Abn logo
Oct 23 2020 @ 04:30AM

పంచప్రాణాల్లో అర్చకులదే తొలిస్థానం

అర్చక సభలో చైర్మన్‌ పైలా సోమినాయుడు


వన్‌టౌన్‌, అక్టోబరు 22 : దేవాలయాల నిర్వహణకు సంబంధించి పంచప్రాణాల్లో  (అర్చకులు, రాజగోపురం, ధ్వజస్తంభం, ద్వారపాలకులు, ఆలయ మూర్తి) తొలిస్థానంలో నిలిచే అర్చకులను సన్మానించే ఆనవాయితీ దుర్గగుడిలో కొనసాగుతోందని పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహామండపంలోని ఆరో అంతస్తులో గురువారం సాయంత్రం అర్చక సభను ఘనంగా నిర్వహించారు. 50 మంది అర్చకులను సన్మానించి ఒక్కొక్కరికీ రూ.3,500 పురస్కారం, అమ్మవారి ప్రసాద, శేషవస్త్రం అందజేశారు. పైలా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 50 మంది అర్చక స్వాములను గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈవో ఎంవీ సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రతి దేవాలయాలకు పంచ ప్రాణాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. వాటిలో ప్రథమ ప్రాణం అయిన అర్చకులను సన్మానించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.


రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా 2009 నుంచి దుర్గగుడిలో అర్చక సభ నిర్వహిస్తున్నామన్నారు. ద్రోణంరాజు రామచంద్రమూర్తి మాట్లాడుతూ అర్చకులు ఎంతో చాకచక్యంగా, ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. కరోనా ప్రభావం వల్ల చాలా ఆలయాల్లో అర్చకుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. దుర్గగుడి ప్రధాన అర్చకులు వై.మల్లేశ్వరశాస్త్రి, కనక సుందరశర్మ, ఎల్‌డీ ప్రసాద్‌, ఎల్‌.మధురనాథ్‌బాబు, ఏఈవో సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ అర్చక సభలో అర్చక కమిటీ డైరెక్టర్‌ కృష్ణశర్మ, అర్చకులు ఆర్‌.శ్రీనివాసశాస్త్రి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement