సద్గురువు కోరేది!

ABN , First Publish Date - 2020-10-30T06:09:26+05:30 IST

గురువుకైనా, దైవానికైనా చేయాల్సింది ఆత్మసమర్పణ...

సద్గురువు కోరేది!

గురువులకు శిష్యులు, భగవంతుడికి భక్తులు సమర్పించాల్సింది కిరీటాలూ, రథాలూ, బంగారు కడియాలూ కంకణాలూ కాదు. సద్గురువులకు కావలసింది ధన, కనక, వస్తు, వాహనాలు కావు. గురువుకైనా, దైవానికైనా చేయాల్సింది ఆత్మసమర్పణ. అలా చేయలేనప్పుడు శిష్యరికమైనా, భక్తి అయినా వ్యర్థం. ఈ సత్యాన్ని సిక్కుల గురువైన గురు గోవింద్‌ సింగ్‌ చాటిచెప్పిన ఉదంతం ఇది.


ఉజ్జయనిలో నివసించే బిషాంబర్‌ దాస్‌ అనే వ్యక్తి గురు గోవింద్‌ సింగ్‌ భక్తుడు. తన కుమారుడైన హరగోపాల్‌ కూడా ఆ గురువు ఆశీర్వాదం పొంది, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే కోరిక ఉండేది. అందుకే గోవింద్‌ సింగ్‌ను దర్శించుకోవాలని హరగోపాల్‌ను పంపించాడు. ఉజ్జయని నుంచి గోవింద్‌ సింగ్‌ ఉంటున్న ఆనందపూర్‌ పట్టణానికి హరగోపాల్‌ చేరుకున్నాడు. 

అప్పుడు గోవింద్‌ సింగ్‌ నదీ తీరంలో కూర్చొని ఉన్నారు. ఆయనను కలుసుకున్న హరగోపాల్‌ తనతో తెచ్చిన బంగారు కంకణాల జతను సమర్పించాడు. ఆ కంకణాలను అందుకున్న గోవింద్‌ సింగ్‌ ఒకటి పైకెత్తి గాలిలోకి ఎగరేశారు. అది కొంతదూరంలో పడి, దొర్లుకుంటూ వెళ్ళి, నదిలోకి వెళ్ళి మునిగిపోయింది. వెంటనే హరగోపాల్‌ నదిలో దూకి వెతికాడు. అది దొరకలేదు.

‘‘గురువుగారూ! అది ఎక్కడ పడిందో కచ్చితంగా చెప్పండి. ఎలాగైనా తీసుకొస్తాను’’ అన్నాడు హరగోపాల్‌. వెంటనే గోవింద్‌ సింగ్‌ రెండో కంకణాన్ని నదిలోకి విసిరేసి, ‘అక్కడ’ అని చూపించారు.

తను ఎంతో ఇష్టంగా బహూకరించిన బంగారు కంకణాలను గురువు నదిలో విసిరేయడంతో హరగోపాల్‌ మనసు బాధపడింది. వెంటనే ప్రాపంచిక వస్తువులకు తనలాంటివారు విలువ ఇస్తారే కాని గురువులు ఇవ్వరనీ, నిజమైన గురువులు వాటిని లక్ష్యపెట్టరనీ అతను గ్రహించాడు. 

ఎందరో భక్తులు గురు గోవింద్‌ సింగ్‌కు విలువైన ఆభరణాలనూ, ధనాన్నీ కానుకలుగా ఇచ్చేవారు. ఒక రోజు వాటన్నిటినీ ఆయన నదిలోకి విసిరేయించారు. 

‘‘డబ్బు అవసరం ఉన్న శిష్యులు ఎంతోమంది ఉన్నారు కదా! వారి అవసరాలను తీర్చడానికైనా ఆ కానుకలను ఉపయోగించి ఉండొచ్చు. అనవసరంగా అన్నీ నదిలో పారేయించారు. ఎందుకిలా చేశారు?’’ అని ఆయనను కొందరు ప్రశ్నించారు.

‘‘ఎవరైనా, ఏదైనా కోరికతో ఇచ్చిన ధనం విషంతో సమానం. బిడ్డలతో సమానమైన... కాదు... బిడ్డలకన్నా ముఖ్యమైన శిష్యులకు గురువు విషాన్ని ఎలా తినిపించగలడు? ఏ తండ్రీ తన పిల్లలకు విషంతో నిండిన కూడు పెట్టడు కదా!’’ అని బదులిచ్చారు గురు గోవింద్‌ సింగ్‌. 

- రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2020-10-30T06:09:26+05:30 IST