ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే...: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-02-02T18:19:43+05:30 IST

ఉద్యోగులను నిర్బంధించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని సోము వీర్రాజు సూచించారు.

ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే...: సోము వీర్రాజు

విజయవాడ: ఏపీ ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే.. జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లని అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్దం మంచిది కాదన్నారు. ఈ ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి నెలకొందన్నారు. మూల ధనం పెంచుకోవడంపై జగన్ దృష్టి సారించాలని సోము వీర్రాజు సూచించారు.


ఆదాయం పెంచుకునేందుకు జగన్ ప్రభుత్వం వద్ద అజెండా లేదని, ఏపీలో ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీనే చూస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. ఇసుక ధర విషయంలో ప్రభుత్వం లెక్కలు అర్ధం కాకుండా ఉన్నాయని, ఇసుక రూపంలోనే ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం‌ వస్తుందన్నారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే గనులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయని విమర్శించారు. ఎర్ర చందనం అమ్మకంతో మూడు వేల కోట్ల అదాయం వస్తుందని, కానీ ఇవన్నీ రాజకీయ కోణంలో దోచుకోవడమే తప్ప... ప్రభుత్వానికి చేరడం లేదని ఆరోపించారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచాలని సోము వీర్రాజు అన్నారు.

Updated Date - 2022-02-02T18:19:43+05:30 IST