పాటల ‘సిరి’

ABN , First Publish Date - 2021-12-01T09:52:40+05:30 IST

మూడున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో విశిష్ట గేయరచయితగా విశేషజనాదరణ పొందిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం యావత్ తెలుగు సమాజాన్ని కలచివేసింది...

పాటల ‘సిరి’

మూడున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో విశిష్ట గేయరచయితగా విశేషజనాదరణ పొందిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం యావత్ తెలుగు సమాజాన్ని కలచివేసింది. తొలినాళ్ళలో తనకు ప్రఖ్యాతి తీసుకొచ్చిన సినిమా పేరే ఇంటిపేరుగా మారిన చెంబేడు సీతారామశాస్త్రి గాఢమైన అభివ్యక్తికి, భాషా వైదుష్యానికి ఉదాహరణలుగా చెప్పదగ్గ వందలాది గీతాలను రాశారు. సినీ సాహిత్యంలో క్లాసిక్ గా చెప్పదగ్గ గీతాలను రాసిన సీనియర్ కవిని కోల్పోవడం దురదృష్టకరం. 


సినిమా పాటల్లో ఏముంటుంది? నాలుగు పిచ్చిమాటలు తప్ప అని విమర్శించేవారికి గట్టిమాటలతో సమాధానమిచ్చినవారు సీతారామశాస్త్రి. సినిమాను జనరంజకంగా మరల్చడంలో పాటకున్న ప్రాధాన్యం తెలియనిదేమీ కాదు. ఎంతోమంది సుప్రసిద్ధ కవులు సినీసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. మల్లాది, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, సినారె వంటి సాహితీ ప్రముఖులు పాట విలువను పెంచారు. సుకవుల మనసుకవుల మేలుకలయికతో పాట జనరంజకమైంది. ఆ తరువాతి కాలంలో సినీసాహిత్యానికే పరిమితమైన కవులు వచ్చారు. వారిలో మొదటగా చెప్పుకోవలసినవారు వేటూరి సుదరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి.  ఇద్దరూ కూడా ఫక్తు కమర్షియల్ గీతాలతో పాటు మనసును తడిమే, తట్టిలేపే మాటలతో మనలను కట్టిపడేసే పాటలు రాశారు. సాహిత్యపరంగా అద్భుతం అనిపించుకున్నవి అనేకం. పాటను కొత్తదారి పట్టించిన వేటూరి బాటలో మరింత వడివడిగా కదిలినవారు సిరివెన్నెల. 


తన తొలిసినిమాతోనే తెలుగుపాటకు మరింత మంచిపేరు సమకూర్చిన సిరివెన్నెల పాటల్లో కనిపించే ఆవేశం, ఉద్వేగం స్వాభావికం కూడా. ఏ సమయంలో ఎటువంటి సందర్భాన్ని చెప్పినా దానికి అనుగుణంగా కలం కదపడం ఆయనకు దివిసీమ తుఫాను కాలంనాటికే అబ్బినట్టుంది. టెలీకమ్యూనికేషన్స్ లో ఓ చిన్నగుమస్తాగా ఉన్న ఆయన అతితక్కువ సమయంలో ఓ నాటకం రాసి, వేసి వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చారట. విరాళాల సేకరణ నిమిత్తం అప్పటికప్పుడు ఓ పాట రాసిచ్చారట. నచ్చితేనే ఏ పనైనా చేయడం ఆయనకు అలవాటు కనుక, తాను రాసిన పాట ఎదుటివారికి నచ్చిందంటే సంతోషించడం, లేదంటే చిన్నబుచ్చుకోవడం వేలపాటలు రాసినా కడదాకా మిగిలిపోయింది. పాటరాసేసి పారితోషికం పుచ్చుకుంటే పని అయిపోయిందనుకోలేదు. తాను రాసింది బాగున్నదీ లేనిదీ తెలుసుకొనేవరకూ మనసు చిన్నపిల్లవాడిలాగా ఉరకలేసేది. మరోపక్క దీనికి పూర్తిభిన్నంగా, భగవంతుడు తనకు అప్పగించిన పోస్టుమ్యాన్ డ్యూటీ పూర్తిచేయడమే తన పని అని కూడా నిర్వేదంగా అనగలరు.  


యువతరాన్ని సైతం ఆకర్షించే భావుకత, భాష ఆయన సొంతం. వారికి మనోస్థైర్యాన్నీ, మార్గదర్శకత్వాన్నీ అందించగలిగే మాటలు ఆయన కలం నుంచి తూటాల్లాగా వర్షించాయి. పాటే కదా అని విని వదిలేయనివ్వరు ఆయన. దానిని ప్రేక్షకుల మనసుకు కట్టిపడేసి, పాశుపతాస్త్రాలవంటి ఆ మాటలను పదేపదే వల్లెవేసుకొనేట్టు చేస్తారు. వ్యవస్థపట్ల మధ్యతరగతి ప్రజల్లో సహజంగా కనిపించే ఒక అసంతృప్తి ఆయన పాటల్లో ప్రతిఫలిస్తుంది. దానికి మరింత కవితావేశాన్ని జోడించి ఆయన ఎంతో మంది హృదయాలను తాకేట్టుగా చెప్పగలిగారు. ఆయన ఆవేశపూరితంగా రాసిన పాటలు ప్రసిద్ధమైనాయి. వామపక్ష భావాలున్న ప్రగతిశీల శక్తులు కూడా మెచ్చుకొనే రీతిలో పలు గీతాలు రాసిన ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో గట్టి అనుబంధం ఉన్నదన్న అంశం ఆశ్చర్యం కలిగించిందే. చిరంజీవి చెప్పినట్లుగా, శ్రీశ్రీ ఆవేశం, వేటూరి జనరంజకత్వం ఈ రెండింటి మిశ్రమంగా సిరివెన్నెల కనిపిస్తారు. మరోపక్కన, ఆదిభిక్షువువాడు ఏది కోరేది అంటూ నిర్వేదంగా, సినీగేయ సాహిత్యంలో నిందాస్తుతి ప్రక్రియకు మరింత సానబట్టడమూ ఆయనకు తెలుసు. భౌతికంగా దూరమైనా, చిరస్థాయిగా నిలచిపోయే అనేకానేకపాటలతో ఆయన అభిమానుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారు.

Updated Date - 2021-12-01T09:52:40+05:30 IST