May 11 2021 @ 18:42PM

రాఖీ సావంత్ ‘తదుపరి ప్రధాని’ వ్యాఖ్యలపై స్పందించిన సోనూసూద్

ముంబై: కరోనా మహమ్మారి బారినపడిన దేశానికి ఇప్పుడెవరైనా ఆపద్బాంధవుడు ఉన్నాడూ అంటే అంది ఒక్క సోనూ సూదే. స్వతహాగా విలన్ వేషాలు వేసే సోనూ సూద్ ఇప్పుడు దేశ ప్రజలు ఆరాధ్య దైవం. ఆపదలో ఉన్నామన్న ఒక్క ట్వీట్‌ చాలు.. క్షణాల్లోనే స్పందిస్తాడు. నిమిషాల వ్యవధిలోనే వారికి అవసరమైన సాయాన్ని అందిస్తాడు. అందుకే ఇప్పుడు దేశ ప్రజలు ప్రభుత్వాన్ని మాని సోనూ సూద్ వైపు చూస్తున్నారు. అతడి దయార్థ్ర హృదయానికి దేశం మొత్తం చేతులెక్కి మొక్కుతోంది. 


కరోనా వేళ అల్లాడిపోతున్న ప్రజలకు తానున్నానంటూ ధైర్యం చెబుతూ ఆపన్నహస్తం అందిస్తున్న సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తున్న బిగ్‌బాస్ 14 పోటీదారు రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై తాజాగా సోనూ స్పందించాడు. తన అపార్ట్‌మెంట్‌లో ఫొటోగ్రాఫర్లకు సమ్మర్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ కనిపించిన సోనూ సూద్.. రాఖీ ఐడియాపై మాట్లాడుతూ.. ‘‘నేను సాధారణ వ్యక్తిగా ఉండడానికే ఇష్టపడతా’’ అని కుండబద్దలుగొట్టాడు. 

ఓ ఫొటోగ్రాఫర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ప్రయత్నించవచ్చు కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా సోదరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందులోకి వెళ్లి నేనేం చేస్తారు. అది నా పని కాదు’’ అని తేల్చి చెప్పాడు. సోనూ ప్రధాని కావాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో రాఖీ ఒక్కరే కాదు.. కొన్ని రోజుల క్రితం కమెడియన్ వీర్ దాస్ కూడా 2024లో సోనూ సూద్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ప్రచారానికి ట్విట్టర్‌లో వేలాది గొంతులు తోడయ్యాయి. 


కరోనా వైరస్ రెండో వేవ్‌తో దేశం అల్లాడిపోతుంటే సోనూ సూద్ మాత్రం బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్, అవసరమైన మందులు సరఫరా చేస్తూ ఊపిరి సలపకుండా ఉన్నాడు. తన ఆంటీకి ఆక్సిజన్ సిలిండర్ పంపించాల్సిందిగా క్రికెటర్ సురేశ్ రైనా ఇటీవల చేసిన ట్వీట్‌కు స్పందించిన సోనూ సూద్ క్షణాల్లోనే దానిని అందించాడు. సోను తన ఫోన్ నంబరును ఇప్పటికే బహిరంగపరచడంతో సాయం కోసం అర్థిస్తూ వస్తున్న మెసేజ్‌లు, ఫోన్లతో నిత్యం అది మోగుతూనే ఉంటోంది.