంది.


యాంటీబాడీలు వదలవు: బయోఎన్‌టెక్‌

ఇప్పుడున్న కొవిడ్‌ వ్యాక్సిన్లతోనూ ఒమైక్రాన్‌ నుంచి రక్షణ లభించే అవకాశాలు ఉన్నాయని ఫైజర్‌ టీకాను అభివృద్ధిచేసిన బయోఎన్‌టెక్‌ కంపెనీ సీఈవో ఉగుర్‌ సహీన్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోని యాంటీబాడీల నుంచి కరోనా కొత్త వేరియంట్‌ తప్పించుకోగలిగినా.. తదుపరిగా దానిపై దాడి చేసేందుకు సహజ రోగ నిరోధక కణాలు మిగిలే ఉంటాయని , అవి వైరస్‌ను వదలవని గుర్తుంచుకోవాలన్నారు. ఒమైక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని దక్షిణాఫ్రికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ) అధికారి అడ్రియన్‌ ప్యూరెన్‌ హెచ్చరించారు. 


కొవిడ్‌ నుంచి కోలుకున్న కమల్‌హాసన్‌

దేశంలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య 547 రోజుల తర్వాత లక్ష దిగువకు చేరింది. క్రియాశీల కేసులు 99,023కు చేరాయి. 24 గంటల్లోనే 8,954 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవగా, మరో 267 మంది ఇన్ఫెక్షన్‌తో మృతిచెందారు. 2020 మే తర్వాత నవంబరులోనే అత్యల్పంగా 3.1 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరపాలిక.. ఈ నెల 7 వరకూ టీకా రెండో డోసు తీసుకునే వారికి లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రకటించింది. ఇందులో ఎంపికయ్యే ఒకరికి రూ.60వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ప్రోత్సాహకంగా అందిస్తామని వెల్లడించింది. ఇక.. గత నెల 22న కొవిడ్‌ బారిన పడిన నటుడు కమల్‌హాసన్‌ పూర్తిగా కోలుకున్నారని ఆయనకు చికిత్స అందించిన శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కొవిషీల్డ్‌ టీకా బూస్టర్‌ డోసుకు అనుమతులను కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దరఖాస్తు సమర్పించింది. బూస్టర్‌ డోసుల ఆవశ్యకతకు తగినంత టీకా స్టాక్‌ తమ వద్ద సిద్ధంగా ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. సీబీఎ్‌సఈ బోర్డు పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, కొన్ని రాష్ట్రాలు ఇంకా రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. అదనంగా ఇప్పుడు ఒమైక్రాన్‌ భయం ఏర్పడిందని, ఇది విజృంభిస్తే.. పరిస్థితి దారుణంగా తయారవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 8 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు.


23 దేశాల్లో కేసులు : డబ్ల్యూహెచ్‌వో 

ఇప్పటిదాకా 23 దేశాల్లో ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈసంఖ్య మరింత పెరగొచ్చని తెలిపింది. వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ టెస్టుల్లో వేగం కొరవడటం అనేది కరోనా కొత్త వేరియంట్ల పుట్టుకకు అవకాశం కల్పిస్తోందని పేర్కొంది. గత వారం రోజుల్లో ఆఫ్రికా, పశ్చిమ పసిఫిక్‌, ఐరోపా దేశాల్లో కొవిడ్‌ కేసులు బాగా పెరిగాయని వివరించింది. 

Updated Date - 2021-12-02T07:05:42+05:30 IST