పెగలని దుఃఖం

ABN , First Publish Date - 2020-05-25T09:02:04+05:30 IST

కేలండర్‌ కాయితాలు చిరిగిపోతూనే ఉన్నాయి తుపాను సుడి తీరం దాటలేదింకా సగం తెరిచిన కిటికీలోంచి ఈదురుగాలి వూళ వేస్తోంది...

పెగలని దుఃఖం

కేలండర్‌ కాయితాలు చిరిగిపోతూనే ఉన్నాయి

తుపాను సుడి తీరం దాటలేదింకా 

సగం తెరిచిన కిటికీలోంచి

ఈదురుగాలి వూళ వేస్తోంది


గుండెల మీద నుంచి కసాపిసా తొక్కుకుంటూ

ఎవరో నడచి పోతున్నారు

అడుగులు తడబడుతున్న బుల్లి పాదాల కింద బొబ్బలు చిట్లుతున్న చప్పుడు

దేక్కుంటూ దేక్కుంటూనే కొందరు..

నెత్తిమీద మూట జారుతోంది

కుడి చేతిలోంచి పిల్లగాడి పట్టు సడలుతోంది

నడవలేని పిల్ల ఒకటి అమ్మ కాళ్ళను చుట్టేసుకుని బోరోమని ఏడుస్తూనే ఉంది


నడిరేత్రి కూడా నిప్పులు కురుస్తున్నాయి

ఇనుపకడ్డీలు కరిగి ప్రవాహాలు కడుతున్నాయి

పిడికెడు పొట్లం కోసం

కోటి కడుపులు శోకిస్తున్నాయి

రైలు నడవని పట్టాలు ద్రోహం తలపెడుతున్నాయి


కనిపించని శత్రువు ఒకటి కలలోకి జొరబడింది


కొసా మొదులు లేని రోడ్లు 

మనుషుల్ని పిగులుతున్నాయి

ఆకాశం దిక్కుల్ని కోల్పోయిన చోట

ఏ దిక్కు కోసం ఈ నడక?


వీధి తలుపు తీసి 

సీసాడు నీళ్ళు పోసిన చేతుల్ని

ఆమె చూపులు ముద్దాడాయి

‘భద్రంగా ఉండండయ్యా... పిల్లా పాపా, గొడ్డూ గోదా,

          ముసిలీ ముతకా.. ఇళ్ళలోనే భద్రంగా ఉండండి సామీ..’

...దీవెనో శాపమో!?

ఈ పాపాన్ని కడిగే శానిటైజర్‌ ఏదీ

ఇంకా కనుగొనబడలేదు


పేదవారి కోపం మళ్లీ తృణీకరించబడింది


టీవీ తెర మీద మంత్రదండం 

నాలుగోసారి ప్రత్యక్ష మైంది

హాం ఫట్‌

వేసిన బీగాలు వేసినట్టే ఉన్నాయి

తలుపులన్నీ భళ్ళున తెరుచుకున్నాయి


రాలుతున్న చుక్క చూపిన దారిలో

నడక సాగుతూనే ఉంది

అగ్గి తొక్కుతున్న అడుగుల శబ్దం..

లబ్‌ డబ్‌.. డబ్‌.. డబ్‌..

లోపలో బయటో!

ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు


Updated Date - 2020-05-25T09:02:04+05:30 IST