పాటల జాబిలి

ABN , First Publish Date - 2020-09-30T07:11:49+05:30 IST

కొన్ని జీవితాలంతే.. వచ్చామా వెళ్ళిపొయ్యామా అన్నట్లుండవు మనసులో ప్రేమ రాజేసి జ్ఞాపకాల సుడిగుండంలో...

పాటల జాబిలి

కొన్ని జీవితాలంతే..

వచ్చామా వెళ్ళిపొయ్యామా అన్నట్లుండవు

మనసులో ప్రేమ రాజేసి 

జ్ఞాపకాల సుడిగుండంలో తోసేసి నిష్క్రమిస్తాయ్..


కొన్ని జీవితాలంతే..

ఒకరి ఆహ్వానం కోసం ఎదురుచూడవు..

మన మనసుని కబ్జా చేసి

ప్రేమామృతంలో ముంచేస్తాయ్..


కొన్ని జీవితాలంతే..

మన కష్టాలు మనసులో 

దాచుకున్నా పసికట్టేస్తాయ్..

కన్నీళ్ళను రానీయక

తమకు తెలిసిన విద్యతో సేదతీరుస్తాయ్..


కొన్ని జీవితాలంతే..

నిరాశాపరులకీ తాము హీరోలమే 

అన్న భావన కలిగిస్తాయ్...

నయం చేయలేని జబ్బులను కూడా 

మాయం చేస్తాయ్.


కొన్ని జీవితాలంతే..

బ్రతుకు పందెంలోనో, ప్రేమలోనో 

విఫలం అయ్యామని బాధపడనివ్వవు..

ప్రతి సందర్భానికీ పాట పాడి అనునయిస్తాయ్..


కొన్ని జీవితాలంతే..

మన రంగంలో ఇంత సాధించగలమా 

అన్న అనుమానాలు రానివ్వవు..

ఇష్టంలో కష్టం ఉండదంటూ 

అలవోకగా నిరూపిస్తాయ్..


కొన్ని జీవితాలంతే..

పాటల పున్నములై విరబూసి

గంధర్వలోకాలకెగిరిపోతాయ్‌..

చెరుకూరి రాజశేఖర్

Updated Date - 2020-09-30T07:11:49+05:30 IST