Sep 23 2021 @ 01:10AM

త్వరలో సాయితేజ్‌ మనమధ్యకు వస్తాడు!

‘‘భగవంతుడి దీవెనలతో, ప్రేక్షకాభిమానుల ఆశీస్సులతో ఆస్పత్రిలో సాయితేజ్‌ త్వరగా కోలుకుంటున్నాడు. త్వరలో మనమధ్యకు వస్తాడు. తన ‘రిపబ్లిక్‌’ చిత్రం ట్రైలర్‌ విడుదల చేయడం భారంగా, భావోద్వేగంగా ఉంది’’ అని చిరంజీవి అన్నారు. సాయితేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వం వహించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో లో జె. భగవాన్‌, జె. పుల్లారావు నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం చిరంజీవి ట్రైలర్‌ విడుదల చేశారు. అందులో ‘సమాజంలో తిరిగే అర్హతే లేని గూండాలు పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే... కంట్రోల్‌ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయి’, ‘రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆదేశాలు మారణ హోమానికి దారి తీస్తే... ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటోళ్లు హిట్లర్లు అవుతారు’ అని సాయితేజ్‌ పలికిన సంభాషణలు, ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే... మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్‌’ అని రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులను ఆకర్షించాయి. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చూస్తుంటే రొమాంచితంగా అనిపించింది. ప్రజలకు ఎలాంటి రాజకీయ వ్యవస్థను ఎన్నుకోవాలో తెలియజేసే ప్రయత్నం... రౌడీయిజాన్ని అరికట్టాలని యువ కలెక్టర్‌ పడే తాపత్రయం... ప్రజలను చైతన్యపరిచే చిత్రంలా ఉంది.  కమర్షియల్‌ సినిమాగా అందరి మన్ననలు ‘రిపబ్లిక్‌’ అందుకుంటుందని అర్థమవుతోంది’’ అని చెప్పారు. ఐశ్వర్యా రాజేశ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.


ఊటీలో ‘గాడ్‌ ఫాదర్‌’

చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ తాజా షెడ్యూల్‌ ఊటీలో ప్రారంభమైంది. రాజకీయ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. ఊటీలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌, సమర్పణ: కొణిదెల సురేఖ.