విపక్ష నేతలపై తీవ్రంగా మండిపడ్డ Modi

ABN , First Publish Date - 2021-07-19T21:04:31+05:30 IST

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రారంభమే విపక్షాల ఆందోళనలతో ప్రారంభమయ్యాయి. అటు లోక్‌సభలోనూ,

విపక్ష నేతలపై తీవ్రంగా మండిపడ్డ Modi

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రారంభమే విపక్షాల ఆందోళనలతో ప్రారంభమయ్యాయి. అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ ఇదే తంతు. దీంతో ఉభయ సభలను రెండు గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేశారు. ఈ సమయంలోనూ విపక్ష సభ్యులు తమ నినాదాల్ని, నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘మహిళలు, దళితులు, గిరిజనులను ఎక్కువ సంఖ్యలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నాం. మరికొందరిది వ్యవసాయ సంబంధిత నేపథ్యం, మరికొందరిది గ్రామీణ నేపథ్యం... ఈ నేపథ్యాన్ని చూసి సభ్యులందరూ తెగ సంతోషాన్ని వ్యక్తం చేశారని భావించా. వారందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ప్రోత్సహిస్తారని భావించా. కానీ... వారందర్నీ చూస్తే కొందరికి జీర్ణం కావడం లేదు. అందుకే వారిని పరిచయం చేస్తానంటే అడ్డుతగులుతున్నారు. వారంతా మహిళా ద్రోహులు’’ అంటూ మోదీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. 


తీవ్రంగా మండిపడ్డ రాజ్‌నాథ్, గోయల్

కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేస్తున్న సందర్భంలో విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, పీయూశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొలపడమే పార్లమెంట్‌కు గొప్ప బలమని, అటు విపక్ష సభ్యులైనా, అధికార పక్షమైన ఈ వాతావరణానికి సహకరించాలని కోరారు. ప్రధాని కొత్త వారిని పరిచయం చేస్తున్న సందర్భంగా విపక్ష నేతలు ఇలా నినాదాలు చేయడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని, పూర్తి అనారోగ్యకరమైన వాతావరణమని రాజ్‌నాథ్ దుయ్యబట్టారు. మరోవైపు రాజ్యసభా పక్ష నేత పీయూశ్ గోయల్ కూడా విపక్ష నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఇదే ప్రథమం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులను పరిచయం చేయడం ఎప్పటి నుంచో వస్తున్న సభా సంప్రదాయం. మహిళలు, దళితులు ఈసారి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేసే సమయంలో విపక్ష నేతలు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం’’ అని పీయూశ్ గోయల్ మండిపడ్డారు. 

Updated Date - 2021-07-19T21:04:31+05:30 IST