అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు నటుడు సోనూసూద్ ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబును సోనూసూద్ పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవ్వాల్సిన అసెంబ్లీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. శాసనసభలో విధ్వంస ధోరణి సరికాదని, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూసూద్ చెప్పారు.
అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మొదటిసారి విలపించారు. తన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాటలు అన్నారని గద్గద స్వరంతో చెబుతూ... ఆయన ఆవేదన ఆపుకోలేక ఏడ్చేశారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన విలపించిన సంఘటనను ఎవరూ చూడలేదు. అత్యంత బాధాకర సంఘటనల్లో కూడా కంటనీరు కూడా ఎవరి కంటపడకుండా నిగ్రహించుకోవడం ఆయనకు అలవాటు. ఆయన వెక్కివెక్కి విలపించడం మైక్‌లో స్పష్టంగా వినిపించింది.