సారీ.. మీకు టీకా ఇవ్వలేం!

ABN , First Publish Date - 2021-06-14T13:41:41+05:30 IST

విదేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులను టీకా కష్టాలు వెంటాడుతున్నాయి. విదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆగస్టు, సెప్టెంబరు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుం

సారీ.. మీకు టీకా ఇవ్వలేం!

  • 18 ఏళ్లు దాటాల్సిందేనంటున్న వైద్య శాఖ
  • విదేశాల్లో డిగ్రీ చదవాలనుకునే వారికి కష్టాలు
  • సీటు కోల్పోవాల్సి వస్తోందని పలువురి ఆందోళన

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : విదేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులను టీకా కష్టాలు వెంటాడుతున్నాయి. విదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆగస్టు, సెప్టెంబరు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థులందరూ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌తోనే రావాలని, లేదంటే అడ్మిషన్‌ను తిరస్కరిస్తామని చాలా వర్సిటీలు నిబంధన పెట్టాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ హైదరాబాద్‌ నారాయణగూడలోని ఐపీఎమ్‌ కేంద్రంలో కొవిషీల్డ్‌ డోసులు ఇస్తున్నారు. 28 రోజుల్లోనే వీరికి సెకండ్‌ డోసు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే, సాధారణంగా డిగ్రీలో చేరే విద్యార్థుల వయస్సు  17-18 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరు టీకా కోసం ఐపీఎం కేంద్రానికి వెళితే వయస్సు సరిపోవడం లేదంటూ అక్కడి సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. 


కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 2003 డిసెంబరు 31 లోపు జన్మించిన వారంతా టీకాకు అర్హులే. కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. కానీ, 18 ఏళ్లు నిండితేనే టీకా వేస్తామని ఐపీఎం అధికారులు చెబుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. దీంతో విదేశీ వర్సిటీల్లో డిగ్రీ సీటును కోల్పోవాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రైవేట్‌లోనైనా టీకా తీసుకుందామంటే రెండో డోసుకు 84 రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉంది. మరో నెల తర్వాత అక్కడ అడ్మిషన్లు ప్రారంభం కానుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు ఉన్నారు.




టీకా ఇవ్వలేదు

నాకు లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్‌విక్‌లో అర్థశాస్త్రంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీటు వచ్చింది. సెప్టెంబరు నాటికి వెళ్లాల్సి ఉంది. కొవిన్‌లో    నమోదు చేసుకున్నాను. ఈ నెల 11న వ్యాక్సిన్‌ కోసం ఐపీఎం కేంద్రానికి వెళ్తే.. 18 సంవత్సరాలు నిండలేదని టీకా ఇవ్వలేదు. నేను 2003 ఆగస్టులో జన్మించాను. ఐపీఎం అధికారుల చెబుతున్న ప్రకారం మరో రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది. అదే జరిగితే సీటును కోల్పోతాను. కేంద్రం నిబంధనల మేరకు నా లాంటి వారందరికీ టీకా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.  

- లక్కినేని శర్మిష్ట, కొంపల్లి, మేడ్చల్‌ జిల్లా

Updated Date - 2021-06-14T13:41:41+05:30 IST