Advertisement
Advertisement
Abn logo
Advertisement

గత నాలుగైదేళ్లలో ఇంత దారుణమైన ఆటను ఎప్పుడూ చూడలేదు: గంగూలీ

న్యూఢిల్లీ: యూఏఈ, ఒమన్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు దారుణ పరాభవం ఎదుర్కొంది. లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత జట్టు సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆపై  ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలతో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా విజయం సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 


టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఆటతీరుపై టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘బ్యాక్ స్టేజ్ విత్ బొరియా’ షోలో బొరియా మజుందార్‌తో గంగూలీ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఆశించిన మేర రాణించలేకపోయిందన్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌లలో మాత్రం భారత్ రాణించిందని, ఈసారి మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైందని అన్నాడు. 


2017 చాంపియన్స ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడినప్పటికీ బాగానే ఆడిందని, 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ బాగానే ఆడిందని పేర్కొన్నాడు. అప్పుడు తాను కామెంటేటర్‌గా ఉన్నట్టు గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ఆ ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు కివీస్ చేతిలో ఓటమి పాలైందని, ఓ దుర్దినం రెండు నెలల పాటు పడిన కష్టాన్ని నేలపాలు చేసిందని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు. 


ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల ప్రదర్శన తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు. గత నాలుగైదు సంవత్సరాలలో తాను చూసిన అత్యంత చెత్త ప్రదర్శన ఇదేనని పేర్కొన్నాడు. ఇది చూసిన తర్వాత తనకు ఒకటే అనిపించిందని, తగినంత స్వేచ్ఛగా ఆడలేదని అనుకున్నానని పేర్కొన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు భారత జట్టు 15 శాతం సామర్థ్యంతో మాత్రమే ఆడినట్టు అనిపించిందన్నాడు. అయితే, అలా ఎందుకు? అన్నదానిపై ఎవరినీ వేలెత్తి చూపలేమని గంగూలీ పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement