కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించిన దక్షిణాఫ్రికా

ABN , First Publish Date - 2021-11-26T02:11:16+05:30 IST

కరోనా వైరస్‌లో మరో కొత్త రకం వేరియంట్‌ను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొద్ది మొత్తంలోనే గుర్తించిన ఈ వేరియంట్

కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించిన దక్షిణాఫ్రికా

కేప్‌టౌన్: కరోనా వైరస్‌లో మరో కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొద్ది మొత్తంలోనే గుర్తించిన ఈ వేరియంట్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ సరికొత్త వేరియంట్‌ను బి.1.1.529 గా పిలుస్తున్నారు. శరీర రోగనిరోధక ప్రతిస్పందన నుంచి తప్పించుకోవడంతోపాటు మరింతగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


దేశంలో అత్యధిక జనాభా కలిగిన గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఈ వేరియంట్ క్రమంగా బలపడుతోందని, మరో ఎనిమిది ప్రావిన్సులలోనూ ఇది ఉనికిలో ఉందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా దాదాపు 100 నమూనాలను బి.1.1.529గా నిర్ధారించింది. బోట్స్‌వానా, హాంగ్‌కాంగ్‌లోనూ దీనిని గుర్తించినట్టు పేర్కొంది. దక్షిణాఫ్రికా నుంచి వెళ్లిన ప్రయాణికుడి ద్వారానే హాంకాంగ్‌లో ఈ వేరియంట్ వెలుగు చూసినట్టు చెబుతున్నారు. అలాగే, గౌటెంగ్‌లో 90 శాతం కొత్త కేసులు బి.1.1.529 కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  

తమ వద్ద పరిమిత డేటా మాత్రమే ఉండడంతో శాస్త్రవేత్తలు మరింతగా పనిచేస్తూ ఈ కొత్త వేరియంట్‌ను మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దక్షిణాఫ్రికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పేర్కొంది. తాజా వేరియంట్‌పై చర్చించేందుకు శుక్రవారం సమావేశం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గాన్ని సౌతాఫ్రికా అభ్యర్థించింది. కాగా, గతేడాది బీటా వేరియంట్‌ను కూడా తొలుత అక్కడే గుర్తించారు.

Updated Date - 2021-11-26T02:11:16+05:30 IST