తండ్రిని చంపిన తనయుడు

ABN , First Publish Date - 2022-01-28T04:32:18+05:30 IST

కన్న తండ్రిని గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన మండలంలోని చాకిచర్ల బీసీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది.

తండ్రిని చంపిన తనయుడు
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై త్యాగరాజు

నిందితుడి మానసిక పరిస్థితి సరిగా ఉండదని చెప్తున్న స్థానికులు

అన్నం పెట్టలేదన్న కోపంతో హత్య

చాకిచర్ల(ఉలవపాడు), జనవరి 27: కన్న తండ్రిని గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన మండలంలోని చాకిచర్ల బీసీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై త్యాగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిచర్ల గ్రామానికి చెందిన వట్లూరి రమణ య్య(58) వృత్తిరీత్యా దుస్తులు ఐరన్‌ చేస్తుండడమేగాక కూలి పనులకూ వెళుతుంటాడు. రమణయ్యది గుడ్లూరు మండలం చేవూరు గ్రామం కాగా భార్య పుట్టిల్లు చాకిచర్ల కావడంతో మూడేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అతని కుమారుడు కృష్ణయ్య(27) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనితో తలెత్తిన వివాదంతో భార్య పుట్టింటికి వెళ్లింది. 

తొలి నుంచి కృష్ణయ్యకు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పనిచేసిన చోటల్లా గొడవలు పెట్టుకుంటుంటాడని స్థానికులు చెప్తున్నారు. తల్లి లక్ష్మమ్మను కూడా కొట్టడంతో చికిత్స చేయించుకొని బుధవారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి అదే గ్రామంలో ఉన్న పుట్టింటిలో తల్లి వద్ద ఉంటుంది. లక్ష్మమ్మ తన కూతురుని కూడా స్వ గ్రామంలోని ఓ యువకుడికిచ్చి పెళ్లి చేశారు. రమణయ్య స్థానికంగా ఉన్న కుమార్తె ఇంటి నుంచి అన్నం తెచ్చి తాను తిని కుమారుడు కృష్ణయ్యకు పెట్టేవాడు. ఈ క్రమంలో గురువారం  రమణయ్య వరిపైరుకి పురుగు మందు పిచికారీ చేసే కూలి పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటి కొచ్చాడు. అప్పుడే ఇంటికొచ్చిన కొడుకు కృష్ణయ్య ఇప్పటిదాకా అన్నం తెచ్చి పెట్టకుండా ఏం చేస్తున్నావని తండ్రితో వాదనకు దిగాడు. అన్నం తెచ్చేందుకు వెళుతున్నానని చెప్పి ఇంటి ముందున్న దుకాణంలో టీ తాగుతుండగా ఇంకా వెళ్ల లేదంటూ కృష్ణయ్య తండ్రి రమణయ్యను కొట్టుకుంటూ ఇంట్లోకి లాక్కెళ్లాడు. రాడ్డుతో తలపై కొట్టాడు. అంతేగాక తన వద్ద ఉన్న చాకుతో రమణయ్య గొంతుకోసి చంపేశాడు. ఈ సంఘటనకు ముందురోజే గ్రామంలోకి కత్తులు, చాకులకు సాన పట్టి అమ్మేవాళ్లు వచ్చారని, వాళ్ల వద్ద కృష్ణయ్య రెండు చాకులు కొనుగోలు చేసినట్లు చూసిన గ్రామస్థులు చెప్తున్నారు. తండ్రిని గొంతుకోసి చంపింది అదే చాకుతో అయింటుందని స్థానికులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐ శ్రీరాం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-28T04:32:18+05:30 IST