Abn logo
Aug 9 2020 @ 12:07PM

మాయమైపోలేదమ్మా మనిషన్నవాడు..!

ముంబయిలోని వసాయి ప్రాంతం..

బస్సులన్నీ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మూతికి మాస్కు కట్టుకుని, చేతిలో కొబ్బరికాయ పట్టుకుని వచ్చాడొక వ్యక్తి. బస్సుకు పసుపు, కుంకుమ రాసి, కాయ కొట్టాడు. దేవుడా..! వీళ్లందర్నీ క్షేమంగా గమ్యం చేర్చు, ఎలాంటి ఆటంకం కలగనివ్వకు.. అంటూ కళ్లు మూసుకుని, ఆకాశం వైపు చూస్తూ ప్రార్థించాడు. బస్సు కిటికీ అద్దాల్లో నుంచి పీక్కుపోయిన ముఖాలతో, అలసిపోయిన దేహాలతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారంతా. తల పైకెత్తి చూశారు. అప్పటికే మైళ్ల దూరం నడిచిన నీరసంతో కళ్లు బైర్లు కమ్ముతున్నాయి తప్పిస్తే.. దేవుడు కనిపించలేదు. కొబ్బరికాయ కొట్టి తమ కోసం దేవున్ని వేడుకుంటున్న ఆ వ్యక్తే.. ఆ సమయానికి దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు అనిపించింది. అతనికి చేతులు జోడించి.. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. 


ఆయన గుడిలో దేవుడు కాదు..

ఇన్నాళ్లూ సినిమాల్లో పేదోళ్ల పక్షాన ఫైట్లు చేసి, ఒఠ్ఠి డైలాగులు చెప్పిన అభిమాన హీరో అసలే కాదు..

బస్సులు, రైళ్లు, ఫ్లయిట్లను పుష్పక విమానాల్లా కిందికి దింపి.. చేతిలో చిల్లిగవ్వలేని పేదోళ్లందర్నీ ఊళ్లకు పంపించిన ఆపద్భాందవుడు.. వలసకూలీల మెస్సయ్య.. సోనూసూద్‌. 

అతను సినిమాల్లో నరరూప రాక్షసుడు.. కరుడుగట్టిన విలన్‌. ప్రజలను పీల్చిపిప్పి చేయడమే తప్ప తిరిగివ్వడు. 

అరుంధతిలో పగపట్టిన అఘోరా. జులాయ్‌లో గజదొంగ. అతడులో హంతకుడు. దూకుడులో కిలాడీ. ఏ పాత్ర చేసినా అదే క్రూరత్వం, మచ్చుకైనా కనిపించదు మానవత్వం. హీరోల చేతుల్లో దెబ్బలు తినీతినీ రాటుదేలి విలన్‌ అయ్యాడు కానీ.. ప్రజల మనసుల్లో నిజమైన హీరో కాలేకపోయాడు. ఎందుకంటే నిజజీవితంలో ఎంత మంచోడైనా సరే.. సినిమాలో విలనైతే చాలు. ప్రేక్షకుల మనసుల్లో చెడుముద్ర పడుతుంది. ఆ విలనిజం ఎంత తీవ్రంగా ఉంటే ప్రత్యర్థి హీరో అంత మంచోడవుతాడు. కరోనా పుణ్యమాని..ఈ ఇమేజ్‌ తిరగబడింది. కట్టుబట్టలతో రోడ్లపాలైన పేదలకు చిల్లిగవ్వ విదిల్చని హీరోలను కాస్త విలన్లుగా.. విలన్లను హీరోలుగా మార్చేసింది మహమ్మారి. అలా బాలీవుడ్‌ విలన్‌ సోనూసూద్‌కు తన కెరీర్‌లో ఎన్నడూ రానంత క్రేజ్‌ వచ్చేసింది. ఇదేదో మన పొగడ్త కాదు. కరోనా కష్ట కాలంలో సహాయం చేసిన మానవతావాదులు ఎవరు? ర్యాంకులు ఇచ్చేందుకు సెలబ్రిటీలపై సర్వే చేసింది ప్రఖ్యాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ (ఐఐహెచ్‌బి). 


ప్రధానమంత్రి సహాయనిధికి పాతిక కోట్లు ఇచ్చిన అక్షయ్‌కుమార్‌ను, పెద్ద మొత్తాన్ని ఇచ్చిన అమితాబ్‌బచ్చన్‌ను వెనక్కినెట్టి నెంబర్‌వన్‌ ర్యాంకు కొట్టేశాడు సోనూసూద్‌. వాళ్లిద్దరూ రెండు మూడు స్థానాలకు పరిమితం అయ్యారు. సర్వేలో సోనూభయ్యా టాప్‌ హ్యుమానిటేరియన్‌. నాలుగు, ఐదో స్థానంలో ఆయుష్మాన్‌ ఖురానా, తాప్సీపన్ను నిలవగా.. ఆ తరువాత విరాట్‌కోహ్లీ, రణబీర్‌కపూర్‌, రణవీర్‌సింగ్‌, దీపికా పదుకొనె చేరారు. రాత్రికి రాత్రే ఇంత ప్రజాధరణ పొందిన ఏకైక ప్రతినాయకుడు సోనూసూద్‌ ఒక్కడే!. 


వ్యవస్థ చేయలేని పని వ్యక్తి చేశాడు..


కూలీల ఇళ్లలో కిలో బియ్యం ఉన్నాయా.. ఏ పూటకు ఆ పూట బతికేటోళ్లు ఎలా బతకాలి? పనులు లేకపోతే ఇల్లు గడిచేదెలా? ఒకవేళ ఊర్లకు వెళ్లాలనుకుంటే చేతిలో ఛార్జీలకు డబ్బులున్నాయా? కరోనా సోకితే నగరాల్లో వైద్య ఖర్చులను భరించగలరా? ఇవేవీ ఆలోచించలేదు ప్రభుత్వం. అసలు దేశవ్యాప్తంగా ఇంతమంది పేదలున్నారన్న విషయం లాక్‌డౌన్‌కు ముందు తెలియదేమో? సర్కారు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించింది. బస్సులు, రైళ్లు లేక, ఊళ్లకు వేళ్లలేక, ఉన్నచోట ఉండలేక.. మూటాముల్లె సర్దుకుని.. మైళ్లకు మైళ్లు నడిచిన వలసకూలీల బాధలు చెప్పనలవి కాదు. మండు వేసవిలో కాళ్లకు చెప్పుల్లేకుండా నడిచిన దృశ్యాలు కంటతడి పెట్టించాయి. కొందరైతే రోడ్లపైనే కుప్పకూలి ఊపిరి వదిలారు కూడా. మీ చావు మీరు చావండని వాళ్లనలా వదిలేయడం అమానవీయం. 


పత్రికలు, టీవీల్లో కూడా వలసకూలీల వెతలు కాస్త ఆలస్యంగానే వెలుగుచూశాయి. వాటిని చూశాక సాయం చేయడానికి ఎంతోమంది మానవతావాదులు, సామాజిక సేవా కార్యకర్తలు ముందుకు వచ్చారు. ఒక ఉదయం టీవీ చూస్తున్న సోనూసూద్‌కు కూడా ఇదే ఆలోచన వచ్చింది. లాక్‌డౌన్‌లో బాధలు పడుతున్న పేదలకు తనవంతు ఏదో ఒకటి చేయాలన్న తలంపు వచ్చింది. ... ‘నేను ఎక్కడికి వెళ్లినా రోడ్ల నిండా అలసిపోయిన ముఖాలతో, తీవ్రమైన నిరాశతో కనిపించేవారు పేదలు. కొందరైతే చంటిపిల్లల్ని చంకన ఎత్తుకుని, నెత్తిన బట్టల మూటల్ని పెట్టుకుని, ఆందోళనతో వెళుతుండేవారు. ఎవర్ని కదిలించినా కన్నీటిగాథలే. అప్పటికే నేను రోజూ వలసకూలీలకు ఉచిత భోజనం పెడుతుండేవాణ్ణి. ఎంత చేసినా తమ సొంతూర్లకు వెళితేనే తమకు మనశ్శాంతి దొరుకుతుందని చెప్పేవాళ్లు..’ అన్నాడు సోనూసూద్‌. మొదట్లో ఆయన రోజుకు వెయ్యిమందికి అన్నం పెట్టేవాడు.. మెల్లగా ఆ సంఖ్య నలభైఐదువేలకు చేరుకుంది. ఊళ్లకు బయలుదేరిన వాళ్లకు బయట తిండిలేదు. హోటళ్లు లేవు. సోనూ ఉచిత భోజనమే లక్షలమంది ఆకలితీర్చింది.


ట్వంటీఫోర్‌ అవర్స్‌ జాబ్‌..


వలసకూలీల తరలింపునకు ఒక ప్రత్యేక బృందాన్ని (మిషన్‌ ఘర్‌ భేజో) ఏర్పాటు చేశాడు సోనూ. ఫోన్లు రిసీవ్‌ చేసుకునేందుకు నలభై మంది వాలంటీర్లు, ప్రయాణ వ్యవహారాల్ని చక్కబెట్టేందుకు మరో ఇరవైమంది. వీళ్లంతా సేవాభావంతో ముందుకొచ్చిన వాళ్లే!. ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ప్రకటించాడు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసి ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకోవచ్చు. వెళ్లే ఊరిని బట్టి బస్సు లేదా రైళ్ల వివరాలను చేరవేస్తుందీ బృందం. సూచించిన ప్రదేశానికి చేరుకుంటే.. అక్కడ వాహనాలు సిద్ధంగా ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా పిల్లాపాపలతో క్షేమంగా ఊళ్లకు చేరుకోవచ్చు. ప్రయాణికులకు ఉచిత రవాణాతోపాటు తినడానికి తిండి, నీళ్ల సీసాలు, అత్యవసరమైతే కొన్ని మందులు పంపిణీ చేశారు. సోనూసూద్‌లో దానగుణం ఈస్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఏకంగా చార్టర్డ్‌ ఫ్లయిట్స్‌ను కూడా అద్దెకు తీసుకుని ప్రయాణికులను ఊళ్లకు పంపాడు. లాక్‌డౌన్‌ స్వల్ప సడలింపు తరువాత - కేరళ నుంచి భువనేశ్వర్‌కు, ముంబయి నుంచి ఉత్తరాఖండ్‌కు, ముంబయి నుంచి అసోంకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశాడాయన. ఒక్కో విమానానికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అదంతా సోనూసూద్‌ ఒక్కడే భరించాడు. ఒక దశలో అద్దెకు విమానాలు దొరకలేదు. అప్పుడు మూడువేల నాలుగు వందల ఫ్లయిట్‌ టికెట్లను కొనుగోలు చేసి పేదలకు పంచాడు. ఇళ్లలో తల్లిదండ్రులు చనిపోతే ఊళ్లకు అర్జంట్‌గా వెళ్లాలనుకునేవాళ్లు, గర్భిణులు, దీర్ఘకాల జబ్బులున్న వాళ్లు, చంటిపిల్లలున్న తల్లులు, నిరాశ్రయులు.. ఇలాంటి వాళ్లను గుర్తించి, తొలి ప్రాధాన్యం ఇచ్చింది సోనూ బృందం. 


రైళ్లు, బస్సులు, విమానాల్లో..


దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వలసకూలీలు నిలిచిపోయారు. వాళ్లందరికీ రైళ్లల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాల్సింది ప్రభుత్వాలే! కానీ, ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకున్నాయి. సర్కారీ వ్యవస్థ చేయలేని పని.. సోనూసూద్‌ ఒక వ్యక్తిగా చేయగలిగాడు. రైల్వేశాఖకు లక్షల డబ్బులు చెల్లించి.. శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేశాడు. సినిమాల్లో అతనికంటే ఇరవై ముప్పయి రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకునే స్టార్‌ హీరోలకు రాని ఆలోచన అతనికి వచ్చింది. జూన్‌ ఎనిమిదిన నాలుగు శ్రామిక్‌ రైళ్లలో సుమారు తొమ్మిదివేల మందిని ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చేరవేశాడు. తిరిగి జూన్‌ పదహారున, జులై రెండున బాంద్రా రైల్వేస్టేషన్‌ నుంచి మరో రెండు రైళ్లలో ప్రయాణికుల్ని తరలించాడు. అంతకుమునుపు మే ఆఖరి వారంలో థానే నుంచి ఉత్తరప్రదేశ్‌కు రెండు రైళ్లలో నాలుగువేల మందిని పంపించాడు. అదే ముంబయి నుంచి బిహార్‌కు, కోల్‌కతాకు కొన్ని రైళ్లను నడిపించాడు. కరోనాతో జనమంతా భయాందోళనలో మునిగిపోయిన సమయం అది. బయటికి రావాలంటే గుండెలు అదిరిపోయేవి. అలాంటిది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మాస్కు కట్టుకుని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోకి వచ్చాడు సోనూసూద్‌. ఆయనే స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. పేదలకు ధైర్యం నూరిపోశాడు. అతను ఎక్కడికెళితే అక్కడికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. 

బస్సులు, రైళ్లు, విమానాల ఏర్పాట్ల బిజీలో రాత్రిళ్లు రెండు మూడు గంటలకు మించి నిద్రపోయేవాడు కాదు.  


అసూయపడ్డ స్టార్‌లు..


దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిబంధన. అద్దె బస్సులు, రైళ్లను మాట్లాడుకోవడం, రవాణా అనుమతులు తీసుకోవడం, ప్రయాణికుల వివరాల్ని నమోదుచేయడం.. ఇవన్నీ తలకు మించిన భారమే. ఎన్ని ఏర్పాట్లు చేసినా జనం ఇంకా మిగిలే ఉన్నారు. ముంబయిలో చిక్కుకుపోయిన తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌ వాసులను సుమారు వంద బస్సుల్లో తరలించాడు. సోనూసూద్‌ వలసకూలీలను ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో పంపించాడన్న విషయం మాత్రమే తెలుసు కానీ.. ఆయన ప్రత్యేకంగా మరిన్ని టికెట్లు కొని పంచిన విషయం చాలామందికి తెలీదు. ఒక్క ముంబయి రైల్వేస్టేషన్‌ కౌంటర్‌లోనే నలభైవేల టికెట్లు, మరో ఇరవై ఎనిమిది వేల తత్కాల్‌ టికెట్లు కొన్నాడు. ఇవన్నీ ముంబయి నుంచి చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, సూరత్‌, నాసిక్‌, కేరళ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అందజేశాడు. వీటన్నిటికీ డబ్బులు ఎలా వస్తున్నాయి? నువ్వేమైనా దాన కర్ణుడివా? ఇన్నేసి లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? దీని వెనక ఏదైనా ముందస్తు వ్యూహం ఉందా? నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావా? అంటూ సోనూసూద్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది మీడియా. ఇతని వాలకం చూస్తుంటే మనల్ని తలదన్నే హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకునేట్టున్నాడే? అని లోలోన అసూయపడ్డ హీరోలు కూడా ఉన్నారు. ఆ అభిప్రాయాలన్నిటికీ సోనూ ఇచ్చే సమాధానం ఒక్కటే.. చిరునవ్వు. ఒక్కక్షణం ముసిముసి నవ్వు నవ్వుతూ.. ఇతరులు అడిగే ప్రశ్నలను ఓపిగ్గా వింటూ.. ఆ వెంటనే గంభీరంగా మారిపోయి.. ‘నేనేమీ రాబిన్‌హుడ్‌ను కాను. అందరికీ అన్నీ చేసేయలేను. నా మనస్సాక్షికి నచ్చిందే చేస్తాను. లాక్‌డౌన్‌లో పేదలకు సహాయపడాలనుకున్నాను. అంతే. ఇంకేమీ ఆలోచించలేదు. మనం మనుషులం. తోటి మనిషి కన్నీళ్లతో ఉన్నప్పుడు స్పందించడం మానవధర్మం..’ అంటూ ఒక పల్లెటూరి పెద్దాయనలా చెబుతాడు. 

అతని పుణ్యామాని పేదలందరూ ఊళ్లకు వెళ్లిపోయారు. అప్పుడే పుట్టిన తమ పిల్లలకు సోనూసూద్‌ అని పేరుపెట్టుకున్నారు. కొందరైతే తమ దుకాణాల పాత బోర్డులు పీకేసి.. ఆయన పేరున్న బోర్డుల్ని తగిలించుకున్నారు. పల్లెల్లో అయితే అతని సాయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పత్రికలు, టీవీలు, సోషల్‌మీడియాలలో సోనూ పేరు మార్మోగిపోయింది. 


ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు..


పేదల్ని ఊళ్లకు పంపించడంతోనే ఊరుకోలేదు సోనూ. కరోనా సంక్షోభంలో ఎన్నో జీవితాలు అతలాకుతలం అయ్యాయి. మీడియాలో అలాంటి కథనాలు వచ్చిన వెంటనే స్పందిస్తాడీయన. ఆ మధ్య ఓ చిత్తూరు దళిత రైతు తన ఇద్దరు కూతుళ్లతో కాడిపట్టి సేద్యం చేస్తున్న దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. రాత్రికి రాత్రే ట్రాక్టర్‌ కొని.. పొద్దున్నే వాళ్లింటి ముందు పెట్టారు. వరంగల్‌కు చెందిన శారద సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. కరోనాతో ఉద్యోగం పోయింది. ఇంటికొచ్చి కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతోంది. ఆమె కథనాన్ని చదివిన సోనూ సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. వైద్య విద్య చదువుకునేందుకు మాస్కోకు వెళ్లిన తమిళనాడు విద్యార్థులను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ప్రత్యేక చార్టర్డ్‌ విమానంలో వాళ్లందర్నీ చెన్నైకి తరలించాడు. ఒక్కొక్కరికి ముప్పయి మూడువేల రూపాయలు చొప్పున 101 మందికి విమానఛార్జీలను ఆయనే చెల్లించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇళ్లకు చేరిన వాళ్ల కళ్లలో మెరిసే ఆనందానికి ఈ డబ్బు సమానం కాదన్నది సోనూ అభిప్రాయం. ఇక, గల్ఫ్‌ దేశాల్లోని మూడు లక్షల మంది ప్రవాస భారతీయులకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమానికి పూనుకున్నాడాయన. ఇప్పటికే కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. ఇలా లెక్కలోకి రాని సహాయాలెన్నో!. 


తిరిగిచ్చిన ఖ్యాతి అతనికే..


ఎవరికైనా ఒక సందేహం రావొచ్చు. సోనూసూద్‌ ఆమిర్‌ఖాన్‌, రజనీకాంత్‌, మహేష్‌బాబు కాదు. వాళ్లలా కోట్లకు కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోడు. మరిలా నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేస్తుంటే ఎలా? ఇస్తూపోతే కొండలైనా కరిగిపోవా? ఇలాంటి అభిప్రాయాలు సామాన్యుల్లో వస్తుంటాయి. ఒక అడ్వర్‌టైజ్‌మెంటుకు పేరున్న స్టార్‌నే ఎందుకు తీసుకుంటాయి కంపెనీలు? అతని వల్ల ఆ ఉత్పత్తి ప్రజల్లోకి సులువుగా వెళుతుందని. అంటే - సూపర్‌ ఫేమ్‌ అనేది ఒక బలమైన ప్రచారాస్త్రం. ఇప్పుడా ఫేమ్‌ సోనూసూద్‌కు వచ్చింది. ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది. కంపెనీలకు ఇంతకంటే బలమైన ప్రచారకర్త ఇంకెవరుంటారు? ఇప్పటికే కొన్ని బ్రాండ్లు ఆయన ఇంటికి క్యూ కట్టాయి. పెప్సీ, గోద్రేజ్‌ ఇంటీరియా, ఈజీ మై ట్రిప్‌ కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నాయన్న వార్తలొచ్చాయి. ఎడిల్‌వైజ్‌ ఇన్స్యూరెన్స్‌తోపాటు మరికొన్ని విమానయాన సంస్థలు సైతం అదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడతనికి వచ్చిన కొత్త ఫేమ్‌ మూలంగా పెద్ద పెద్ద సినిమాల్లో కీలకమైన పాత్రలు లభించొచ్చు. ఇదివరకటి కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ను డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మంచి ఊపుమీదున్న ఓటీటీ సంస్థలు కూడా సోనూతో ఖరీదైన వెబ్‌సిరీస్‌లు చేసే ఆలోచన చేయొచ్చు. జాతీయస్థాయిలో పేరున్న కేబీసీ, బిగ్‌బాస్‌ వంటి టీవీషోలకు అతన్ని ప్రధాన వ్యాఖ్యాతగా పెట్టుకోవచ్చు. సూపర్‌ఫేమ్‌ వల్ల ఇన్నేసి కొత్త ఆదాయ మార్గాలు ఆయన ముందున్నాయిప్పుడు. ప్రజలిచ్చిన పేరును డబ్బుగా మార్చి.. తిరిగి వాళ్ల కోసమే ఖర్చుపెట్టడం ఒక కొత్త ఆలోచన. శ్రీమంతుడు సినిమాలో తిరిగిచ్చేయాలి సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించిన సోనూసూద్‌.. ఇక విలనే కాదు, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్‌హీరో. కరోనా నగరాల నరకం నుంచి పుష్పక విమానంలో ఇంటికి చేర్చిన ఆత్మ బంధువు. అప్పుడప్పుడు ఇలాంటి ఉదారవాదుల్ని చూస్తే.. మాయమైపోలేదమ్మ మనిషన్నవాడు అనిపిస్తుంది. మానవత్వపు ఆశ చిగురిస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రతిరోజూ పత్రికలు, టీవీల్లో వసలకూలీల అగచాట్లు చూశాక నాకు ఒకటి అర్థమైంది. నాలాంటి వాళ్లు ఇంట్లో కూర్చునే టైమ్‌ కాదిది అని!. నన్ను ప్రేక్షకులు ఆదరించబట్టే ఇంతటి వాన్నయ్యాను. ఎంతోకొంత సంపాదించుకున్నాను. కాబట్టి మనం సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు అనిపించింది. 


- సోనూసూద్‌, నెంబర్‌వన్‌ హ్యుమానిటేరియన్‌గా ర్యాంకు కైవసం చేసుకున్న భారతీయ నటుడు 


ముంబయి ఇచ్చింది..


ఊళ్లకు వెళతామో లేదోనన్న భయంతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పేదలకు .. బోగీలో సీటు దొరికితే ఎంత ఆనందం? ఆ పేద ప్రయాణికుల కళ్లలో మెరిసిన భావోద్వేగాన్ని చూస్తూ తన జ్ఞాపకాల్లోకి వెళ్లాడు సోనూసూద్‌. ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలను వెతుక్కుంటూ ముంబయికి వచ్చిన కొత్తలో ఇలాగే సిటీలో రైళ్లోనే ప్రయాణించేవాడు. అప్పుడు కొనుక్కున్న మంత్లీ రైల్వే పాస్‌ను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు. దాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు కూడా. సోనూసూద్‌ కోటీశ్వరుల కుటుంబం నుంచి రాలేదు. పంజాబ్‌లోని మోగలోని ఒక చిన్న వ్యాపార కుటుంబం నుంచి వచ్చాడు. నాన్న బట్టల దుకాణం నడిపేవాడు, అమ్మ ఉపాధ్యాయురాలు. నాగపూర్‌లో ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడే మోడలింగ్‌ వైపు మళ్లాడు. కాలేజీ ఫస్ట్‌ఇయర్‌లోనే సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఫిట్‌నెస్‌ అంటే పిచ్చి. ఇంట్లో తల్లిదండ్రుల్ని ఒప్పించి ముంబయికి వెళ్లాడు. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలన్నది ఆయన లక్ష్యం. సిటీకి వచ్చినప్పుడు సోనూసూద్‌ చేతిలో ఉన్న మొత్తం కేవలం ఐదువేల ఐదొందల రూపాయలు. ఒక గదిలో ఆరుగురు మిత్రులతో కలిసి ఉండేవాడు. మోడలింగ్‌ చేసినప్పుడు తన తొలి సంపాదన ఐదొందల రూపాయలు. ఆ డబ్బుతో డెనిమ్‌ జీన్స్‌ ప్యాంట్‌ కొన్నాడట. రోజూ ఫిల్మ్‌ స్టూడియోలకు వెళ్లడం, ఫోటోలు ఇవ్వడం, అవకాశం ఉంటే చెప్పండని ప్రాధేయపడటం.. ఇదే పని. 1999లో తమిళ దర్శకులు భారతి తొలి అవకాశం ఇచ్చింది. సోనూ నటించిన ఆ చిత్రం కల్లాఝగర్‌, తెలుగులో తొలి చిత్రం హ్యాండ్సప్‌. హిందీలో షాహిద్‌ ఈ ఆజమ్‌, దబంగ్‌, ఆషిక్‌ బనాయా అప్నే, హ్యాపీ న్యూ ఇయర్‌, గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌, సింబ ఇలా పలు చిత్రాల్లో చేశాడు. టాలీవుడ్‌లో అతడు, అశోక్‌, అరుంధతి, ఏక్‌ నిరంజన్‌, శక్తి, దూకుడు.. ఇలా చాలా సినిమాల్లో విలన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్టుగా భిన్నమైన పాత్రల్ని పోషించాడు. అరుంధతితో ప్రత్యేక గుర్తింపు లభించింది. అతని మ్యానరిజం, డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌, క్యారెక్టరైజేషన్‌.. ఇలా ప్రతి అంశంలో ప్రత్యేకతను సాధిస్తాడు. నటనలో తనకంటూ ఒక శైలిని నిర్మించుకున్నాడు. విలనిజంలో కామెడీని కూడా చొప్పించగల దిట్ట అతని సొంతం. మొత్తం ఏడు భాషల్లో సినిమాలు చేశాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే - కాలేజీ రోజుల్లోనే సోనాలిని ప్రేమించాడు. 1996లో కోర్టులో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ముంబయిలోనే నివాసం. 2016లో తండ్రి పేరు మీద శక్తిసాగర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో సినీ నిర్మాణ సంస్థను పెట్టాడు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధు బయోపిక్‌ను కూడా ఆ మధ్య తీస్తానన్నాడు సోనూ. జుహు ముంబయిలోని ఇస్కాన్‌ దగ్గర తనకో పెద్ద హోటల్‌ (శక్తిసాగర్‌) ఉంది. కరోనా క్వారంటైన్‌ కోసం వైద్య సిబ్బంది తన హోటల్‌ను వాడుకోవచ్చని చెప్పాడు.  


- మల్లెంపూటి ఆదినారాయణ

Advertisement
Advertisement