Ganguly in Delhi: మోదీ, షాతో దాదా భేటీ

ABN , First Publish Date - 2022-08-16T00:16:42+05:30 IST

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు.

Ganguly in Delhi: మోదీ, షాతో దాదా భేటీ

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్ల స్వాగత కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నారు. ఇదే సమావేశానికి మోదీ, షా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, సెక్రటరీగా జై షా పదవీకాలం ముగియడంతో తదుపరి కార్యాచరణ కోసమే ఈ సమావేశం జరిగిందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా, జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. 


అయితే క్రికెట్ పదవుల విషయాన్ని పక్కనపెడితే గంగూలీ రాజకీయ ప్రవేశంపై అటు కోల్‌కతాలో, ఇటు ఢిల్లీలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వంతో తరచూ సమావేశమౌతుండటంతో ఆయన రాజకీయ ఎంట్రీపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన్ను బీజేపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఇంతలో ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. 2024పై ఫోకస్ చేసిన కమలనాథులు గంగూలీని ముందుంచి పశ్చిమబెంగాల్‌లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు నెగ్గాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. అయితే గంగూలీ రాజకీయ ప్రవేశంపై పెద్ద ఎత్తున కథనాలు రావడం, దాదా కొట్టిపారేయడం సాధారణమైపోయింది. గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై మరింత క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. 


  



Updated Date - 2022-08-16T00:16:42+05:30 IST