సొంతగూడు కల .. సాకారమెన్నడో?

ABN , First Publish Date - 2021-10-18T06:31:13+05:30 IST

జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో గత ప్రభుత్వం చేపట్టిన ‘టిడ్కో’ ఇళ్ల కోసం లబ్ధిదారులు రెండున్నరేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా సొంత ఇంటి కల ఎప్పుడు సాకారం అవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

సొంతగూడు కల .. సాకారమెన్నడో?

టిడ్కో ఇళ్ల కోసం వేలాది మంది పేదల నిరీక్షణ

రెండున్నరేళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు

టీడీపీ హయాంలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలిలో భారీ ఎత్తున గృహసముదాయాల నిర్మాణం

అనకాపల్లిలో పూర్తి... మిగిలినచోట్ల వివిధ దశల్లో పనులు

లబ్ధిదారుల ఎంపిక సైతం పూర్తి, పలువురికి పట్టాలు పంపిణీ

ఎన్నికల తరువాత  అధికారంలోకి వైసీపీ... పనులు ఆపేయాలని ఆదేశాలు

అనర్హుల పేరిట వందలాది మంది పేర్లు జాబితాల నుంచి తొలగింపు

నర్సీపట్నంలో 624 మందికి, ఎలమంచిలిలో 96 మందికి టిడ్కో ఇళ్లు రద్దు 

కొనసా...గుతున్న ఇళ్ల నిర్మాణాలు

అనకాపల్లిలో మౌలిక సదుపాయాలకు మంజూరుకాని నిధులు


కొత్తూరు/అనకాపల్లి రూరల్‌/ నర్సీపట్నం/ఎలమంచిలి, అక్టోబరు 17:

జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో గత ప్రభుత్వం చేపట్టిన ‘టిడ్కో’ ఇళ్ల కోసం లబ్ధిదారులు రెండున్నరేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా సొంత ఇంటి కల ఎప్పుడు సాకారం అవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి పట్టణానికి చెందిన వేలాది మంది లబ్ధిదారులకు గతంలోనే పట్టాలు పంపిణీ చేయగా, తరువాత వచ్చిన ప్రభుత్వం చాలా మందిని అనర్హుల పేరిట రద్దు చేసింది. విశాఖ నగరానికి చెందిన వారికి ఇక్కడ ఫ్లాట్లు కేటాయించడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికే ఇక్కడ గృహ సముదాయాల నిర్మాణం పూర్తికాగా, గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. 

నర్సీపట్నం మునిసిపాలిటీలో సుమారు రెండున్నర వేల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం ‘టిడ్కో’ ఇళ్లు మంజూరు చేయగా, వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి సుమారు 1,800 ఫ్లాట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అప్పటికి నిర్మాణం మొదలుపెట్టని బ్లాకులను ప్రభుత్వం రద్దు చేసింది. నిర్మాణంలో వున్న బ్లాకులకు రివర్స్‌ టెండర్లు పిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో కాంట్రాక్టర్లు పనులు ప్రారం భించారు. కానీ 480 ఫ్లాట్లకు సంబంధించి టెండర్‌ దక్కిం చుకున్న కాంట్రాక్టర్‌ పనులు మధ్యలో ఆపేశారు.

ఎలమంచిలి పట్టణంలోని రామ్‌నగర్‌లో  432 మంది పేదల కోసం టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం తొమ్మిది బ్లాకులకుగాను ఏడు బ్లాకుల పనులు వైసీపీ అధికారంలోకి రాకముందే ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు ఏడాదిన్నరపాటు నిర్మాణ పనులు ఆపేశారు. రెండు బ్లాకులను రద్దు చేసి, మిగిలిన ఏడు బ్లాకుల పనులను కొద్ది నెలల క్రితం తిరిగి ప్రారంభించారు. లబ్ధిదారుల్లో 96 మందికి టిడ్కో ఇళ్లు రద్దు చేశారు. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో ‘టిడ్కో’ ఇళ్ల స్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌...

అనకాపల్లిలో మౌలిక వసతులకు విడుదలకాని నిధులు 

అనకాపల్లి మండలం సత్యనారాయణపురం లే అవుట్‌లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనకాపల్లికి చెందిన లబ్ధిదారుల కోసం 79 బ్లాకుల్లో 2,520 ఫ్లాట్లు నిర్మించారు. పలువురు లబ్ధిదారులకు పట్టాలు కూడా అందజేశారు. అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. వీటికి నిధులు మంజూరు చేసే సమయానికి ప్రభుత్వ మారడంతో పనులు జరగలేదు. ప్రస్తుతం ఏడు బ్లాకుల్లో కొత్తగా 224 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. కాగా గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో పలువురు అనర్హులు వున్నారని, వీరి పేర్లను జాబితాల నుంచి తొలగించారు. వీరికి కేటాయించిన ఇళ్లను రద్దు చేసి, వాటిని విశాఖ నగరంలోని చినముషిడివాడ ప్రాంతానికి చెందిన వారికి కేటాయిస్తారని తెలిసింది. సత్యనారాయణపురం లేఅవుట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.10 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనాగా చెబుతున్నారు. ఇక జీవీఎంసీలో విలీనమైన అనకాపల్లి మండలం సిరసపల్లి, కొండకొప్పాక గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో రూ.52 కోట్లతో 1,088 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కొండకొప్పాకలో 11 బ్లాకుల్లో 504 గృహాలను జి ప్లస్‌ 3 తరహాలో నిర్మించారు. సిరసపల్లిలో 9 బ్లాకుల్లో 432 ఇళ్లను నిర్మించారు. వీటిలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు ఆపేశారు. ఎట్టకేలకు ఇటీవల గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మళ్లీ పనులు మొదలుపెట్టారు. కానీ చాలా నెమ్మదిగా పనులు సాగుతున్నాయి.


నర్సీపట్నంలో 10 బ్లాకుల పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌

మునిసిపాలిటీలో నిరుపేదలకు సొంతగూడు కల్పించాలన్న ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం బలిఘట్టం దత్తాత్రేయ ఆశ్రమం సమీపంలో 12 ఎకరాలు, బయపురెడ్డిపాలెం-కసిమి రోడ్డులో 12 ఎకరాలు సేకరించి జీ ప్లస్‌ త్రీ తరహాలో గ్రూప్‌ హౌస్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు మొత్తం 2,448 లబ్ధిదారులకుగాను 1,480 మందికి ఇంటి మంజూరుపత్రాలు అందజేశారు. ఆ సమయానికి పలు బ్లాకుల నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయి. 13 బ్లాకుల పనులు మొదలుకాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. టీడీపీ హయాంలో మిగిలిపోయిన 968 మంది లబ్ధిదారులకు వైసీపీ పాలకులు ఇంటి పత్రాలను మంజూరుచేశారు. కాగా గతంలో పనులు ప్రారంభం కాని 13 బ్లాకులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటికి సంబంధించి 624 మంది లబ్ధిదారులకు జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించారు. మిగిలిన 1,824 మందికి టిడ్కో కాలనీలో ఫ్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రివర్స్‌ టెండరింగ్‌లో టాటా కంపెనీ 28 బ్లాకులు (1,344 ఫ్లాట్లు), ఇంద్రజిత్‌ మెహతా కంపెనీ 10 బ్లాకుల (480 ఫ్లాట్లు) పనులు దక్కించుకున్నాయి. టాటా కంపెనీ 24 బ్లాకుల్లో పనులు పూర్తిచేసింది. మిగిలిన నాలుగు బ్లాకు పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఆ కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. కాగా ఇంద్రజిత్‌ మెహతా కంపెనీ పనులు మధ్యలో ఆపేసింది. ఈ పది బ్లాకుల్లో పనులు తిరిగి ఎప్పుడు మొదలు పెడతారో అర్థం కాని పరిస్థితి ఉంది.


ఎలమంచిలిలో 96 మందికి ఇళ్లు రద్దు

ఎలమంచిలి పట్టణ పేదల కోసం తెలుగుదేశం హయాంలో రామ్‌నగర్‌లో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మునిసిపల్‌ అధికారులు 432 మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కేటాయించారు. ఒక్కో బ్లాకులో 48 ఫ్లాట్ల చొప్పున మొత్తం తొమ్మిది బ్లాకులు నిర్మించాలన్నది ప్రణాళిక. వీటిలో ఏడు బ్లాకుల పనులు అప్పట్లోనే మొదలుపెట్టారు. ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు ఏడాదిన్నరపాటు నిర్మాణ పనులు ఆపేశారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో పనులు పునఃప్రారంభించారు. ఐదు బ్లాక్‌లు నిర్మాణ పనులు పూర్తి కాగా, రెండు బ్లాక్‌ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మొత్తం 336 మందికి లబ్ధిదారులకు వీటిని కేటాయిస్తారు. ఈ పనులు ఐదు నెలల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో రెండు బ్లాక్‌ల నిర్మాణ పనులు టీడీపీ హయాంలో ప్రారంభం కాకపోవడంతో వాటిని రద్దు చేశారు. వీటికి సంబంధించి 96 మంది లబ్ధిదారుల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. వీరికి జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు.


Updated Date - 2021-10-18T06:31:13+05:30 IST