ఆఖర్లో బోల్తా

ABN , First Publish Date - 2022-01-24T08:24:57+05:30 IST

దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా దారుణంగా ముగించింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో గెలుపు ముంగిట బోల్తా పడింది...

ఆఖర్లో బోల్తా

మూడో వన్డేలోనూ ఓడిన భారత్‌ 

3-0తో దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్

దీపక్‌ చాహర్‌ పోరాటం వృథా


కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా దారుణంగా ముగించింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో గెలుపు ముంగిట బోల్తా పడింది. దీపక్‌ చాహర్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) వీరోచిత హాఫ్‌ సెంచరీతో జట్టు విజయం ఖాయమే అనుకున్నా.. అనవసర షాట్‌కు వెళ్లి వికెట్‌ సమర్పించుకోవడంతో పరిస్థితి మారింది. దీంతో మూడు వికెట్లున్నా 12 బంతుల్లో 8 పరుగులు చేయలేక చతికిలపడింది. అటు 4 పరుగుల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా 3-0తో సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. డికాక్‌ (124) శతకం సాధించగా.. డుస్సెన్‌ (52) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ్‌కు మూడు, దీపక్‌.. బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ (65), ధవన్‌ (61) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఎన్‌గిడి, ఫెలుక్వాయోలకు మూడేసి వికెట్లు దక్కాయి. డికాక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు.


ఆశలు రేకెత్తించారు: ఛేదనలో భారత్‌ తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు. ఐదో ఓవర్‌లోనే కెప్టెన్‌ రాహుల్‌ (9) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆరంభంలో ధవన్‌-కోహ్లీ జోడీతో పాటు చివర్లో దీపక్‌ చాహర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో గెలుపు ఖాయమనేలా ఆడారు. రెండో వికెట్‌కు ధవన్‌-కోహ్లీ జోడీ 98 పరుగులు జోడించింది. అయితే 23వ ఓవర్‌లో ఫెలుక్వాయో డబుల్‌ ధమాక అందించాడు. ముందుగా ధవన్‌ క్యాచ్‌ అవుట్‌ కాగా.. ఆ తర్వాత చివరి బంతికి పంత్‌ (0)ను డకౌట్‌ చేయడంతో సఫారీలు సంబరాల్లో మునిగారు. ఆ తర్వాత కేశవ్‌ వేసిన బంతి అనూహ్యంగా టర్న్‌ కాగా బవుమా రన్నింగ్‌ క్యాచ్‌తో కోహ్లీ నిష్క్రమించాడు. ఈ సమయంలో సూర్యకుమార్‌ (39), శ్రేయాస్‌ (26) ఐదో వికెట్‌కు 39 పరుగులు జోడించి స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. అప్పటికి 10 ఓవర్లలో 78 పరుగులు అవసరపడగా.. దీపక్‌ ధనాధన్‌ ఆటను కనబర్చాడు. 44వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, 46వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాది ఆశలు రేపాడు. ఇక 24 బంతుల్లో సమీకరణం 21కి మారింది. అయితే 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన దీపక్‌.. జట్టుకు మరో 10 రన్స్‌ కావాల్సి ఉండగా ఎన్‌గిడి ఓవర్‌లో స్లో బంతిని గాల్లోకి ఆడి వెనుదిరిగాడు. ఇక 49వ ఓవర్‌లో బుమ్రా (12) అవుట్‌ కావడంతో చివరి ఓవర్‌లో ఆరు రన్స్‌ అవసరమయ్యాయి. కానీ ఐదో బంతికే ఆఖరి వికెట్‌ పడడంతో జట్టుకు ఓటమి తప్పలేదు.


డికాక్‌ శతకం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్‌ డికాక్‌ తన సూపర్‌ ఫామ్‌ను చాటుకుంటూ శతకం సాధించగా.. డుస్సెన్‌ అర్ధసెంచరీతో ఒత్తిడి పెంచాడు. అంతకుముందు ఓపెనర్‌ యానెమన్‌ (1)ను దీపక్‌ చాహర్‌ అవుట్‌ చేయగా.. కెప్టెన్‌ బవుమా (8) రనౌట్‌ అయ్యాడు. మార్‌క్రమ్‌ (15)ను కూడా చాహర్‌ వెనక్కి పంపాడు. ఈ దశలో డికాక్‌-డుస్సెన్‌ జోడీ నాలుగో వికెట్‌కు 144 పరుగులు చేసింది. అయితే ఈ జోడీని 36వ ఓవర్‌లో బుమ్రా విడదీశాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే డుస్సెన్‌ను చాహల్‌ అవుట్‌ చేశాడు. మిల్లర్‌ (39) ఆఖరి ఓ వర్‌ వరకు క్రీజులో ఉన్నా సహజ శైలిలో ఆడలేకపోయా డు. దీంతో సఫారీలు 300లోపే ఇన్నింగ్స్‌ను ముగించారు.


స్కోరుబోర్డు

దక్షిణాఫ్రికా: డికాక్‌ (సి) ధవన్‌ (బి) బుమ్రా 124; యానెమన్‌ మలాన్‌ (సి) పంత్‌ (బి) దీపక్‌ 1; బవుమా (రనౌట్‌) 8; మార్‌క్రమ్‌ (సి సబ్‌) రుతురాజ్‌ (బి) దీపక్‌ 15; డుస్సెన్‌ (సి) శ్రేయాస్‌ (బి) చాహల్‌ 52; మిల్లర్‌ (సి) కోహ్లీ (బి) ప్రసిద్ధ్‌ 39; ఫెలుక్వాయో (రనౌట్‌) 4; ప్రిటోరియస్‌ (సి) సూర్యకుమార్‌ (బి) ప్రసిద్ధ్‌ 20; కేశవ్‌ (సి) కోహ్లీ (బి) బుమ్రా 6; మగాల (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 0; ఎన్‌గిడి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 49.5 ఓవర్లలో 287 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-8, 2-34, 3-70, 4-214, 5-218, 6-228, 7-272, 8-282, 9-287, 10-287. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 8-0-53-2; బుమ్రా 10-0-52-2; ప్రసిద్ధ్‌ 9.5-0-59-3; జయంత్‌ యాదవ్‌ 10-0-53-0; చాహల్‌ 9-0-47-1; శ్రేయాస్‌ 3-0-21-0.

భారత్‌: రాహుల్‌ (సి) మలన్‌ (బి) ఎన్‌గిడి 9; ధవన్‌ (సి) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 61; కోహ్లీ (సి) బవుమా (బి) కేశవ్‌ 65; పంత్‌ (సి) మగలా (బి) ఫెలుక్వాయో 0; శ్రేయాస్‌ (సి) ఫెలుక్వాయో (బి) మగలా 26; సూర్యకుమార్‌ (సి) బవుమా (బి) ప్రిటోరియస్‌ 39; దీపక్‌ చాహర్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) ఎన్‌గిడి 54; జయంత్‌ (సి) బవుమా (బి) ఎన్‌గిడి 2; బుమ్రా (సి) బవుమా (బి) ఫెలుక్వాయో 12; చాహల్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 2; ప్రసిద్ధ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 49.2 ఓవర్లలో 283 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-18, 2-116, 3-118, 4-156, 5-195, 6-210, 7-223, 8-278, 9-281, 10-283. బౌలింగ్‌: ఎన్‌గిడి 10-0-58-3; ప్రిటోరియస్‌ 9.2-0-54-2; మగలా 10-0-69-1; కేశవ్‌ 10-0-39-1; ఫెలుక్వాయో 7-0-40-3; మార్‌క్రమ్‌ 3-0-21-0.

Updated Date - 2022-01-24T08:24:57+05:30 IST