పేపర్‌ స్లిప్పులు.. గ్లౌజ్‌లు !

ABN , First Publish Date - 2020-06-02T10:19:01+05:30 IST

కరోనా విజృంభ ణ నేపథ్యంలో పెరిగిన ప్లాస్టిక్‌ గ్లౌజ్‌లు, మాస్క్‌ల వినియోగం తో పర్యావరణంపై ప్రభావం పడుతోంది. నాన్‌

పేపర్‌ స్లిప్పులు.. గ్లౌజ్‌లు !

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి...

వైరస్‌ వ్యాప్తి నివారణకు ఉపయుక్తం

పురపాలకశాఖ నుంచి త్వరలో ఉత్తర్వులు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభ ణ నేపథ్యంలో పెరిగిన ప్లాస్టిక్‌ గ్లౌజ్‌లు, మాస్క్‌ల వినియోగం తో పర్యావరణంపై ప్రభావం పడుతోంది. నాన్‌ బయో డిగ్రేడబుల్‌ వ్యర్థాల నిర్వహణ కష్టంగా మారుతోంది. వీటి ద్వారా కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ కొవిడ్‌ నియంత్రణ వస్తువులు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వ విభాగాలు దృష్టి సారించాయి. ప్లాస్టిక్‌ రహిత వస్తువుల వినియోగానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌ల స్థానంలో పేపర్‌ స్లిప్పులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. దీంతో పురపాలక శాఖ విధివిధానాల రూపకల్పనపై దృష్టి సారించింది. లాక్‌డౌన్‌లో ఇప్పటికే భారీ సడలింపులనిచ్చారు. సాధారణ జన జీవనం మొదలైంది. సూపర్‌ మార్కెట్లు ప్రారంభం కాగా.. ఈ నెల 8వ తేదీ నుంచి మాల్స్‌, హోటళ్లను ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా భయంతో మెజార్టీ పౌరులు ఆన్‌లైన్‌ లావాదేవీ ల వైపు మొగ్గు చూపుతున్నారు.


నగదు ఇవ్వకుండా కార్డులు, పే యాప్‌లను వినియోగిస్తున్నారు. మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, హోటళ్లలో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో పాస్‌ వర్డ్‌ ఎంట ర్‌ చేసేందుకు పీఓఎస్‌ యంత్రంపై వినియోగదారులు బటన్‌లు నొక్కాల్సి ఉంటుంది. ఇది వైరస్‌ వ్యాప్తికి దారి తీస్తుంద న్న భయంతో చాలా మంది షాపింగ్‌ చేసేప్పుడు నాన్‌ బయో డిగ్రేడబుల్‌ గ్లౌజ్‌లు వాడుతున్నారు. వీటికి బదులు వేలికి ధరించేలా పేపర్‌ స్లిప్పులు అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. బిల్లింగ్‌ కౌంటర్ల వద్ద పేపర్‌ స్లిప్పులు ఉండేలా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎంలలోనూ పేపర్‌ స్లిప్పులను వినియోగించవచ్చు. టచ్‌ సెన్సిటివిటీ ఉండేలా ప్రత్యామ్నాయ నియంత్రణ వస్తువులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు. 


త్వరలో విధివిధానాలు... 

నగరంలో పలు విధానాలను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ పురపాలక శాఖకు వివరాలు పంపింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నాన్‌ బయో డిగ్రేడబుల్‌ వస్తువుల వినియోగానికి సంబంధించి పురపాలక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. పేపర్‌ స్లిప్పుల వినియోగాన్ని తప్పనిసరి చేయనుంది. ఇప్పటికే పేపర్‌ వస్తువులు తయారు చేసే పరిశ్రమలతో జీహెచ్‌ఎంసీ అధికారులు చర్చిస్తున్నట్టు తెలిసింది.  


Updated Date - 2020-06-02T10:19:01+05:30 IST