న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(Congress party) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న 71 ఏళ్ల పీపీ మాధవన్‌పై అత్యాచారం, నేరపూరిత బెదిరింపుల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారానికి పాల్పడ్డాడని 26 ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సోమవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని, విషయం బయటకు పొక్కితే తీవ్ర పర్యావసనాలు ఉంటాయని బాధితురాలిని నిందితుడు బెదిరించాడని తెలిపారు. ఈ మేరకు జూన్ 25న ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందని వివరించారు.
ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 376(రేప్), సెక్షన్ 506(బెదిరింపులు) కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు జరుగుతోందని ద్వారకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.హర్షవర్ధన్ తెలిపారు. ఈ ఫిర్యాదులో రాజకీయ నాయకుల పేర్లేమీ లేవు. కేవలం నిందితుడు మాధవన్ పేరు మాత్రమే ఉందన్నారు. కాగా బాధిత యువతి ఢిల్లీలో నివసిస్తోంది. ఆమె భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పనిచేసేవాడు. హోర్డింగ్స్ అంటించేవాడు. అయితే 2020లో అతడు మరణించాడని పోలీసులు వెల్లడించారు.