Abn logo
Sep 25 2020 @ 00:26AM

కర్షక, కార్మికులకు సంఘీభావం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి నయాన్నో భయాన్నో రాష్ట్రాల్లో తమకు పాలకమిత్రులుగా మార్చుకున్న పార్టీలతో కలసి వ్యవసాయ పారిశ్రామిక రంగాలను నాశనం చేయడానికి ఉద్దేశించిన బిల్లులను పార్లమెంటు హడావిడిగా ఆమోదింపచేసుకుంది. కరోనాపేరుతో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కరోనాకు పేరుతో పాలకులు సాగిస్తున్న అనాలోచిత విధానాలకు గడచిన ఆరునెలలుగా ప్రజలు ఎంత మూల్యం చెల్లించారో చూస్తున్నాం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు, వర్షాకాల సమావేశాలకు మధ్య బిజెపి పాలిత రాష్ట్రాల్లో రిహార్సల్స్ వేసుకుని ఏకంగా భారత రైతాంగంపైన కార్మికులపైన, మొత్తం ప్రజలపైన ప్రభావాన్ని చూపే దుర్మార్గపు బిల్లులను పార్లమెంటులో ఆమోదించారు.


సెప్టెంబర్ 20న ఆమోదించిన  మూడు బిల్లులు చట్టాలుగా మారితే కార్పొరేట్ కంపెనీల చేతుల్లో చిన్న రైతులు లీజుకి భూములిచ్చిన బందీలుగా, క్రమంగా ఒకనాటి నీలిరైతులుగా మారిపోతారు. మార్కెట్ యార్డులను గల్లీ దళారులకు బదులు ఢిల్లీ దళారులు కబ్జా చేసుకుంటారు. ఇప్పటికే ప్రకటించిన మద్దతుధర ఎన్నడూ, ఎక్కడా అమలు కాదు. గిట్టుబాటు ధర అన్న పదమే ఉండదు. నిత్యావసరాల సరుకుల లిస్టులో నుంచి చాలా పంటలకు మినహాయింపు ఇచ్చారు. ఫలితంగా అన్ని ఆహారపంటలు లక్షల టన్నులు కార్పొరేట్ బ్లాక్‌మార్కెట్లోకి వెళతాయి. 


మరొకవైపు దేశవ్యాప్తంగా కార్మికవర్గం, ట్రేడ్‌యూనియన్‌లు ప్రతిఘటిస్తున్నప్పటికీ 44కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్‌గా మార్చి పార్లమెంటులో సెప్టెంబర్ 23న ఆమోదింపచేశారు. శతాబ్దం పైగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి యాజమాన్యాలకు కార్పొరేట్లకు తాకట్టు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే 19వ శతాబ్దపు నాటి బానిస పరిస్థితిల్లో కార్మికవర్గం కూరుకుపోతుంది. ఈ పరిస్థితులలో దేశంలోని శ్రామికులు చేయ తలపెట్టిన ఆందోళనలు న్యాయమైనవి. వారిది ధర్మాగ్రహం. పార్లమెంటు ఆమోదించిన పై బిల్లులు చట్టరూపం పొందకూడదని మేము కోరుతున్నాం. మనకందరికీ అన్నదాతలైన శ్రామికులకు సంఘీభావాన్ని తెలుపుతున్నాం.


-ప్రొ.వకుళాభరణం రామకృష్ణ, ప్రొ. డి. నర్సింహారెడ్డి, ప్రొ. తోట జ్యోతిరాణి, ప్రొ. కెఆర్ చౌదరి, సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, భూపాల్, శీలా వీర్రాజు, శీలా సుభద్రాదేవి, కాత్యాయని, ఘంటసాల నిర్మల, డా. నళిని, డా.ఆలూరి విజయలక్ష్మి, బండారు విజయ, ఎం. లక్ష్మీ, శాంతిప్రబోధ, దేవరాజు మహారాజు, ముక్తవరం పార్థసారధి, వారాల కృష్ణమూర్తి, సి హెచ్ మధు, డా.ఏకే ప్రభాకర్, వఝల శివకుమార్, ప్రొ. దార్ల వెంకటేశ్వర్లు, శ్యామ్, విఆర్ శర్మ, కెపి అశోక్ కుమార్,  జనజ్వాల; వేణు గోపాల్, అశోక్ కుమార్(టిపిటిఎఫ్), డా.భట్టు లక్ష్మీనారాయణ, కె రామ్మోహన్( జనసాహితి), రమణ ప్రసాద్ (ఏఐ పిఎల్‌సిఎఫ్); కార్టూనిస్టులు:సుధామ, శంకు, నర్సింహ, సురేంద్రనాధ్; కోయిన్ని వెంకన్న, కె శాంతారావ్, గడీల సుధాకర్ రెడ్డి

Advertisement
Advertisement
Advertisement