భారత్‌.. ఆగాల్సిందే

ABN , First Publish Date - 2022-01-07T09:17:47+05:30 IST

తొలి టెస్టులో అద్భుత విజయంతో జోరు మీదున్న భారత్‌కు ఆతిథ్య దక్షిణాఫ్రికా ఝలక్‌ ఇచ్చింది. అచ్చొచ్చిన మైదానంలో మరోసారి చెలరేగాలనుకున్నా..

భారత్‌.. ఆగాల్సిందే

వాండరర్స్‌ మైదానంలో ఆడిన ఆరు టెస్టుల్లో భారత్‌కు ఇదే తొలి పరాజయం.  అలాగే ఈ మైదానంలో భారత్‌పై టెస్టు గెలవడం దక్షిణాఫ్రికాకు ఇదే మొదటిసారి కావడం విశేషం. 

 భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు (96 నాటౌట్‌) సాధించిన రెండో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎల్గర్‌. కెప్లర్‌ వెస్సెల్స్‌ (118) ముందున్నాడు.

చరిత్రాత్మక సిరీస్‌ కోసం భారత జట్టు మరో మ్యాచ్‌ వరకు ఎదురుచూడాల్సిందే. నువ్వా.. నేనా అనే రీతిలో సాగిన రెండో టెస్టు సఫారీల పట్టుదల ముందు మరో రోజు ఉండగానే ముగిసింది. నాలుగో రోజు వర్షంతో రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయినా.. ఆఖరి సెషన్‌లో దూకుడుగా ఆడేస్తూ కావాల్సిన 122 పరుగులనూ సాధించింది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ ఆద్యంతం క్రీజులో నిలవగా.. డుస్సెన్‌ వేగం కూడా జట్టు విజయంలో కీలకమైంది.


జొహాన్నెస్‌బర్గ్‌: తొలి టెస్టులో అద్భుత విజయంతో జోరు మీదున్న భారత్‌కు ఆతిథ్య దక్షిణాఫ్రికా ఝలక్‌ ఇచ్చింది. అచ్చొచ్చిన మైదానంలో మరోసారి చెలరేగాలనుకున్నా.. ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్‌ షో ముందు నిలువలేకపోయింది. డీన్‌ ఎల్గర్‌ (188 బంతుల్లో 10 ఫోర్లతో 96 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు డుస్సెన్‌ (92 బంతుల్లో 5 ఫోర్లతో 40) అండగా నిలవడంతో రెండో టెస్టులో ప్రొటీస్‌ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. ఆఖరి మ్యాచ్‌ 11 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. అంతకుముందు గురువారం ఉదయం నుంచీ వర్షం కురవడంతో మ్యాచ్‌ నిర్వహణపై సందేహం వ్యక్తమైంది. ఈ సమయంలోనే లంచ్‌, టీ బ్రేక్‌ కూడా కానిచ్చేశారు. మధ్యలో కాసేపు తెరిపినిచ్చినా మైదానం చిత్తడిగా ఉండడంతో ఆటకు ఆలస్యమైంది. చివరకు 34 ఓవర్ల కోసం భారత కాలమాన ప్రకారం రాత్రి 7.15 నుంచి చివరి సెషన్‌ను ఆరంభించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎల్గర్‌ నిలిచాడు. 


ఎల్గర్‌ అండగా...:

118/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో పటిష్టంగానే కనిపించిన సఫారీలు నాలుగో రోజున తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించారు. మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక్క వికెట్‌ మాత్రమే తీయగలిగారు. ఎల్గర్‌, డుస్సెన్‌ ఓపికను ప్రదర్శిస్తూ పైచేయి సాధించారు. ఈక్రమంలోనే ఎల్గర్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా.. 50, 51వ ఓవర్లలో డుస్సెన్‌ రెండేసి ఫోర్లతో వేగం పెంచాడు. అయితే మరింత ప్రమాదకరంగా మారకముందే షమి అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. డిఫెన్స్‌ ఆడేందుకు చూసినా అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి స్లిప్‌లో ఉన్న పుజార చేతిలో పడింది. దీంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అయినా సఫారీలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆడారు. అప్పటికి జట్టు విజయానికి 65 పరుగుల దూరంలోనే ఉంది. అయితే బవుమా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను శార్దూల్‌ సరిగ్గా అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ఈ జోడీ భారత బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఓవైపు కుదురుకున్న ఎల్గర్‌...65వ ఓవర్‌లో మూడు ఫోర్లతో మొత్తం 18 పరుగులు రాబట్టడంతో భారత్‌ ఇక చేసేదేమీ లేకపోయింది. 


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 202 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 229

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 266


దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (ఎల్బీ) శార్దూల్‌ 31; ఎల్గర్‌ (నాటౌట్‌) 96; పీటర్సన్‌ (ఎల్బీ) అశ్విన్‌ 28; వాన్‌డర్‌ డుస్సెన్‌ (సి) పుజార (బి) షమి 40; బవుమా (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: 67.4 ఓవర్లలో 243/3. వికెట్ల పతనం: 1-47, 2-93, 3-175. బౌలింగ్‌: బుమ్రా 17-2-70-0; షమి 17-3-55-1; శార్దూల్‌ 16-2-47-1; సిరాజ్‌ 6-0-37-0; అశ్విన్‌ 11.4-2-26-1.

Updated Date - 2022-01-07T09:17:47+05:30 IST