అసలేం జరిగింది!?

ABN , First Publish Date - 2020-05-29T10:49:26+05:30 IST

సోమశిల ప్రాజెక్టు నుంచి అనధికారికంగా జరిగిన నీటి విడుదల ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.

అసలేం జరిగింది!?

సోమశిల నీటి విడుదలలో నిగ్గు తేలని నిజాలు

ఉన్నతస్థాయి విచారణ ఏమైంది?


నెల్లూరు, మే 28 (ఆంధ్రజ్యోతి) : సోమశిల ప్రాజెక్టు నుంచి అనధికారికంగా జరిగిన నీటి విడుదల ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి పదిహేను రోజులు గడిచినా ఇంతవరకు ఎందుకిలా జరిగిందో తేలకపోవడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. అనధికారిక నీటి విడుదల వెనుక ఎవరున్నా బయటపెట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేనే డిమాండ్‌ చేశారు. స్వయంగా ఈఎన్‌సీ ఆదేశాలతో సీఈ శ్రీనివాసులరెడ్డి సోమశిల వచ్చి విచారించారు. ఒక డీఈ, మరో జేఈను సస్పెండ్‌ చేశారు. ఇంత పెద్ద ఘటనలో అసలెందుకు నీరు విడుదల చేయాల్సి వచ్చింది? ఎంత నీరు దిగువకు విడుదలైంది? అంత ఎక్కువ నీరు ప్రాజెక్టులో ఎలా నిల్వ ఉంది? అన్న ప్రశ్నలు రైతుల్లో ఇప్పటికీ మెదులుతున్నాయి. ముఖ్యంగా డెల్టా రైతులు తమ వాటా నుంచి కుట్ర పూరితంగా నీటిని తగ్గించారని ఆరోపణలు చేశారు.


అయితే ఎందుకు వీరి ప్రశ్నలకు సోమశిల ప్రాజెక్టు అధికారులు సమాధానం చెప్పడం లేదన్నది మరో ప్రశ్నగా మారింది. ఈ నెల 15వ తేదీన స్వయంగా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి సోమశిల నీటి విడుదలపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని ప్రకటించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే సమావేశంలో సోమశిల ఎస్‌ఈ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ సోమశిల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)పైన కూడా చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు. కానీ ఇంత వరకు తదుపరి చర్యలు ఏమీ లేవు. అసలు ఉన్నతస్థాయి విచారణ ఏమైందో బయటకు తెలియడం లేదు. అయితే ఈ అంశంపై వివరణ కోరేందుకు ఎస్‌ఈ రవీంద్రరెడ్డిని సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2020-05-29T10:49:26+05:30 IST