సోమశిల.. జలకళ

ABN , First Publish Date - 2020-09-15T18:13:25+05:30 IST

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురుస్తున్న..

సోమశిల.. జలకళ

69,870 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

65 టీఎంసీలకు చేరువలో నీటినిల్వ

త్వరలో క్రస్ట్‌ గేట్లు ఎత్తే అవకాశం


అనంతసాగరం(నెల్లూరు): అల్పపీడన ద్రోణి ప్రభావంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో సోమశిల  జలాశయానికి వరద పోటెత్తుతోంది. పెన్నా ఉపనదులైన కుందూ, పాపాగ్నిలకు వరద ప్రవాహం పెరిగి పెన్నా నదిలోకి భారీగా నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణాజలాలు కలుస్తున్నాయి. ఈ క్రమంలో సోమశిలకు వచ్చే ప్రవాహం సోమవారం ఒక్కసారిగా మరింత పెరిగింది. ఆదివారం ఇన్‌ఫ్లో కేవలం 23,500 క్యూసెక్కులు కాగా సోమవారం సాయంత్రానికి 69,870 క్యూసెక్కులకు పెరిగింది.


ఆ సమయంలో జలాశయం నీటినిల్వ 63 టీఎంసీలకుపైనే చేరుకుంది. ఈ ప్రవాహం మంగళవారం రాత్రికి లేదా బుధవారం ఉదయానికి 80 వేల క్యూసెక్కుల పైనే నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోమశిల జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా 73 టీఎంసీలు దాటితే క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెన్నా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుంది.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఈ

సోమశిలకు వరద పోటెత్తుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఈ హరినారాయణరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన జలాశయాన్ని సందర్శించి క్రస్ట్‌గేట్ల తీరును పరిశీలించారు. రెండురోజుల్లో నీటి మట్టం పూర్తి సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్రస్ట్‌గేట్లు ఎత్తే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఎంత వరద వచ్చినా అందుకు తగ్గ విధంగా దిగువకు నీరు వదిలేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ సురేష్‌, డీఈ సుధీర్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-09-15T18:13:25+05:30 IST