కొండంత నష్టం.. గోరంత సాయం

ABN , First Publish Date - 2021-11-30T05:30:00+05:30 IST

ప్రతి మనిషికీ కలల స్వప్నం సొంత ఇల్లు. సొంత ఇల్లు అనేది రక్షణ మాత్రమే కాదు.. సమాజంలో గౌరవం కూడా.. ఇంటిల్లపాది ఆరుగాలం కష్టించి సంపాదించిన సొమ్ముతో ఓ ఇల్లు కట్టుకుని అన్నీ సాధించినట్లు భావిస్తుంటారు.

కొండంత నష్టం.. గోరంత సాయం
తొగూరుపేటలో ఎక్కడ చూసినా కూలిన పక్కా గృహాల శిఽథిలాలు

నిలువ నీడ లేక... ఊరొదిలి పోలేక... 

కళ్లెదుటే కుప్పకూలిన ఇళ్ల శిఽథిలాల వద్ద బాధితుల పడిగాపులు 

పక్కా గృహాలు ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని వేడుకోలు

రేపు సీఎం పర్యటన


అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి నేటికి 13 రోజులు. కళ్లెదుటే తమ కలల సాకారమైన ఇళ్లు కూలిపోయాయి. కట్టుబట్టలు మినహా అన్నింటినీ కోల్పోయారు. అటు ఆదాయాన్నిచ్చే పంట పొలాలు, ఇంటిలోవున్న సర్వస్వం, ప్రధానమైన ఇల్లు అన్నీ కోల్పోయి అనాథలుగా మిగిలారు. పల్లెల్లో భూస్వాములుగా, కోటీశ్వరులుగా చలామణి అవుతున్నవారు సైతం నవంబరు 19వ తేదీ ఉదయం 6గంటల వేళ కళ్లు తెరిచి కళ్లుమూసే లోపు కటికదరిద్రులుగా మారారు. వీరంతా 13 రోజులుగా కనీసం నీడ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన టార్పాలిన్‌ పట్టల కింద కాలం గడుపుతున్నారు. నిలువ నీడలేక.. ఊరొదిలిపోలేక.. కళ్లముందే కూలిపోయిన ఇళ్ల శిథిలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకపోతుందా అనే ఆశతో ఉన్నారు. రేపు తమ గ్రామాల్లో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారంగా స్పందించాలని, తమకు ఇళ్లు ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని వీరు కోరుతున్నారు.


రాజంపేట, నవంబరు 30: ప్రతి మనిషికీ కలల స్వప్నం సొంత ఇల్లు. సొంత ఇల్లు అనేది రక్షణ మాత్రమే కాదు.. సమాజంలో గౌరవం కూడా.. ఇంటిల్లపాది ఆరుగాలం కష్టించి సంపాదించిన సొమ్ముతో ఓ ఇల్లు కట్టుకుని అన్నీ సాధించినట్లు భావిస్తుంటారు. ప్రస్తుతం చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా రూ.20లక్షలు కావాలి. ఒక మోస్తారు ఇల్లు కావాలంటే రూ.50లక్షలు దాటుతుంది. మరీ హుందాగా ఇల్లుండాలంటే కోటి రూపాయలు కచ్చితంగా కావాలి. ఎక్కడికి వెళ్లినా నా ఇల్లుంది కదా అని తిరిగి వచ్చేస్తాం. అంటే మనిషికి ప్రధానమైంది ఇల్లు. అటువంటి ప్రధానమైన ఇల్లు.. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇల్లు.. తమ కళ్లెదుటే క్షణాల్లో కూలిపోతే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకు పోవడంతో ముంచెత్తిన వరదతో గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి. అపార ఆస్తినష్టం జరిగింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కొందరి ఆచూకీ దొరకలేదు. పశునష్టం, పంట నష్టం లెక్కల్లో చెప్పలేనిది. వీరందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. ఇవన్నీ కంటితుడుపు చర్యలే అని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం నిర్వాసితులందరికీ టార్పాలిన్‌ పట్టలు ఇచ్చింది. వీరు ఆ గుడిసెల్లో ఉండలేక, ఆరుబయట తడిసిముద్దవ్వలేక కనీసం బహిర్భూమికి కూడా వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. మహిళల బాధలు అన్నీఇన్నీ కావు. అటు కరెంటు లేక, ఇటు నీడ లేక, బయటికి పోలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి బాధంతా ఒక్కటే... మాకు పక్కా ఇల్లు కట్టిస్తే అదే నిజమైన సహాయమవుతుందని అంటున్నారు. ఇల్లు కట్టించందే ఏ సహాయం చేసినా ఉపయోగం లేదంటున్నారు.


రూ.1.10లక్షలతో ఇల్లు కట్టుకోవడం సాధ్యమేనా..?

ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.95 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధమైంది.  పక్కా గృహం కట్టించుకోవడానికి మరో రూ.1.10లక్షల మంజూరు చేస్తోంది. ఈ సొమ్ముతో ప్రస్తుతం పెరిగిన ధరలతో కనీసం బాత్రూం కూడా కట్టించుకోలేమని బాధితులు అంటున్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వమే తమకు పక్కా గృహాలను కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా పులపత్తూరు, హరిజనవాడ, తొగూరుపేట, రామచంద్రాపురం, మందపల్లె, పాటూరు, సాలిపేట, అన్నయ్యగారిపల్లె గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇళ్లు పాడైపోయాయి. ఎక్కువగా నష్టపోయిన వారు బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వారే.. ఈ వరదల్లో చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 2,580 ఇళ్లు దెబ్బతిన్నాయి. అందులో 475 ఇళ్లు పూర్తిగా పాడైపోయాయి. పాక్షికంగా, నెర్రెలు చీలి పనికిరాకుండా పోయిన ఇళ్లు అనేకం ఉన్నాయి. నివాసానికి పూర్తిగా పనికి రాకుండా పోయిన ఇళ్లు 475 వరకు ఉన్నాయి. వీటిని తిరిగి నిర్మించుకోవాలన్నా సుమారు రూ.50కోట్లు పైబడి ఖర్చు అవుతుంది. పూర్తిస్థాయిలో అన్ని ఇళ్లకు నష్టపరిహారాల లెక్క చేస్తే వందల కోట్లు దాటుతుంది. ప్రభుత్వ అంచనా ప్రకారం నష్టపరిహారం ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇంటికి రూ.95వేల చొప్పున చెల్లిస్తే కేవలం రూ.5కోట్లే ఇచ్చినట్లు అవుతుంది. మరో లక్ష రూపాయలు ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తే మరో రూ.5 కోట్లు అవుతుంది. ఈ వందల ఇళ్లు తిరిగి కట్టుకోవాలంటే ఈ పది కోట్లు ఏ మూలకు సరిపోదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ప్రకటన చేస్తారన్న గంపెడాశతో ఇక్కడివారున్నారు. వీరి నమ్మకం ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సి ఉంది.


పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి

ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి. మాకు కట్టుబట్టలు మినహా ఏమీ లేవు. మేము తిరిగి ఇల్లు కట్టుకోవడం ఈ జన్మకు సాఽధ్యం కాదు. మా బాధను ఆలకించి పడిపోయిన ఇళ్ల స్థానంలో పక్కా భవనాన్ని ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చే రూ.95వేల నష్టపరిహారం, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే రూ.1.10లక్షలు ఏ మాత్రం సరిపోవు. ఇది ఒక బాత్రూంకు కూడా సరిపోదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో పక్కా ఇల్లు కట్టించి ఇస్తేనే బాధితులకు సహాయం చేసినట్లు అవుతుంది.

- అరుణాచలం, మాజీ సర్పంచ్‌, తొగూరుపేట గ్రామం 


ప్రభుత్వమే సహాయపడాలి

తొగూరుపేటలోని మా ఇంటితో పాటు అందరి ఇళ్లూ పాడయ్యాయి. తలదాచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇళ్లు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తే బాగుంటుంది. దాసాలమ్మ గుట్టపై గ్రామస్తులందరికీ కాలనీ ఏర్పాటు చేసి ఇళ్లు కట్టించి ఇవ్వాలి. లేకపోతే అరకొర సహాయం చేసి ఉపయోగం ఉండదు.ప్రభుత్వం ఈ విషయమై ఆలోచించి వెంటనే ఇంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది..

- శేఖర్‌, తొగూరుపేట గ్రామం 


వెంటనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలి

వెంటనే ఇంటి నిర్మాణాలను చేపట్టాలి. ఇప్పటికే 13రోజులుగా ఇల్లు లేక అనాథలుగా  ఉన్నాం. జగన్‌మోహన్‌రెడ్డి దయతలిచి మాగ్రామస్తులందరికీ వెంటనే ఇంటి నిర్మాణాలను చేపట్టాలి. పులపత్తూరు, రామచంద్రాపురం, హరిజనవాడల్లోని వారందరికీ కచ్చితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఎంత ఆలస్యం చేస్తే మాకు అంత ఇబ్బంది. ఇంకైనా పెద్దోళ్లు మా మీద దయదలచాలి. లేకపోతే ఈ చలిలో గుడిసెల కింద ఉండాలంటే కష్టం. 

- గుండ్లూరు వెంకటసుబ్బయ్య, సాలిపేట  

 


 

 

Updated Date - 2021-11-30T05:30:00+05:30 IST