పాపం కాంగ్రెస్‌!

ABN , First Publish Date - 2022-09-04T06:06:25+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీ బలంగా కనిపించింది. ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రపంచంలో శక్తిమంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతమెంతో ఘనమన్నట్టుగా సాగిన కాంగ్రెస్‌ పార్టీ...

పాపం కాంగ్రెస్‌!

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీ బలంగా కనిపించింది. ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రపంచంలో శక్తిమంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతమెంతో ఘనమన్నట్టుగా సాగిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత దుస్థితికి కారణమేంటి? కేంద్రంలో, రాష్ర్టాలలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలా? లేక పార్టీని జలగల్లా పట్టి పీల్చి పిప్పి చేసిన నాయకులు కారణమా? కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టుగా కాంగ్రెస్‌ పరిస్థితి మారింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం అంటే ఒకప్పుడు ఎంతటి నాయకుడైనా వణికిపోయేవారు. ఇప్పుడు అధిష్ఠానం అంటే అందరికీ అలుసైపోయింది. దేశ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు చుక్కాని లేని నావలా తయారైంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ హత్యానంతరం కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిపోవడం మొదలైంది. సోనియాగాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం కొనసాగినంత కాలం కాంగ్రెస్‌ పార్టీ బలంగా కనిపించినప్పటికీ ఆ పార్టీ పునాదులు బలహీనపడటం మొదలైంది. దేశానికి స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ పార్టీ, ఆ తర్వాత యువతతో సంబంధాలు కోల్పోతూ వచ్చింది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగాలు, స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ పాత్ర గురించి ఈ తరానికి తెలియదంటే అతిశయోక్తి కాదు. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో అనేక అవలక్షణాలు ప్రవేశించాయి. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు రాజభరణాలు రద్దు చేయడంతోపాటు ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. భూసంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చారు. రాజీవ్‌ గాంధీ హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే. అయితే ఈ చట్టాల ఫలాలను అనుభవిస్తున్న ప్రస్తుత తరానికి కాంగ్రెస్‌ పార్టీనే అందుకు కారణమని తెలియని పరిస్థితి! అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వ పోకడలకు పోయిన కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షాలకు ప్రథమ శత్రువుగా మారింది. పలు సందర్భాలలో లెఫ్ట్‌ రైట్‌ అన్న తేడా లేకుండా ప్రతిపక్షాలు అన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సంఘటితమయ్యాయి. అదే సమయంలో వివిధ రాష్ర్టాలలో బలమైన నాయకులను కాంగ్రెస్‌ పార్టీ దూరం చేసుకుంటూ వచ్చింది. యూపీఏ హయాంలో పార్టీ అధిష్ఠానం చుట్టూ కోటరీ చేరి పార్టీకి చెదలు పట్టించారు. పార్టీ నాయకత్వంలో పరిపక్వత కొరవడటంతో అనేక మంది కాంగ్రెస్‌ నాయకులు అవినీతికి పాల్పడుతూ పార్టీని దెబ్బతీశారు. కాంగ్రెస్‌ పార్టీ వద్ద నిధులు లేకపోయినా ఆ పార్టీ నాయకులు మాత్రం కుబేరులయ్యారు. 2014 ఎన్నికల నాటికి నరేంద్ర మోదీ తెర మీదకు రావడంతో ఆయన రాజకీయ ఎత్తుగడలను గ్రహించలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో రెండవసారి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. అనారోగ్య సమస్యలతో నాయకత్వ బాధ్యతలను సోనియాగాంధీ సక్రమంగా నిర్వహించలేని స్థితి! పార్టీకి అండగా నిలవాల్సిన యువ నాయకుడు రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉంటూ జలగల్లా అధికారాన్ని పీల్చుకొని లబ్ధి పొందిన సీనియర్లు తమ నిజస్వరూపం బయటపెట్టుకోవడం మొదలుపెట్టారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు ఇప్పట్లో కనిపించకపోవడంతో ధిక్కార స్వరాలు వినిపించడం మొదలుపెట్టారు. జీ–23 అంటూ లేఖాస్ర్తాలు సంధించారు. పార్టీలో యువ నాయకత్వం ఎదగడంలో సైంధవ పాత్ర పోషించినవారే అధిష్ఠానాన్ని తప్పుబట్టడం మొదలెట్టారు. మధ్యప్రదేశ్‌లో సింధియా కుటుంబానికి, కాంగ్రెస్‌కూ ఉన్న అనుబంధం విడదీయరానిది. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాధవరావ్‌ సింధియా కీలక నేతగా ఉండేవారు. ఆయన హఠాన్మరణం అనంతరం కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. మధ్యప్రదేశ్‌లో అధికార పగ్గాలను 70 ఏళ్లు దాటిన కమల్‌నాథ్‌కు అప్పగించడంతో జ్యోతిరాదిత్య సింధియా కినుక వహించి చివరకు భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం కేంద్ర మంత్రి అయ్యారు. రాజస్థాన్‌లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. రాజీవ్‌గాంధీ సమకాలీనుడైన రాజేష్‌ పైలట్‌ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడు సచిన్‌ పైలట్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే ఆయన నాయకత్వ లక్షణాలను గుర్తించని కాంగ్రెస్‌ అధిష్ఠానం మరో వృద్ధనేత అశోక్‌ గహ్లోత్‌ను ముఖ్యమంత్రిని చేసింది. నిజానికి రాహుల్‌గాంధీ అభిమతానికి విరుద్ధంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ముఖ్యమంత్రుల ఎంపిక జరిగింది. ఈ ఎంపికలో కాంగ్రెస్‌ సీనియర్లు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల ఒత్తిడికి సోనియాగాంధీ తలొగ్గారు. ఈ పరిణామంతో తాను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ పార్టీ సీనియర్లు తనను స్వేచ్ఛగా పనిచేయనీయరన్న అభిప్రాయానికి వచ్చిన రాహుల్‌ గాంధీ దూరంగా ఉండటం మొదలెట్టారు.


రాహుల్‌ నిస్సహాయత!

కొంతకాలం క్రితం హైదరాబాద్‌ వచ్చిన రాహుల్‌గాంధీని ఆయన కోరిక మేరకు నేను కలిశాను. అప్పుడు ఆయన తన నిస్సహాయతను అన్యాపదేశంగా చెప్పుకొచ్చారు. పార్టీలో తన మాటను చెల్లనివ్వడం లేదన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారని  అప్పుడు నాకు తెలిసింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలో చేర్చుకొని కీలక బాధ్యతలు అప్పగించాలన్న సీనియర్ల ప్రతిపాదనను కూడా రాహుల్‌గాంధీ వ్యతిరేకించారు. ఒక దశలో ఆయన అలిగి పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ప్రశాంత్‌ కిశోర్‌ చేరికకు అడ్డుకట్ట పడింది. పార్టీలో యువ నాయకులకు ప్రాధాన్యం కల్పించకపోవడానికి తాను కారణం కాదన్న భావనను నాడు జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లుగా చలామణి అవుతూ పార్టీపైనే ఆధారపడి బతికినవాళ్లు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. కపిల్‌ సిబల్‌ విషయమే తీసుకుందాం. ఆయన యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రముఖ న్యాయవాది అయిన సిబల్‌కు నిజానికి ప్రజాక్షేత్రంలో బలం లేదు. అయినా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను ఆదరించింది. గులాంనబీ ఆజాద్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతూ ఆయన రాహుల్‌గాంధీపై కొన్ని రాళ్లు వేశారు. రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన విమర్శించారు. నిజమే అనుకుందాం. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆజాద్‌కు ఈ విషయం తెలియదా? అప్పుడు ఎందుకు గొంతెత్తలేదు? యూపీఏ ప్రభుత్వం ఉన్నంతకాలం అధికారం అనుభవించిన ఆజాద్‌కు ఇప్పుడు పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గులాం నబీ ఆజాద్‌ పోషించిన పాత్ర వల్ల ఇప్పుడు తెలుగు రాష్ర్టాలలో, ముఖ్యంగా తెలంగాణలో పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా పోవడం నిజం కాదా? పార్టీ అధిష్ఠానం వద్ద రాజశేఖర రెడ్డి పలుకుబడి అరచేతి మందాన పేరుకుపోవడం వెనుక ఆజాద్‌ పాత్ర లేదా? రాజశేఖర రెడ్డి నుంచి డబ్బు సంచులు అందుకున్న గులాంనబీ ఆజాద్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కళ్లకు గంతలు కట్టారు. ఆజాద్‌ పోషించిన పాత్ర వల్లనే తెలుగునాట రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడయ్యారు. ఫలితంగా ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీకి తెలుగునాట బలమైన నాయకత్వం లేకుండా పోయింది. ఇందిరాగాంధీ హయాంలో రాష్ర్టాలలో బహుళ నాయకత్వం ఉండేది. ప్రత్యామ్నాయ నాయకులను ప్రోత్సహించేవారు. ఈ కారణంగా నాయకుల లేమి కనిపించేది కాదు. డబ్బు సంచులకు అలవాటుపడిన ఆజాద్‌ వంటి వారి వల్ల రాష్ర్టాలలో బహుళ నాయకత్వం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్యను కూడా డబ్బు కోసం ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకులు పీక్కుతినేవారు. ఈ వ్యవహారాలు తెలియని రోశయ్య ఢిల్లీ పెద్దలను సంతృప్తిపరచే బాధ్యతను తన సన్నిహితుడు ఒకరికి అప్పగించారు. రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమకూర్చిన నిధులు కాంగ్రెస్‌ నాయకుల జేబుల్లోకి వెళ్లాయి కానీ పార్టీ ఖాతాల్లోకి కాదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కోసం డజన్ల సంఖ్యలో నాయకులు పోటీ పడే పరిస్థితి ఎందుకొచ్చింది? బలమైన నాయకులను తయారు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా! యూపీఏ అధికారం కోల్పోయి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచే గులాంనబీ ఆజాద్‌ కోవర్టు పాత్ర పోషించారట. మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశాలు వచ్చినప్పటికీ రాజ్యసభలో పార్టీ నాయకుడిగా ఉన్న ఆజాద్‌ అడ్డుకున్న సందర్భాలు ఎన్నో. ఇటువంటి నేపథ్యం ఉన్న ఆజాద్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని విమర్శించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడంలో ఆశ్చర్యపోవల్సింది ఏమీ లేదు. ఈ పరిస్థితికి సోనియాగాంధీ మంచితనం లేదా అమాయకత్వం కారణం. రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం అపరిపక్వంగానే వ్యవహరించింది. తెలంగాణ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆ ఖ్యాతి తమ పార్టీకి దక్కేలా వ్యూహం రూపొందించుకోకుండా కేసీఆర్‌ దీక్ష నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన చేయడం ఏమిటి? 2014 ఎన్నికలకు ముందు విభజన బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన జైరామ్‌ రమేష్‌ నన్ను కలిశారు. కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయని ఆయన ప్రశ్నించగా, ‘మీ ఓటమి తథ్యం!’ అని స్పష్టంగా చెప్పాను. ‘అదేమిటీ! తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఎందుకు ఓడిస్తారు?’ అని ఆయన ప్రశ్నించారు. దీంతో ‘కాంగ్రెస్‌ హై కమాండ్‌ అంటే బంచ్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్స్‌ అని ఇప్పటివరకు అనుకొనేవారు. కానీ బంచ్‌ ఆఫ్‌ ఫూల్స్‌ అని ఇప్పుడే తెలిసింది’ అని నేను వ్యాఖ్యానించాను. ఈ మాటలు కొంచెం నిష్టూరంగా అనిపించినా ఆయన తేరుకొని ‘అదెలా?!’ అన్నారు. ‘‘తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌ మాత్రమే అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ ఇవ్వాలని మీరు నిర్ణయించుకొని ఉంటే ఆ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులను పిలిచి తెలంగాణ కోసం పోరాటాన్ని ఉధృతం చేసి కేసీఆర్‌ను వెనక్కినెట్టండి అని ఆదేశించి ఉండాల్సింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రజలు భావించేవారు’’ అని వివరించాను. ‘‘తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్‌ చెప్పిన మాటలు నమ్మాం’’ అని జైరామ్‌ రమేష్‌ వివరించే ప్రయత్నం చేశారు. ‘‘అలా చెప్పకపోతే తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుందని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయన అలా చెప్పి ఉంటారు’’ అని నేను బదులివ్వడంతో జైరామ్‌ రమేష్‌ మౌనంగా ఉండిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా సుదీర్ఘకాలం కొనసాగిన గులాం నబీ ఆజాద్‌కు ఇక్కడి పరిస్థితులు తెలియవా? అయినా సోనియాగాంధీకి నిజాలు చెప్పలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశంలో నియంతృత్వ విధానాలకు పాల్పడి ఉండవచ్చు గానీ, ఇప్పుడా పార్టీ చచ్చిన పాముతో సమానమైంది. ఇందుకు ప్రధాన కారణం గులాం నబీ ఆజాద్‌ వంటి ఎంతో మంది నాయకులు. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్య విలువలు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం వంటి దుశ్చర్యలకు ఆ పార్టీ స్వస్తి చెప్పింది. ప్రాంతీయ పార్టీలను మింగే ప్రయత్నం చేయకపోగా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతూ తాను బలహీనపడింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడిగా ఎదగడానికి కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడటమే కారణం. కాంగ్రెస్‌ పుంజుకోకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం నిర్మించడం ఇప్పుడు ఎవరికీ సాధ్యం కాదు. ఇందిరాగాంధీ హయాంలో ఆర్టికల్‌ 356 ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తూ ప్రత్యర్థులను లొంగదీసుకున్నట్టుగానే ఇప్పుడు నరేంద్ర మోదీ కేంద్ర సంస్థలను ప్రయోగించి ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ వల్ల లబ్ధి పొందిన నాయకులు ప్రస్తుత కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి రాళ్లు వేయడం క్షంతవ్యం కాదు. ఏక పార్టీ విధానం దేశానికి మంచిది కాదు. ఒకప్పుడు కాంగ్రెస్‌ ఏమి చేసిందో చూశాం. ఇప్పుడు బీజేపీ ఏమి చేస్తున్నదో చూస్తున్నాం. నిజం మాట్లాడుకోవాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచింది, బలహీనపరుస్తున్నదీ కాంగ్రెస్‌ నాయకులే. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి పార్టీని బికారిగా మార్చిన నాయకులు, అధికారం పోగానే గోడ దూకేశారు. ఏడు పదుల వయసులో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతరంతో కనెక్ట్‌ కాగా లేనిది, ఐదు పదుల వయసులో ఉన్న రాహుల్‌గాంధీని యువతరంతో కనెక్ట్‌ చేయకపోవడం ఆ పార్టీ వృద్ధ నాయకుల వైఫల్యం కాదా? ఇప్పుడున్న పరిస్థితులను రాహుల్‌గాంధీ సవాలుగా తీసుకోగలిగితే కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు గురించి దిగులు చెందాల్సిన అవసరం ఉండదు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే రాహుల్‌గాంధీ నాయకత్వంపై పార్టీ నాయకులకే కాదు, ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది. ప్రస్తుతం రాజకీయాలకు నిర్వచనం మారిపోయింది. అధికారమే కేంద్ర బిందువుగా రాజకీయాలు సాగుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు, విధేయతలకు ఇప్పుడు చోటు లేదు. అధికారం ఎటు ఉంటే అటు దూకుతున్నారు. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండి ఉంటే ఆజాద్‌ వంటి వారు పార్టీకి రాజీనామా చేసేవారా?


తెలుగు రాష్ట్రాల్లో మరీ ఘోరం!

తెలుగు రాష్ర్టాల విషయమే తీసుకుందాం. 2014 వరకు కేంద్ర మంత్రులుగా దర్జా అనుభవించినవాళ్లు రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్‌ అధికారం కోల్పోగానే వేరే పార్టీల్లోకి దూకేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల ధోరణి మరీ ఆక్షేపణీయంగా ఉంది. తెలంగాణ ఏర్పడే వరకు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినవాళ్లు ఇప్పుడు కాంగ్రెస్‌ను వదిలేసి అధికారం వైపు జంప్‌ చేశారు, చేస్తున్నారు. స్థానిక నాయకుల మాట నమ్మి తెలంగాణ ఏర్పాటు చేసినందుకు సోనియాగాంధీని నట్టేట ముంచారు. తమకు అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావించడంలో అర్థం ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఎంతో కొంత కృతజ్ఞతాపూర్వకంగా ఉంటున్నారు కదా! తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. అయితే కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేస్తే గెలిచినవారు అధికార పార్టీలోకి జంప్‌ అవడం వల్ల ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితికి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కారణం కాదు కదా? 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా అధికారం అనుభవించిన వారిలో ఇప్పుడు ఎంత మంది కాంగ్రెస్‌ పార్టీలో మిగిలి ఉన్నారు? రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకున్న వాళ్లు అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఈ దుస్థితికి కాంగ్రెస్‌ నాయకత్వ వ్యూహాత్మక తప్పిదాలు కారణమా? స్థానిక నాయకుల స్వార్థం కారణమా? అంటే చెప్పలేం. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా నాయకులు అధికారం చుట్టూ చేరిపోతున్నారు. రాజకీయాలలో చోటుచేసుకుంటున్న మార్పులను ఆకళింపు చేసుకొని తదనుగుణంగా ఎత్తుగడలు రూపొందించుకొనే పార్టీలు మాత్రమే మనుగడ సాగించే పరిస్థితి ఉంది. ప్రజలను మాత్రమే నమ్ముకొని ప్రయోజనం లేదు. మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతున్నందున అక్కడి ప్రజల ఆలోచనా ధోరణులు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఉప ఎన్నిక వల్ల ప్రధాన పార్టీలు పది వేల వంతున ఓటర్లకు పంచుతాయన్న ఆశతో వేల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు అంటే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఉప ఎన్నిక ఎందుకు వస్తున్నది? ఏ పార్టీని ఎందుకు ఎంచుకోవాలి? వంటి ప్రశ్నలకు తావులేదక్కడ. దీన్నిబట్టి ఎన్నిక ఏదైనా అటు ప్రజలకు, ఇటు స్థానిక నాయకులకు ఆశ కల్పించకపోతే ఫలితం ఉండదని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించాలి. అధికారంలో ఉన్న పార్టీలతో ధన బలంతో పోటీ పడలేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీనే కాదు–ఏ ప్రతిపక్షం కూడా నిలబడలేని పరిస్థితి! హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇందుకు మినహాయింపు! అధికారంలో ఉన్నంతకాలం ఏ పార్టీ అయినా బలంగానే కనిపిస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత మనుగడ సాగించగలగడమే గొప్ప. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారం చలాయించిన కాంగ్రెస్‌ పార్టీనే ఇందుకు నిదర్శనం. ఆ పార్టీని చూసి అందరూ జాలిపడే పరిస్థితి వస్తుందని ఎనిమిదేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా? సొంత పార్టీ నాయకులే ద్రోహం చేసి వెళ్లిపోతారని అనుకున్నారా? దేశాన్ని అన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎన్నికల ఖర్చు కోసం చేతిలో చిల్లిగవ్వ లేకుండా బీదగా మిగులుతుందని ఎవరైనా అంచనా వేశారా? ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆ మధ్య సోనియాగాంధీని కలిశారు. ‘మీరు కాంగ్రెస్‌కు ఆర్థిక సహాయం చేయాలనుకుంటే రాష్ట్రంలోని మా పార్టీ నాయకులకు కాకుండా నేరుగా మాకు ఇవ్వండి. ప్రస్తుతం నిధుల కొరతతో పార్టీని నడపలేని పరిస్థితి ఉంది’ అని ఆ సందర్భంగా సోనియాగాంధీ అభ్యర్థించారట. కాంగ్రెస్‌ పార్టీకి ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? అతి పురాతన కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి దుస్థితి రావడం ఏమిటి? ఇందుకు నాయకత్వానికి దూరదృష్టి లేకపోవడమే ప్రధాన కారణం. కాంగ్రెస్‌ నాయకులు అనేక మంది కోటీశ్వరులయ్యారు. పార్టీ మాత్రం దివాలా తీసింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాయకులు ఆర్థికంగా బలపడకుండా కట్టడి చేస్తూ పార్టీ ఖాతాలోకే నిధులు జమ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ధనిక పార్టీ. జరిగిందేదో జరిగింది. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఇప్పటికైనా స్పష్టతతో, అవగాహనతో అడుగులు వేయాలి. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్‌ అవసరం కూడా ఉంది. నాయకుల్లో ఉత్సాహం నింపి ప్రజల మన్ననలు పొందడానికి ఏమి చేయాలో గ్రహించి అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోని పక్షంలో నరేంద్ర మోదీతో అవసరం లేకుండానే కాంగ్రెస్‌ నాయకులే ఆ పార్టీని అంతర్థానం చేస్తారు. తేల్చుకోవలసింది కాంగ్రెస్‌ నాయకత్వమే!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-09-04T06:06:25+05:30 IST