నగరం.. !

ABN , First Publish Date - 2021-10-19T05:21:24+05:30 IST

ఆకివీడు నగర పంచాయతీకి కొద్దిరోజుల్లోనే ఎన్నిక నగారా మోగబోతోంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సన్నాహాలు చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.

నగరం.. !

ఆకివీడు నగర పంచాయతీలో ఎన్నికల వేడి

అన్ని పార్టీలకు అగ్ని పరీక్షే 

అధికార పార్టీలో ఆపసోపాలు 

ప్రతిపక్షాల్లోనూ ఉమ్మడి వ్యూహం  

ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు


ఆకివీడు నగర పంచాయతీకి కొద్దిరోజుల్లోనే ఎన్నిక నగారా మోగబోతోంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సన్నాహాలు చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే వార్డుల వారీగా విభజన పూర్తయినందున తదనుగుణంగానే పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రారంభ సన్నాహాలు చేస్తున్నారు. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష, టీడీపీ, బీజేపీ, జనసేన మిగతా పార్టీలు కూడా గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే అన్వేషణ చేసి ఎవరిని రంగం లోకి దించాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నాయి. కొద్ది రోజుల్లోనే ఎన్నికలకు  వీలుగా  నోటిఫికేషన్‌ వెలువడబోతోంది.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) : 

జిల్లా వ్యాప్తంగా 25 వేల మంది పైగా ఓటర్లు ఉన్న మేజర్‌ గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ దిశగానే అధికార యంత్రాంగం సైతం ఒకటికి రెండు సార్లు జనాభా ప్రాతిపధికన అన్ని అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఆకివీడు, చింతలపూడి, పెనుగొండ పంచాయతీలను నగర పంచాయతీలుగా గుర్తించే అవకాశం ఉందని అందరూ భావించారు. అప్పట్లో పెనుగొండ మినహాయించి మిగతా రెండింటిని నగర పంచాయతీలుగా గుర్తించారు. మేజర్‌ పంచాయతీగా ఉన్న ఆకివీడును నగర పంచాయతీగా వెలుగులోకి వచ్చింది. గడిచిన కొద్ది మాసాల క్రితమే  పాలనా వ్యవహారాలను కమిషనర్‌ స్థాయి అధికారి చేతిలో పెట్టారు. ఆఖరికి ట్రైనీ కలెక్టర్‌ను కూడా పర్యవేక్షులుగా నియమించారు.  నగర పంచాయతీలో ఉండాల్సిన సమస్త సౌకర్యాలను  ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తూ వచ్చారు. మిగతా నగర పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగినట్లే ఆకివీడుకు కూడా ఎన్నికలు ఖాయం అనుకున్నారు. కానీ అప్పట్లో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాలేదు. కానీ  ఆప్రక్రియ ఇప్పుడు తెరముందుకు వచ్చింది. నగర పంచాయతీలో సుమారు 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. వివిధ  సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని చైర్మన్‌ పదవిని బీసీ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే రిజర్వు చేసింది. ఆకివీడు పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీగా పూర్తిగా రూపుదిద్దుకునే క్రమంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఇప్పటికే అభ్యర్థుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలో ఎవరంతటికి వారుగా వార్డు పదవులకోసం పోటీ పడుతున్నారు. దాదాపు 20 వార్డులు ఉన్న ఆకివీడులో ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 

 అందరికీ పరీక్షే

ఆకివీడు నగర పంచాయతీకి త్వరలో జరగనున్న ఎన్నికలు అన్ని పక్షాలకు అగ్ని పరీక్ష కానున్నాయి. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా తెలుగు దేశానికి చెందిన మంతెన రామరాజు వ్యవహరిస్తున్నారు. వైసీపీ కన్వీనర్‌గా గోకరాజు రాము, డీసీసీబీ చైౖర్మన్‌ పీవీఎల్‌ నరసింహరావు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజులు ఈ సారి చక్రం తిప్పబోతున్నారు. అయితే ఆకివీడులో ఉన్న సామాజిక వర్గాల బలాబలాలను బట్టి చైర్మన్‌ అభ్యర్థి ఎవరన్నది ముందుగానే తేల్చనున్నారు. ఆదిశగానే పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుని చైర్మన్‌ అభ్యర్థికోసం ముందస్తుగా వార్డుల్లో మెజార్టీ సాధించడం, ఆ తదుపరి తాము అనుకున్న అభ్యర్థి కూడా గెలిచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటం ఇప్పుడు ప్రధాన పార్టీల నేతల మధ్య ఉన్న అసలు పరీక్ష. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకివీడు నగర పంచాయతీలో తొలి జెండాను ఎగుర వేసే సత్తా తమకే ఉందన్నట్లుగా వైసీపీ ఇప్పటికే వ్యూహాలకు పదును పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గ కన్వీనర్‌గా తన సత్తా ప్రదర్శించాలని వైసీపీ కన్వీనర్‌ గోకరాజు రాము ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నగర పంచాయతీ ఛైర్మన్‌ పదవి బీసీ మహిళకే రిజర్వు అయినప్పటికీ వివిధ సామాజిక అంశాలు ప్రాధాన్యత ఉంది. తూర్పు కాపులు,  ముస్లిం, క్రైస్తవులు, కాపులు వంటి సామాజిక వర్గాల నుంచి మొత్తం ఓటర్లలో సగానికి సగం మంది ఉన్నారు. గెలుపోటములు ఈ సామాజిక వర్గాల  నిర్ణయం మీదే ముడిపడి ఉంది. ఆదిశగానే ఎన్నికల పావులు కదపబో తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి మన్నే లలితా దేవి, హైమావతి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో లలితా దేవి  ఆమె భర్త ఆకివీడు సర్పం చ్‌గా జడ్పీటీసీగా ఇంతకుమునుపు బాధ్యతలు నిర్వహించారు. నగర పంచాయతీలోనూ మన్నే కుటుంబం నుంచే పేరు ప్రతిపాదిస్తారా లేకుండా మార్పులు చేర్పులకు వడిగడతారా అనేది అందరిలోనూ ఉత్కంఠ. ఇక పోతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ముందు కెళ్తాయా, లేకుంటే విడివిడిగా పోటీ చేస్తాయా అనేది తేలబోతుంది. ఎమ్మెల్యే రామరాజు, బీజేపీ నేతలు, ఇదే తరుణంలో జనసేన నేతలు ఎన్నికల సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తారా, వ్యక్తిగత ప్రతిష్టకు పోతా రా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆలోచన. మిగతా స్వతంత్రులు, వివిధ పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితా కసరత్తు ఆరంభమైంది.  


Updated Date - 2021-10-19T05:21:24+05:30 IST