అమ్మాయి కావడమే నేరమా? యూపీ ప్రభుత్వంపై సోనియా గాంధీ ఫైర్

ABN , First Publish Date - 2020-10-01T08:21:25+05:30 IST

హత్రాస్ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విరుచుకుపడ్డారు.

అమ్మాయి కావడమే నేరమా? యూపీ ప్రభుత్వంపై సోనియా గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. హత్రాస్ బాధితురాలు చనిపోలేదని.. జాలి, దయలేని యూపీ ప్రభుత్వమే ఆమెను చంపేసిందంటూ బుధవారం ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వీడియో సందేశమిస్తూ.. ‘హత్రాస్ లాంటి దారుణమైన ఘటనపై దేశప్రజలు కోపం, విచారంతో ఉన్నారు. అమ్మాయి కావడమే నేరమా? పేద అమ్మాయి కావడమే నేరమా? అని నేను అడగదలుచుకున్నాను. యూపీ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? ఘటనపై న్యాయం కోరుతున్న బాధితురాలి కుటుంబాన్ని కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఈ కేసును అణచివేయాలని చూసింది. బాధితురాలికి సరైన సమయంలో సరైన వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందించలేకపోయింది. చివరకు బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు కూడా ఇవ్వలేదు. కన్నతల్లి తన కూతురి చివరి చూపుకు నోచుకోలేదు. ఇది మహా పాపం. బలవంతంగా బాధితురాలి అంత్యక్రియలను నిర్వహించారు. చనిపోయిన తరువాత గౌరవం అనేది ఉంటుంది. మన హిందూ మతం కూడా దీని గురించి చెప్పింది. కానీ హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలను పోలీసు బలగాలతో బలవంతంగా నిర్వహించేస్తారా? ఇదేం న్యాయం? అసలు ఇదేం ప్రభుత్వం? మేం ఏదైనా చేయగలం.. ఈ దేశం ఏం మాట్లాడదని మీరు అనుకుంటున్నారు. అది తప్పు.. మీరు చేసిన అన్యాయంపై ఈ దేశం మాట్లాడుతుంది’ అని సోనియా గాంధీ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధితురాలిని హత్రాస్ నిర్భయగా సోనిమా గాంధీ అభివర్ణించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ తరపున తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. భారతదేశం పౌరులందరికి సొంతమని.. ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఉందని ఆమె అన్నారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని బీజేపీ నుంచి కాపాడతామన్నారు. 

Updated Date - 2020-10-01T08:21:25+05:30 IST