చాణక్య నీతి: మీ ప్రతీ సమస్యను పరిష్కరించే 4 అమూల్యమైన విషయాలు.. ఎప్పటికీ మరచిపోకండి!

ABN , First Publish Date - 2022-01-16T11:56:26+05:30 IST

ఆచార్య చాణక్య అసాధారణ ప్రతిభను కలిగిన పండితుడు.

చాణక్య నీతి: మీ ప్రతీ సమస్యను పరిష్కరించే 4 అమూల్యమైన విషయాలు.. ఎప్పటికీ మరచిపోకండి!

ఆచార్య చాణక్య అసాధారణ ప్రతిభను కలిగిన పండితుడు. సమర్ధవంతమైన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త. ఇంతేకాదు అతనికి జీవితంలోని అన్ని విషయాలపై ఎంతో అవగాహన ఉంది. తన జీవితంలో చాలా కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. అయినా ఎన్నడూ తన పోరాటాన్ని ఆపలేదు. కాలక్రమేణా మరింత బలపడుతూనే వచ్చాడు. ఆచార్య తన జీవితంలో ఎన్నో అమూల్యమైన రచనలు చేశారు. ఆ రచనలు ఈనాటి ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తమని రుజువవుతోంది. మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఆచార్య చాణక్య 4 పరిష్కార మార్గాలు సూచించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

1. ఏ విషయాన్నయినా ఇతరులతో పంచుకుంటే దుఃఖం తగ్గుతుందని అంటారు. కానీ ఆచార్య చాణక్య మన దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని తెలిపారు. ఎందుకంటే ఒకరి బాధలను మరొకరు తగ్గించలేరు. దీనికి బదులుగా  మీ పరిస్థితులను వారికి అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా మీ పరిస్థితులను చూసి, మిమ్మల్ని ఎగతాళి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే మీ కష్టాలను మీలోనే దాచుకోండని ఆచార్య చాణక్య సూచించారు.


2. భార్యాభర్తల బంధం ఎంతో ప్రేమతో కూడుకున్నది. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఇద్దరూ పరస్పరం పూర్తి సహకారభావంతో మెలగాలి. జీవిత భాగస్వామి ఎప్పుడూ కోపంగా ఉంటూ, సరైన ప్రవర్తనతో లేకపోతే, నిరంతరం ద్వేష భావంతో ఉంటే కుటుంబంలో కలహాలు ఏర్పడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి భాగస్వామితో కలసి ముందడుగు వేయలేరు. అందుకే భార్యాభర్తలు అవగాహనతో మెలగాలని ఆచార్య చాణక్య సూచించారు. 

3. కుటుంబంలోని విషయాలను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. మీ ఇంట్లోని రహస్య విషయాలను బయటి వ్యక్తులతో పంచుకున్నప్పుడు అవతలివారు మీ ఇంటిలో సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. మీ పరిస్థితులను అందుకు అనువుగా మలచుకుంటారు. 

4. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ప్రతీ ఒక్కరూ సమాజం కోసం ఎంతోకొంత పనిచేయాలి, అటువంటప్పుడే సమాజంలో వారికి గౌరవం, కీర్తి లభిస్తాయి. గౌరవం అనేది మనిషికి ఆభరణం లాంటిది. సమాజంలో మంచి పనులు చేయడం ద్వారా అది మరింతగా ప్రకాశిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు.



Updated Date - 2022-01-16T11:56:26+05:30 IST