పాపం.. వసుంధర..

ABN , First Publish Date - 2022-08-12T04:55:17+05:30 IST

ఏ ఆడబిడ్డకూ రాకూడని.. కష్టం ఆమెకు వచ్చింది.. శత్రువును సైతం కన్నీరు పెట్టించే కష్టాలు ఆమెను కక్ష గట్టి వెంటాడాయి.

పాపం.. వసుంధర..
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీధర్‌ అంతరచిత్రంలో వసుంధర (ఫైల్‌)

పదేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

ఏడాది కిందట అనారోగ్యంతో అత్త..

ఇప్పుడు చిన్నత్త చేతిలో తానే...

అనాథలైన ఇద్దరు ఆడబిడ్డలు


రాయచోటి, ఆగస్టు 11 (ఆంరఽధజ్యోతి): ఏ ఆడబిడ్డకూ రాకూడని.. కష్టం ఆమెకు వచ్చింది.. శత్రువును సైతం కన్నీరు పెట్టించే కష్టాలు ఆమెను కక్ష గట్టి వెంటాడాయి. పెళ్లయిన ఐదు సంవత్సరాలలో కళ్ల ముందు ఒక బిడ్డ.. కడుపులో ఒక బిడ్డ.. జీవితం సంతోషంగా సాగుతోందనుకుంటున్న సమయంలో భర్తను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. దీంతో ఒకసారిగా జీవితం అంధకారమైపోయింది. చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ.. అత్త, బిడ్డలను పోషించుకుంటోంది.. ఇలా జీవితం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో... మృత్యువు ఆ అభాగ్యురాలితో మళ్లీ చెలగాటం ఆడింది. తోడుగా ఉన్న అత్త.. అనారోగ్యం కారణంగా ఏడాది కిందట అకస్మాత్తుగా మృత్యువాత పడింది. దీంతో మళ్లీ జీవితం ఆగాథంలోకి కూరుకుపోయింది. ఇక తన ఇద్దరు ఆడబిడ్డలకు తానే సర్వం అయి.. బతుకు వెళ్లదీస్తున్న సమయంలో.. తానే చిన్నత్త (అత్తకు స్వయానా చెల్లెలు) రూపంలో వచ్చిన మృత్యువుకు బలైపోయింది. ఎక్కడో పుట్టి.. ఎక్కడో గిట్టి.. బిడ్డలను అనాథలుగా వదిలివెళ్లిన ఆ అభాగ్యురాలి పేరే వసుంధర.. మనసున్న ప్రతి మనిషిని కంటతడి పెట్టించే ఈ హృదయ విదారక సంఘటన వివరాల్లోకి వెళితే..

    రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురానికి చెందిన పాకాల రాజాతో సంబేపల్లె మండలం గుట్టపల్లెకు చెందిన వసుంధరకు 2007లో వివాహం జరిగింది. రాజా వరికోత యంత్రాలు నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. తొలుత ఆడ బిడ్డ పుట్టింది. వసుంధర మళ్లీ గర్భవతైంది. ఇంతలో ఆ కుటుంబానికి కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. 2012లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. రాజా మృతి చెందాడు. దీంతో వసుంధర జీవితం ఒకసారిగా అంధకారంలోకి కూరుకుపోయింది. మళ్లీ పాపే పుట్టింది. ఇద్దరు బిడ్డలు, అత్తను చూసుకుంటూ.. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ జీవనం సాగించింది. ఈ నేపధ్యంలో చిన్నత్త కువైత్‌ నుంచి వచ్చింది. తర్వాత కుటుంబంలో ఆస్తి విషయమై గొడవలు మొదలయ్యాయి. స్థానికంగా ఉండే పెద్ద మనుషులు, కులస్థులు సర్ది చెప్పాలని చూశారు. సర్దుబాటు కాలేదు. ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పినా.. పూర్తి స్థాయిలో సర్దుబాటు కాలేదు. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మిద్దె పైన పిల్లలతో వసుంధర నివాసం ఉంటోంది. కింద ఇంట్లో సుబ్బమ్మ ఉంటోంది. ఈ నేపధ్యంలో గురువారం మధ్యాహ్నం స్కూల్‌కు వెళ్లిన పిల్లలకు క్యారియర్‌ ఇచ్చి వసుంధర ఇంటికి వచ్చింది. సుమారు 2.30 గంటల సమయంలో ఏమైందో.. ఏమో.. వసుంధర కింద ఉన్న తన చిన్నత్త ఇంట్లోకి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో.? ఏమో.. ? వసుంధరను చిన్నత్త, ఆమె సోదరుడి కుమారుడు చంద్రబాబు హత్య చేశారు. ఆమె తలను తెగ నరికేశారు. ఇంటిలోపల, ఇంటి బయట ..రక్తపు మరకలతో నిండిపోయింది. 


తలను చేత్తో పట్టుకుని..

వసుంధర తలను ఆమె చిన్నత్త ఒక చేత్తో పట్టుకుని.. నరకడానికి ఉపయోగించిన కత్తిని మరొక చేత్తో పట్టుకుని సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. ఇంట్లో నుంచి తలను బయటకు తెచ్చి.. అలానే.. వీధిలో నడుచుకుంటూ వెళ్లడంతో జనం బెంబేలెత్తిపోయారు. పట్టపగలే కావడం దానికితోడు వాహనలు, జనంతో రామాపురం, కొత్తపేట రోడ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దీంతో ఈ దృశ్యం చూసిన జనం భయపడిపోయారు. పలువురు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఎటువంటి భయం, పశ్చాత్తాపం లేకుండా  తలను చేత్తో పట్టుకుని పోవడాన్ని చూసి జనం అవాక్కయ్యారు. పోలీసుస్టేషన్‌ బయట గేటు వద్ద సుబ్బమ్మ వసుంధర తలను పడేసింది. విషయం తెలిసి లోపల ఉన్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన గురించి విచారించారు. ఆమెతో పాటు చంద్రబాబు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వెంటనే రాయచోటి అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డిలు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై చుట్టుపక్కల విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ తామే ఈ హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ సంఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. పట్టణంలో సంచలనం కలిగించిన ఈ విషయం తెలిసి.. పెద్ద ఎత్తున ప్రజలు మృతురాలి ఇంటి వద్దకు వచ్చారు. పోలీసుస్టేషన్‌ వద్ద గుమికూడారు.


నా అనే వాళ్లు లేక..అనాథలుగా

వసుంధర పెద్ద కూతురు వినాయతి 9వ తరగతి చదువుతోంది. చిన్నకూతురు వైష్ణవి 6వ తరగతి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదుతున్నారు. ఇప్పుడు తల్లి హత్యకు గురి కావడంతో నా అనే వాళ్లు లేక అనాథలయ్యారు. మీ అమ్మను చంపేస్తా.. అని తమ చిన్నవ్వ పదేపదే అన్నట్లు ఆ పిల్లలు పోలీసులకు తెలిపారు. తల్లి శవం వద్ద ఇంక మాకు దిక్కెవరు అమ్మా.. అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ దృశ్యం చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. విషయం తెలిసి.. వసుంధర తల్లి, సోదరుడు, సోదరి ఇతరులు వచ్చి.. పిల్లలను చేరదీశారు. మా తల్లి హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని ఆ చిన్నారులు పోలీసులను కోరారు.





Updated Date - 2022-08-12T04:55:17+05:30 IST