‘రాజ్యసభ’కు రెండుసార్లే!

ABN , First Publish Date - 2022-05-15T07:13:21+05:30 IST

కాంగ్రెస్‌ సంస్థాగత పనితీరులో తీవ్రమార్పులు తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు.

‘రాజ్యసభ’కు రెండుసార్లే!

కాంగ్రెస్‌ పదవుల్లో 50% బడుగులకే

అన్నిస్థాయుల్లో యువనేతలకు పగ్గాలు

రాహుల్‌ కాదంటే ప్రియాంకకు సారథ్యం

ప్రతి ఐదేళ్లకు ఆఫీస్‌బేరర్లు మారాల్సిందే

రాష్ట్ర పీసీసీలకు సొంత నిబంధనావళి

ప్రాంతీయపార్టీలతో కలిసి జాతీయపోరు

33% మహిళా రిజర్వేషన్లలో సబ్‌కోటాకు ఓకే

‘జన ఆందోళన్‌ 2.0’పై సోనియా కసరత్తు 

నేటితో ముగియనున్న ‘చింతన్‌ శిబిర్‌’


న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ సంస్థాగత పనితీరులో తీవ్రమార్పులు తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఆమె సారథ్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న మేధోమథన సదస్సు ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’.. అంతర్గత పరివర్తనకు సంబంధించిన కసరత్తును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రానున్న రెండేళ్లకాలంలో పార్టీ శ్రేణులను ఉద్యమాల్లోకి నడిపించే దిశగానూ అడుగులు వేస్తోంది. మరోవైపు మరింత మందికి చేరువ అయ్యేందుకు పార్టీ నిర్మాణాలను ఎంతలా సరళతరం చేసినా.. క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదనే సంకేతాలనూ అధిష్ఠానం పంపించింది. గీత దాటిన పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు సునీల్‌ జాగఢ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు యాభై శాతం ప్రాతినిథ్యం కల్పించాలనేది ఈ సదస్సులో కొత్తగా ముందుకొచ్చిన ప్రతిపాదన. ఒక నేతకు రెండుసార్లు మాత్రమే రాజ్యసభ స భ్యులుగా అవకాశం ఉండాలనేది మరో యోచన. రాబోయే కా లంలో యువ నాయకత్వాన్ని ముందుపెట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం దాదాపుగా నిర్ణయించింది. ఆదివారం శిబిరం ముగింపు వేదికపై దీనిపై ప్రకటన ఉంటుందని రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి, యువ నేత సచిన్‌ పైలట్‌ తెలిపారు.   


అగ్రనేతల ‘వ్యూహ’ చర్చలు

ఏఐసీసీ అగ్రనేతలు, పీసీసీ అధ్యక్షులతో సోనియా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. రెండో దశ ‘జన ఆందోళన్‌ 2.0’కు తేదీలను సమావేశంలో ఖరారుచేసినట్టు తెలిసింది. మోదీ విధానాలు, పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల పెంపునకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబరు 14-29వరకు కాంగ్రెస్‌ తొలిదశ ‘జన ఆందోళన్‌’ దేశవ్యాప్తంగా కొనసాగిన విషయం తెలిసిందే. అరమరికలు లేకుండా మనసులోని అభిప్రాయాలను బయటకు వెల్లడించాలని పదేపదే నేతలను ఆమె కోరారు. ఈ సమావేశం వివరాలతోపాటు శనివారం శిబిరంలో వేర్వేరు కమిటీల స్థాయిలో చర్చకు వచ్చిన అంశాలను సీడబ్ల్యూసీ సీనియర్‌ సభ్యుడు మీడియాకు వెల్లడించారు. ‘‘రాజ్యసభ సభ్యునిగా ఒక పార్టీ నేతకు రెండుసార్లు మాత్రమే అవకాశం ఇవ్వాలని రాజకీయ నిర్మాణ కమిటీ  ప్రతిపాదించింది. ఆపై అతడు ఎన్నిసార్లయినా అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేయొచ్చు’’ అని తెలిపారు. కాంగ్రె్‌సలో సాధారణంగా ఒకసారి పార్టీ కమిటీల్లోకి వస్తే ఇక అక్కడే పాతుకుపోతుంటారు.


ఇకపై అది చెల్లదని, బ్లాక్‌, జిల్లా స్థాయి నుంచి ఏఐసీసీ వరకు ఆఫీస్‌ బేరర్లు తమ స్థానాల్లో ఐదేళ్లు మాత్రమే ఉంటారని ఆ నేత వెల్లడించారు. ఆపై ఆ స్థానాలకు వారు రాజీనామా చేసి.. పార్టీ అప్పగించే వేరే బాధ్యతల్లో కనీసం మూడేళ్లు పనిచేయాలని, ఆ తర్వాత తిరిగి ఆఫీ్‌సబేరర్‌గా ఎన్నిక కావచ్చునని వివరించారు. ఏఐసీసీ భేటీలు, రాష్ట్రాల పార్టీ సర్వసభ్య సమావేశాలను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించి.. నాయకత్వాన్ని ఎన్నుకోవాలనే సూచన శిబిర్‌లో వచ్చినట్టు సమాచారం. సమాఖ్య సూత్రాన్ని పార్టీలో పా టిస్తూ.. రాష్ట్రాల పీసీసీలు సొంత నిబంధనావళిని తయారుచేసుకునే స్వేచ్ఛను ఇవ్వనున్నట్టు తెలిసింది. అయితే.. ఇందుకు ఏఐసీసీ ఆమోదం పొందాలని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దీటైన రాజకీయ ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఎదగాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. ప్రాంతీయపార్టీలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం, రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సమీకరణాలకు సిద్ధపడటం.. అనే రెండు కోణాలనుంచి ఈ వ్యూహానికి తుది రూపు ఇచ్చేపనిలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఇంకా ఎన్నికలు రెండేళ్లే ఉండటం వల్ల ఒంటరి పోటీ ఆలోచనను విరమించుకోవాలని ఆ పార్టీలోని ‘తిరుగుబాటు’ నేతలు..అధిష్ఠానంపై ఒత్తిడితెచ్చి ఒప్పించినట్టు సమాచారం.


పార్టీ సకల నిర్మాణాలను దళితులు, బడుగులతో బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలకు 50 శాతం ప్రాతినిథ్యం కల్పించాలని సోనియాగాంధీ అధ్యక్షతన వహించిన ‘సామాజిక న్యాయం- సాధికారికత’ కమిటీ ప్రతిపాదించింది. ఈ విషయం ఆ పార్టీ నేత కొప్పుల రాజు వెల్లడించారు. అలాగే.. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన, ప్రతిపాదిత 33 శాతం మహిళా రిజర్వేషన్లలో దళితులు, బీసీలకు సబ్‌కోటాల అమలు తదితర అంశాలపైనా సోనియా కమిటీ సుముఖత చూపినట్టు సమాచారం.   


ప్రియాంకకు పగ్గాలు?

పార్టీ బలోపేతం దిశగా మేధోమథనం చేస్తున్న అధిష్ఠానం.. తదుపరి సారథి వైపూ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ పార్టీని ఇకనుంచి ముందుండి నడిపించాలని, ఆయన తెర వెనుక నాయకత్వం నిర్వహించకూడదని ఈ సమావేశంలో పలువురు సూచనలు చే శారు. రాహుల్‌ గాంధీ ముందుకు రాకపోతే ప్రియాంకాగాంధీకి పట్టం కట్టాలని, పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఉండాలని వారు చెప్పినట్లు సమాచారం. ప్రియాంక పార్టీ సారథ్యం స్వీకరించి తీరాలని ఆ పార్టీ సీనియర్‌ నేత ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్‌ గట్టిగా కోరారు.  


జీఎస్టీ పరిహారం గడువు పెంచాలి : చిదంబరం

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో మూడేళ్లు పెంచాలని  కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. గోధుమ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించాలని మోదీ సర్కారును కోరా రు. కాగా, యువ నేతలకు పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠా నం సిద్ధంగా ఉన్నదని యువనేత సచిన్‌ పైలట్‌ తెలిపారు. ‘‘కాంగ్రెస్‌లో నాయకులంతా యాభై ఏళ్లు లోపువారే. దానికి త గినట్టే సీఎంల ఎంపికా ఉండాలి’’ అని అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-05-15T07:13:21+05:30 IST