దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక వచ్చిన ఒకరిలో భిన్న వేరియంట్‌!

ABN , First Publish Date - 2021-11-30T07:50:52+05:30 IST

దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక తిరిగి వచ్చాక పాజిటివ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి సోకినది డెల్టా వేరియంట్‌ కాదని నిర్ధారణ అయింది...

దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక వచ్చిన  ఒకరిలో భిన్న వేరియంట్‌!

 ఆ వ్యక్తికి సోకినది ‘‘డెల్టా’’ కాదని నిర్ధారణ..

 ఒమైక్రాన్‌ అని బలపడుతున్న అనుమానం?

 దేశంలో ఒమైక్రాన్‌ కేసులు లేవు: కేంద్రం


బెంగళూరు, న్యూఢిల్లీ, నవంబరు 29: దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక తిరిగి వచ్చాక పాజిటివ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి సోకినది డెల్టా వేరియంట్‌ కాదని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఒమైక్రాన్‌ కలకలం నేపథ్యంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ మధ్య దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు చేరుకున్నవారికి పరీక్షలు చేయగా.. గత శనివారం ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరికి సోకినది డెల్టానే అని తొలుత భావించారు. అయితే, 63 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన నమూనాలో గుర్తించిన వేరియంట్‌ డెల్టా కంటే భిన్నంగా ఉన్నట్లు తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌   చెప్పారు. ఒమైక్రాన్‌ అయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేయగా.. కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌తో సంప్రదింపుల్లో ఉన్నామని సమాధానమిచ్చారు. శాంపిల్‌ను ఐసీఎంఆర్‌కు పంపామని, ఇప్పటికైతే ఏమీ చెప్పలేనన్నారు. మరోవైపు మహారాష్ట్ర థానెలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ అని తేలింది. కాగా, ఒమైక్రాన్‌ వేరియంట్‌ తొలుత వెలుగుచూసిన దేశాల్లో ఒకటైన బోట్స్‌వానా నుంచి ఢిల్లీ మీదుగా మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ వచ్చిన లిన్‌ కుమో (34) కోసం దాదాపు రోజంతా గాలించారు. బోట్స్‌వానా సైన్యంలో కెప్టెన్‌ అయిన కుమో ఈ నెల 18న మన దేశానికి వచ్చారు. ఒమైక్రాన్‌ కలకలంతో ఆమెకు పరీక్షలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సూచించింది. టెస్టుల్లో కుమోకు వైరస్‌ లేదని తేలింది. దేశంలో సోమవారం వరకు ఒమైక్రాన్‌ కేసులు బయటపడలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. 


మహారాష్ట్ర వృద్ధాశ్రమంలో 67 మందికి కరోనా

మహారాష్ట్ర థానె జిల్లా భివాండీ రూరల్‌ సొర్గాన్‌ గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఐదుగురు సిబ్బంది సహా 67 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 62 మంది వృద్ధులు కాగా అందరూ టీకా రెండు డోసులు పొందినవారే. దేశంలో ఆదివారం 8,309 కేసులు నమోదయ్యాయి. 236 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హై రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన అందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ నిర్ణయించింది. కాగా, అనుమతుల పునరుద్ధరణతో విదేశాలకు డిసెంబరు నుంచి కొవాక్సిన్‌ ఎగుమతిని ప్రారంభించనున్నట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. దేశంలో 18 ఏళ్లలోపు 44 కోట్ల మంది పిల్లలకు టీకా పంపిణీకి సంబంధించి ప్రణాళిక రూపొందించామని కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. దీర్ఘకాల వ్యాధులున్న, ఆరోగ్య సమస్యలు లేని పిల్లలకు తొలుత ఇస్తామని ప్రకటించారు. బెంగళూరు రాజాజీనగర్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో 15 నెలల కిందట కొవిడ్‌తో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలు మార్చురీలో గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది, బీబీఎంపీ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మృతుల బంధువులు మండిపడ్డారు. మరోవైపు, ‘ఒమైక్రాన్‌’ను మూడు గంటల్లోనే గుర్తించేలా తమిళనాట 12 అత్యాధునిక ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి.


3 మ్యుటేషన్లతో ముప్పు!

‘ఒమైక్రాన్‌’ ఇప్పుడున్న వ్యాక్సిన్లకు లొంగుతుందా? అనే ప్రశ్నకు వైద్యరంగ నిపుణులు ఔననే సమాధానమే చెబుతున్నారు. అయితే, ఒమైక్రాన్‌లో 50 మ్యుటేషన్లు జరగగా.. వాటిలో 30 దానికి ఆయువుపట్టుగా ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ భాగంలోనే జరిగాయని సాంక్రమిక వ్యాధి నిపుణుడు చంద్రకాంత్‌ లహరియా అన్నారు. హెచ్‌ 655వై, ఎన్‌679కే, పీ681హెచ్‌ ఉత్పరివర్తనాల వల్ల ఒమైక్రాన్‌ వ్యాప్తిరేటు చాలా పెరగొచ్చని పేర్కొన్నారు. ఆర్‌203కే, జీ204ఆర్‌ అనే మరో 2 మ్యుటేషన్ల వల్ల కూడా తీవ్రతపెరిగే ముప్పు ఉంటుందన్నారు. ఎన్‌ఎ్‌సపీ6 అనే ప్రొటీన్‌ డిలీషన్లు ఒమైక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో జరిగాయని ఫలితంగా అది మానవ రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ఒమైక్రాన్‌ ఆర్‌-నాట్‌ విలువ డెల్టా కంటే కొన్నిరెట్లు ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయని వైరాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌ అన్నారు. 

Updated Date - 2021-11-30T07:50:52+05:30 IST