Advertisement
Advertisement
Abn logo
Advertisement

గొంతు దిగని గోరుముద్ద

  1. ఉడికీ ఉడకని అన్నం.. కంపు కొట్టే కూరలు
  2. మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు తిలోదకాలు
  3. మెనూ పాటించని భోజన ఏజెన్సీలు
  4. ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు
  5. పర్యవేక్షణకు వెళ్లిన రోజే మంచి భోజనం
  6. అంతా బాగుందని జిల్లా అధికారుల కితాబు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: ‘ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల పరిశీలన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. పాఠశాల అభివృద్ధి కమిటీలో ముగ్గురు, వార్డు, గ్రామ సచివాలయ విద్య, సంక్షేమ అధికారులు నాణ్యతను పరిశీలించే బాధ్యతను అప్పగిస్తున్నాం..’ ఇవి మధ్యాహ్న భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నామకరణం చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో చెప్పిన మాటలు. ఈ మాటలు బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో పరిశీలనలు నామమాత్రంగా మారాయి. జిల్లా ముఖ్య అధికారులు అప్పుడప్పుడు తనిఖీ చేసి అంతా బాగానే ఉందని చెబుతున్నారు. విద్యార్థులను అడిగితే ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. ముద్దగా మారిన అన్నం, రుచిపచి లేని కూరలు, మురిగిపోయిన గుడ్లను అందిస్తున్నారని వాపోతున్నారు. ఈ భోజనం తినలేక చాలామంది ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. జగనన్న గోరుముద్దపై ఆధారపడ్డవారు అర్ధాకలిలోనూ, కడుపు నొప్పితోనూ ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఆ వివరాలు ఇవి.


అన్నం తినలేక..


‘జగనన్న గోరుముద్ద’ పథకం ద్వారా జిల్లాలోని 4.22 లక్షల మంది విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతున్నామని, దానికోసం ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోందని అధికారులు గొప్పగా చెబుతున్నారు. అధికారులు చెబుతున్న లెక్కలకి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. కర్నూలు బి.క్యాంపు బాలుర హైస్కూలులో 467 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో మంగళవారం 328 మందికి మధ్యాహ్న భోజనం పెడుతున్నామని ప్రధానోపాధ్యాయుడు, నిర్వాహకులు తెలిపారు. భోజనం పెట్టే సమయంలో పరిశీలిస్తే, చాలామంది కేవలం గుడ్డును మాత్రమే తీసుకుని వెళ్లిపోయారు. ఇదేమిటని విద్యార్థులను అడిగితే, సరిగా ఉడకని అన్నం పెడుతున్నారని, అది తింటే కడుపు నొప్పి వస్తోందని అన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది. ముద్ద ముద్దగా ఉన్న అన్నం, పప్పు కంపు కొడుతుండడంతో విద్యార్థినులు అన్నాన్ని పడేశారు. రోజూ ఇదే పరిస్థితి అని, అన్నం తినలేక పడేస్తున్నామని, సాయంత్రం వరకు ఆకలితో ఉండలేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. 


ఒకటే లెక్క


ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులే ఉంటారు. పిల్లలు ఒక్క పూటైనా కడుపునిండా తింటారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం వండి పెట్టాల్సిన నిర్వాహకులు నాణ్యతను పాటించడం లేదు. డబ్బును మిగుల్చుకునే పనిలో పడ్డారు. నీళ్ల చారు, కుళ్లిన కూరగాయలతో పప్పు, కూరలు చేసి పెడుతున్నారు. విద్యార్థుల హాజరు ఆధారంగా బియ్యం, వంట సరుకులను వినియోగించాలి. కానీ రెండు మూడు వందలమంది హాజరైనా 15-20 కేజీల బియ్యంతోనే సరిపెడుతున్నారు. ఎందుకు ఇలా అని అడిగితే, విద్యార్థులు ఎక్కువ తినరని, పడేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంట్లో వండినట్లు కాకపోయినా కనీసం తినగలిగేలా ఉంటే చాలని విద్యార్థులు అంటున్నారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే వాంతి వచ్చినట్లు ఉంటోందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


నిర్వాహకులంతా వారే..


మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ఒక్కో పాఠశాలలో ఒక్కో ఏజెన్సీకి అప్పగించారు. అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికి ఇచ్చారని సమాచారం. కొన్నిచోట్ల అధికారపార్టీ నాయకుల అండతో ఒక్కొక్కరు రెండుమూడు పాఠశాలల్లో ఏజెన్సీలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకుల అండను చూసుకుని భోజనం నాణ్యతకు తిలోదకాలిచ్చారు. భోజనం బాగాలేదని చాలామంది విద్యార్థులు పాఠశాలలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయని ఉపాధాయులే చెబుతున్నారు. అయినా నిర్వాహకుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. జిల్లా ముఖ్య అధికారులు, సంబంధిత శాఖ అధికారులు తనిఖీలకు వెళ్లినపుడు ముందుగానే సమాచారం ఉండడంతో వారికి నచ్చేలా వండిపెడుతున్నారు. దీంతో అధికారులు అంతా బాగానే ఉందని ప్రకటనలు ఇస్తున్నారు. తనిఖీల సమయంలో పొరపాటున ఎవరైనా దొరికిపోయినా, అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని, వారిపై చర్యలు లేకుండా చూస్తున్నారని సమాచారం. 


ఇంటి నుంచే భోజనం


జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సగం మంది విద్యార్థులు ఇంటినుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం సరిగాలేక, కడుపునొప్పి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. మెనూ ప్రకారం అన్నంతోపాటు పుప్పు చేసి కోడిగుడ్డు ఇచ్చారు. పాఠశాలలో మొత్తం 502 మంది విద్యార్థులు ఉండగా 250 మంది హాజరయ్యారు. వీరిలో సగం మంది ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకున్నారు.


అన్నం తినలేక పాట్లు


పాములపాడు మండలంలోని ఏఎన్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో లావు బియ్యంతో అన్నం చేస్తున్నారు. విద్యార్థులు తినలేక పాట్లు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ అమలుకు నోచుకోలేదు. దీంతో చౌకదుకాణాల్లో లభించే బియ్యంతోనే అన్నం వండిపెడుతున్నారు. ఈ అన్నాన్ని తినలేక చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. శుద్ధజలాలు అందుబాటులో లేకపోవడంతో ఇళ్ల నుంచే నీళ్ల బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. భోజనశాల లేకపోవడంతో ఆరుబయట ఎండలో కూర్చుని తింటున్నారు. ఈ విషయంపై ఇన్‌చార్జి హెచ్‌ఎం రవిచంద్రను వివరణ కోరగా చాలా మంది విద్యార్థులకు సన్నబియ్యంతో తయారు చేసే అన్నం తినడం అలవాటైందని, లావు బియ్యం అన్నాన్ని వడ్డించడం వల్ల వారు తినలేక ఇళ్ల వద్ద నుంచే తెచ్చుకుంటున్నారని అన్నారు. 


అడిగేదెవరు..?


కోసిగి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, నాడు-నేడు పథకానికి మొదటి ఫేజ్‌లో ఎంపికైంది. 

విద్యార్థినులు సంఖ్య: 880

హాజరు: 531 

మెనూ: పులిహోర, టమోటా పప్పు, గుడ్డు (మంగళవారం)

విద్యార్థులకు వడ్డించినది: ముద్దకట్టిన పులిహోర, టమోటా చారు

గుడ్డు: స్టాక్‌ లేదని వారం రోజులుగా ఇవ్వడం లేదు 

తాగునీరు: పాఠశాలలో ఆర్వో మినరల్‌ ప్లాంట్‌ పనిచేయటం లేదు. విద్యార్థినులు ఇంటి నుంచి బాటిళ్లలో తాగునీరు తెచ్చుకుంటున్నారు.


అన్నం అయిపోయింది..


పాఠశాలలో మెనూ పాటించడం లేదు. అధికారులు పట్టించుకోవటం లేదు. పైగా వండిన భోజనం దాదాపు 30 మందికి తక్కువ వచ్చింది. వారంతా ఖాళీ ప్లేట్లతో కనిపించారు. చాలా మంది విద్యార్థినులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకున్నా భోజనం తక్కువరావటం నిర్వాహకుల తీరును చెబుతోంది. ఈ రోజు మాత్రమే 30 మందికి భోజనం తక్కువ వచ్చిందని హెచ్‌ఎం నీలకంఠ అన్నారు. ఎక్కువ శాతం పిల్లలు ఇంటి నుంచి క్యారియర్‌లు తీసుకు వస్తున్నారని తెలిపారు. స్టాకు లేకపోవటంతో ఆరు రోజులుగా గుడ్డు ఇవ్వడం లేదని, ఆర్వో ప్లాంటు సాంకేతిక లోపం కారణంగా పనిచేయడం లేదని తెలిపారు. రెండు రోజులలో మరమ్మతు చేయిస్తామని అన్నారు.


రోజూ హోటల్లో తింటున్నా


మా అమ్మ లేదు. మా నాన్న ఆటో నడుపుతాడు. నేను రోజూ వెంకాయపల్లె నుంచి వస్తాను. నాలాగే చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తారు. పొద్దునే క్యారియర్‌ కట్టుకోడానికి కుదరదు. పాఠశాలలో పెట్టే భోజనం తినడానికి వీలుగా ఉండదు. టీచర్లకు చెప్పినా ప్రయోజనం లేదు. నిర్వాహకులను అడిగితే ఇది పెట్టడమే ఎక్కువ అన్నట్లు మాట్లాడుతున్నారు. వారు పెట్టే భోజనం తినలేక రోజూ హోటల్లో టిఫిన్‌ చేస్తుంటాము. డబ్బులు లేని రోజు ఆకలితోనే సాయంత్రం వరకు ఉండాల్సి వస్తోంది.


- ఎబ్‌నేజర్‌, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బి.క్యాంపు, కర్నూలు


ముద్ద దిగదు..


పాఠశాలలో వండే భోజనం తినాలంటే ప్రాణం మీదకు వస్తోంది. రోజూ ఇదే తీరు. టీచర్లకు చెబితే ‘మేము చూసుకుంటాములే’ అని అంటారు. ఏ రోజూ కడుపునిండా తిన్నది లేదు. ఈ రోజు కూడా అన్నం, పప్పు వాసన వస్తుంటే పడేశాం. నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నాం. సక్రమంగా వండిపెడితే బాగుంటుంది.


- మానస, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, బి.క్యాంపు, కర్నూలు


ఎవరూ పట్టించుకోరు..


మా తల్లిదండ్రుల కూలి పనులు చేస్తుంటారు. స్కూల్లో భోజనం పెడతారు కదా అని పంపిస్తారు. ఇక్కడేమో భోజనం ఏమాత్రం బాగుండదు. ఏదో ఒకరోజు మాత్రమే అన్నం, కూరలు బాగుంటాయి. మిగతా రోజులన్నీ అన్నం తినడానికి వీలుగా ఉండదు. సగం తిని సగం పడేస్తుంటాము. టీచర్లకు చెప్పినా, వంట వాళ్లకు చెప్పినా పట్టించుకోరు.


- తేజస్విని, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, బి.క్యాంపు, కర్నూలు


రుచికరంగా లేదు


  1. మెనూ ప్రకారం భోజనం అందించాలి
  2. జడ్పీ చైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి


వెల్దుర్తి, డిసెంబరు 1: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. బుధవారం ఆయన వెల్దుర్తి బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ భోజనం రుచికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. పాఠశాలకు సన్న బియ్యం వస్తున్నాయా? అని ఆరా తీయగా.. రావడంలేదని ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారు. బాలికల పాఠశాలలో గదుల కొరత, కోతుల బెడద ఎక్కువగా ఉందని, అదనపు గదుల పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి జడ్పీ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వెల్దుర్తి వైసీపీ మండల కన్వీనర్‌ రవిరెడ్డి, జడ్పీటీసీ సుంకన్న, ఎంపీడీవో సుబ్బారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement