తల్లిని కలిసేందుకు ఇండియాకు.. ఆమె మృతి, అతడు క్వారంటైన్‌లో!

ABN , First Publish Date - 2020-05-26T01:18:39+05:30 IST

విధి ఎంత విచిత్రమైనదో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. చివరి రోజుల్లో తల్లితో గడిపేందుకు దుబాయ్‌లో

తల్లిని కలిసేందుకు ఇండియాకు.. ఆమె మృతి, అతడు క్వారంటైన్‌లో!

న్యూఢిల్లీ: విధి ఎంత విచిత్రమైనదో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. చివరి రోజుల్లో తల్లితో గడిపేందుకు దుబాయ్‌లో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని ఢిల్లీ చేరుకున్నాడు. విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే అధికారులు 14 రోజుల క్వారైంటన్‌కు తరలించారు. ఎవరి కోసమైతే ఉద్యోగం వదులుకుని వచ్చాడో.. ఆమె చనిపోయింది. అతడు క్వారంటైన్‌లో ఉండడంతో తల్లిని చివరిసారి చూసుకోలేకపోయాడు. అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయాడు. శనివారం ఆమె మరణించగా ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అతడిని మాత్రం వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు.   


30 ఏళ్ల ఆమిర్‌ఖాన్ ఆరేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఈ నెల 13న తిరిగి ఇండియా వచ్చాడు. విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో ప్రభుత్వం ఆదివారం నిబంధనలు సవరించింది. 14 రోజుల క్వారంటైన్‌ను రెండుగా విభజించింది. తొలి ఏడు రోజులు సొంత ఖర్చులతో సంస్థాగత క్వారంటైన్ కాగా, ఆ తర్వాతి ఏడు రోజులు హోం క్వారంటైన్. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే ప్రెగ్నెన్సీ, కుటుంబ సభ్యుల్లో మృతి, తీవ్రమైన అనారోగ్యం వంటి వాటి విషయంలో 14 రోజులు హోం క్వారంటైన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 


అయితే, ఆమిర్‌ఖాన్ విషయంలో ఇవేవీ పనిచేయలేదు. ‘‘పేపర్లలో వచ్చిన నిబంధనల సవరణకు సబంధించిన వార్తలను అధికారులకు చూపించా. నన్ను ఇంటికి పంపమని వేడుకున్నా. పరీక్షలు చేయించుకునేందుకు కూడా సిద్ధమేనన్నాను. అయినా, అధికారులు నా మాట పట్టించుకోలేదు’’ అని ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.  


ఖాన్ తల్లి లివర్ సిరోసిస్‌తో బాధపడుతోంది. దీంతో మార్చిలో ఇండియా వచ్చి నెల రోజులపాటు ఆమెతో గడపాలని గత నవంబరులోనే ఖాన్ నిర్ణయించుకున్నాడు.  ‘‘మనం వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకుంటాం. కానీ అది కలిగించే మానసిక కష్టాలు మనతోనే ఉంటాయి. నేను  గత రెండు నెలలుగా ఒకే ఎజెండాతో గడిపాను. నేను నా తల్లిని కలవాలని నిర్ణయించుకున్నాను’’ అని ఢిల్లీలో ఓ హోటల్ క్వారంటైన్‌లో ఉన్న ఖాన్ తెలిపాడు. 


కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా మార్చిలో రావాల్సిన ఖాన్ ఎట్టకేలకు మే 13న యూఏఈ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. అయితే, ఆ వెంటనే అతడు 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. 8 రోజుల తర్వాత తాను తన తల్లిని కలవాల్సి ఉందని అధికారులకు చెప్పానని, కానీ వారు పై అధికారుల నుంచి అనుమతి అవసరమని చెప్పారని, ఈ లోగానే తన తల్లి చనిపోయినట్టు ఫోన్ వచ్చిందని కన్నీరు పెట్టుకున్నాడు. తన తల్లి చనిపోయిన విషయం చెప్పినా అధికారులు తనను అనుమతించలేదని ఆమిర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.   



Updated Date - 2020-05-26T01:18:39+05:30 IST