టీటీడీకి పూర్తిస్థాయి ఈవోని ఎందుకు నియమించరు?: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-04-13T19:19:23+05:30 IST

తిరుమల భక్తులను ఆకర్షించడంలో వాటికన్ సిటీని మించిపోయిందని సోమిరెడ్డి అన్నారు.

టీటీడీకి పూర్తిస్థాయి ఈవోని ఎందుకు నియమించరు?: సోమిరెడ్డి

అమరావతి: ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రాల్లో ప్రఖ్యాతిగాంచిన తిరుమల భక్తులను ఆకర్షించడంలో వాటికన్ సిటీని మించిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులను కొత్త కొత్త నిబంధనలతో అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. వేసవిలో భక్తులతాకిడి అధికంగా ఉంటుందని టీటీడీ పాలకవర్గానికి, అధికారులకు తెలియదా? అన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు తాగునీరులేక నానా అవస్థలు పడటానికి కారణం అధికారుల నిర్లక్ష్యం కాదా? అని మండిపడ్డారు.


తిరుమలక్షేత్రాన్ని అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగించడమేంటి?.. పూర్తిస్థాయి ఈవోని ఎందుకు నియమించరని సోమిరెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మద్యం సేవించాడన్న ఆరోపణలు రావడంతో ధర్మారెడ్డిని గతంలో రాజశేఖర్ రెడ్డి తిరుమలక్షేత్రం నుంచి సాగనంపారన్నారు. జగన్  అధికారంలోకి రాగానే మళ్లీ ధర్మారెడ్డికు బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. తిరుమలో కలిగిన అసౌకర్యాలకు బాధ్యతవహిస్తూ, ముఖ్యమంత్రి  వెంటనే శ్రీవారి భక్తులకు క్షమాపణచెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-13T19:19:23+05:30 IST