India Vs Pakistan : భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌పై సౌరవ్ గంగూలీ స్పందన.. ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-08-16T03:23:09+05:30 IST

ఆసియా కప్ 2022(Asia Cup 2022)లో భాగంగా ఆగస్టు 28న జరగనున్న భారత్ - పాకిస్తాన్

India Vs Pakistan : భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌పై సౌరవ్ గంగూలీ స్పందన.. ఏమన్నాడంటే..

ముంబై : ఆసియా కప్ 2022(Asia Cup 2022)లో భాగంగా ఆగస్టు 28న జరగనున్న భారత్ - పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్‌పై మాజీ దిగ్గజం, ప్రస్తుత బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Saurav Ganguly) స్పందించాడు. ఇరుదేశాల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌కు అనవసర ప్రాధాన్యత ఇవ్వబోనని, టోర్నమెంట్‌‌లో జరిగే అన్ని మ్యాచ్‌ల మాదిరిగానే ఇదొక మ్యాచ్‌గా భావిస్తున్నట్టు దాదా చెప్పాడు. తాను ఆడిన రోజుల్లో కూడా పాకిస్తాన్‌పై మ్యాచ్‌లను ప్రత్యేకంగా చూసేవాడిని కాదని, టోర్నమెంట్ విజేతగా నిలవడమే లక్ష్యంగా భావించేవాడినని గుర్తుచేశాడు. ప్రస్తుతం కూడా ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నానని, ఆసియా కప్‌లో ఒక పోటీగా మాత్రమే భావిస్తానని వివరించాడు. ఇదేమీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టోర్నమెంట్ కాదని పేర్కొన్నాడు. టీమిండియాపై తనక అపారనమ్మకం ఉందని, ఈసారి కూడా ఆసియా కప్ గెలుస్తుందని భావిస్తున్నట్టు చెప్పాడు. ఇటివల భారత ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారని, ఆసియా కప్‌లో కూడా మెరుగ్గా ఆడతారని భావిస్తున్నట్టు విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఇండియా టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ ఈ విషయాలను వెల్లడించారు. కాగా సెప్టెంబర్ 11న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న లెజెండ్స్ క్రికెట్ మ్యాచ్‌లో గంగూలీ ఆడనున్నాడు.


భారతే ఫేవరెట్ : పాక్ మాజీ కెప్టెన్

త్వరలోనే ఆరంభమవనున్న ఆసియా కప్‌ 2022(Asia Cup)లో భారత(India) జట్టే ఫేవరెట్ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్(Salman Butt) అంచనా వేశాడు. భారత జట్టులో అనుభవమున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, అందుకే ఆసియా కిరీటాన్ని భారత్ నిలబెట్టుకోగలదని జోస్యం చెప్పాడు. ‘‘ ఔను.. భారత్ ఆసియా కప్ గెలవగలదు. వాళ్లకేమైనా విటమిన్ సీ తక్కువా(నవ్వుతూ..). క్రికెట్ ఆడుతున్న విధానం, అనుభవమున్న ఆటగాళ్ల కూర్పుతో కూడిన భారత్ ఫేవరెట్ టీమ్‌గా కనిపిస్తోంది ’’ అని భట్ అన్నాడు. అయితే తనదైన రోజున పాకిస్తాన్ ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలదని హెచ్చరించాడు. ఇక అఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేయలేమని, సులభంగా వికెట్లు తీయగలిగే బౌలర్లు ఉండడంతో అఫ్ఘాన్ కూడా ఆసియా కప్ రేసులో ఉందని భట్ పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో భట్ ఈ మేరకు పేర్కొన్నాడు. కాగా చివరి రెండు ఆసియా కప్ ఎడిషన్లను భారత్ తన ప్రధాన ఆటగాళ్లను బరిలోకి దింపకుండానే టైటిల్స్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

 

ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ మొదలవనుంది. వాస్తవానికి శ్రీలంక అతిథ్యమివ్వాల్సి ఉన్నా ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కారణంగా వేదిక మార్పు అనివార్యమైంది. ఆసియా కప్ 2022 గ్రూప్-ఏలో భారత్‌తోపాటు పాకిస్తాన్ ఉంది. ఇక గ్రూప్- బీలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీలో జట్లు సూపర్-4 కోసం పోటీపడనున్నాయి. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌‌లో జరగనున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-16T03:23:09+05:30 IST