ఏం చేయాలి!?

ABN , First Publish Date - 2020-05-27T10:26:53+05:30 IST

‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్టుగా ఉంది రెండోపంట సాగు విషయంలో అధికారుల పరిస్థితి.

ఏం చేయాలి!?

అనధికార ఆయకట్టుకు నీరివ్వాలా.. వద్దా!?

అధికారుల తర్జనభర్జన

నాన్‌ ఆయకట్టులో సాగు

మోటార్ల ద్వారా తోడేస్తున్న నీరు

ఎంత చెబుతున్నా వినని నేతలు

మేల్కోనకుంటే పెను ప్రమాదమే !


నెల్లూరు, మే 26 (ఆంధ్రజ్యోతి) : ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్టుగా ఉంది రెండోపంట సాగు విషయంలో అధికారుల పరిస్థితి.  గడిచిన దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో రెండో పంటకు 2.47 లక్షల ఎకరాలకు నీటి కేటాయింపులు జరిపారు. కానీ మరో 50 వేల ఎకరాలకుపైగానే సాగు మొదలైంది. ఈ పంటను కూడా స్థిరీకరణ ఆయకట్టు కిందకు చేర్చి నీరివ్వాలంటే మరో 6 టీఎంసీలపైనే అవుతుంది. అయితే అంత నీరు ఇప్పుడు సోమశిలలో అందుబాటులో లేదు. ఇవ్వాలనుకుంటే సాగునీటి కేటాయింపుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది మరీ ప్రమాదకరం. దీంతో ఇప్పుడు అధికారులు ఏం చేయలేని పరిస్థితి. అనధికార ఆయకట్టుకు నీరివ్వకుంటే ఆ రైతులంతా నష్టపోతారు. కేటాయింపుల్లో నుంచి అనధికార ఆయకట్టుకు ఇస్తే అధికార ఆయకట్టు రైతులు దెబ్బతింటారు. మొత్తంగా భవిష్యత్‌లో పెను ప్రమాదాన్ని ఎదుర్కోకతప్పదని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


సంకటంలో రెండో పంట

అధికారుల నిర్లక్ష్యం.. అధికార పార్టీ నేతల రాజకీయ లబ్ధి.. రైతులకు కొరవడిన ముందు చూపు.. వెరసి రెండో పంట ఇప్పుడు సంకటంలో పడింది. సోమశిల జలాశయంలో డెడ్‌ స్టోరేజీ 7.5 టీఎంసీలు, నీటి ఆవిరి 2 టీఎంసీలు, జిల్లా తాగునీటికి 5.5 టీఎంసీలు, రాబోవు ఇతర అవసరాలకు 3.5 టీఎంసీలను లెక్కగట్టి, ఇవి పోగా మిగిలిన 27.5 టీఎంసీలను 2.47 లక్షల ఎకరాలకు రెండో పంటకు సాగుకు ఇవ్వాలని నిర్ణయించారు.  ఒక్కో టీఎంసీ నీటితో 9 వేల ఎకరాలు పండించేలా నిర్ణయించారు. 


నేతల భరోసాతో సాగు

 ముఖ్యంగా డెల్టాతో పాటు కావలి కాలువ కింద ఎక్కువ విస్తీర్ణంలో అనధికార సాగు జరుగుతోంది. మొదటి నుంచి ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు రెండో పంటపై రైతులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. అటు ఎగువ ఆయకట్ట నుంచి ఇటు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మాదీ అంటూ రైతులకు హామీలు ఇస్తుండడంతో చాలా మంది రైతులు సాగుకు పూనుకున్నారు. ఎగువ అనధికార ఆయకట్టు రైతులు మోటార్ల ద్వారా కాలువల నుంచి నీటిని తోడుకుంటున్నారు.


దిగువ ఆయకట్టుకు కాలువల్లో అడ్డుకట్ట వేయకుండా ఇరిగేషన్‌ అధికారులపై ఒత్తిడి తెస్తూ పారిస్తున్నారు. దీని మూలంగా ప్రస్తుతం లెక్క ప్రకారం సోమశిల నుంచి వదులుతున్న నీరు సరిపోవడం లేదు. ఈ నీటి విడుదలను పెంచాలంటూ అధికారులపై రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారులు వాస్తవ పరిస్థితులు చెప్పినా వినిపించుకునేవారు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఇరిగేషన్‌ అధికారులు అనధికార ఆయకట్టులో సాగు చేయవద్దని ప్రచారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. పైగా పలువురు ప్రజాప్రతినిధులు ఏకంగా అధికారులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో వారు కూడా మిన్నుకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. 


కలెక్టర్‌ పరిశీలన

ఇటీవల కలెక్టర్‌ బుచ్చి మండలంలో అనధికార ఆయకట్టులో సాగును పరిశీలించారు. ఎవరు చెబితే సాగు చేశారు? ఈ పంటను కాపాడడం ఎంత కష్టమో తెలుసా? అంటూ రైతులను ప్రశ్నించారు. తాము సాగు చేసేశామని, ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఈ పరిస్థితుల్లో నీరివ్వలేమంటే ఎలాగని కలెక్టర్‌ ఎదుట రైతులు వాపోయారు. ‘మాకు నీరివ్వలేకపోతే మమ్మల్ని కాలువలో పడేయండి’ అని రైతులు ఆవేదనతో అనడంతో కలెక్టర్‌ వారిని వారించారు. దాదాపుగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఏర్పడినట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.


ఈ నేపథ్యంలో భవిష్యత్‌ పెను ప్రమాదాన్ని హెచ్చరిస్తోంది. అయితే ఇప్పటికైనా నార్లు పోసి నాట్లు వేయకుండా ఉన్న సాగును నిలువరిస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటి, రెండు నెలల్లోపు వర్షాలు కురిస్తే సమస్య ఉండదని, అదే సమయంలో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు కూడా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-05-27T10:26:53+05:30 IST