అప్పట్లో Sonia, ఇప్పుడు Mamatha

ABN , First Publish Date - 2021-07-24T03:32:31+05:30 IST

సీఎం మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత జాతీయ రాజకీయాల

అప్పట్లో Sonia, ఇప్పుడు Mamatha

కోల్‌కతా : సీఎం మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత జాతీయ రాజకీయాల వైపు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు దగ్గరై, జాతీయ స్థాయిలో ఓ ప్రత్యామ్నాయ వేదికను ప్రతిపాదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీకి గట్టి షాకిచ్చి, ఓ ప్రత్యామ్నాయ వేదికను సృష్టించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి కొన్ని రోజుల్లో మమత ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్‌తో సహా విపక్ష నేతలందర్నీ కలుసుకోనున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పుడిదే ప్రధాన అంశంగా మారింది. 


ఢిల్లీ పర్యటన కంటే ముందే కీలక నిర్ణయం

మరికొన్ని రోజుల్లో టీఎంసీ అధినేత్రి మమత ఢిల్లీ పర్యటనకు బయల్దేరుతున్నారు. ఇంత కంటే ముందే పార్టీ కీలక నిర్ణయం ప్రకటించింది. తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీ బాధ్యతలు తీసుకుంటారని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ప్రకటించారు. ‘‘తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సీఎం మమతా బెనర్జీ బాధ్యతలు తీసుకుంటారు. ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తున్నాం. ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ సభ్యలకు మార్గదర్శనం చేస్తున్నారు. ఇదంతా ఓ వ్యూహంలో భాగమే’’ అని ఆ పార్టీ ఎంపీ ఓ బ్రెయిన్ పేర్కొన్నారు. అయితే గతంలో ఇలాంటి బాధ్యతలే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా నిర్వహించారు. 1998 లో సోనియా గాంధీని పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నుకుంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు అచ్చు అదే తరహాలో మమతా బెనర్జీ నేతృత్వం వహించడానికి సిద్ధపడ్డారు. 



Updated Date - 2021-07-24T03:32:31+05:30 IST