గణనాథుడికి ఘనమైన రుచులు

ABN , First Publish Date - 2020-08-22T05:44:26+05:30 IST

వినాయకచవితి అనగానే ఉండ్రాళ్లు గుర్తొస్తాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు.

గణనాథుడికి ఘనమైన రుచులు

వినాయకచవితి అనగానే ఉండ్రాళ్లు గుర్తొస్తాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గొల్‌పాపిడీ,  ఎల్లు కోజుకట్టాయి, ఉండ్రాళ్ల పాయసం... ఇలా నైవేద్యం ఏదైనా ఆ లంబోదరుడికి భక్తితో సమర్పిస్తారు. ఆ నైవేద్యాలను మీరూ ట్రై చేయండి.



1 .గొల్‌పాపిడీ (సుక్ధీ)


గుజరాతీయులు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించే స్వీట్‌ ఇది. 

కావలసినవి.

గోధుమ పిండి - ఒక కప్పు, గసగసాలు - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఐదు టేబుల్‌స్పూన్లు, బెల్లం - అరకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, ఎండు కొబ్బరి తురుము - ఒక టీస్పూన్‌.

తయారీ

  1.  మందంగా ఉన్న పాన్‌కు నెయ్యి రాసి గసగసాలు చల్లుకుని పక్కన పెట్టుకోవాలి.
  2.  స్టవ్‌పై పాత్రను పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత గోధుమ పిండి వేసి చిన్నమంటపై వేగించాలి.
  3.  గోధుమ రంగులోకి మారాక స్టవ్‌పై నుంచి దింపుకొని బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుము కలుపుకోవాలి.
  4.  బెల్లం కరిగాక నెయ్యి రాసి పెట్టిన పాన్‌లో మిశ్రమాన్ని పోయాలి. పాన్‌ అంతటా సమంగా పరుచుకునేలా చూసుకోవాలి.
  5.  వేడి తగ్గకముందే డైమండ్‌ షేపులో ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  6.  ఒకవేళ బెల్లం వేశాక మిశ్రమం బాగా గట్టిగా అయితే కొద్దిగా పాలు కలుపుకోవచ్చు.




2. ఎల్లు కోజుకట్టాయి

తమిళనాడులో ఏకదంతునికి భక్తితో ఈ నైవేద్యం సమర్పిస్తారు.

కావలసినవి. 

నువ్వులు - ఒక కప్పు, బెల్లం - ఒక కప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, బియ్యం పిండి - ఒక కప్పు, నెయ్యి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత. 

తయారీ

  1.  ముందుగా నువ్వులను వేగించి పొడి చేసుకోవాలి. తరువాత బెల్లం, యాలకుల పొడి వేసి చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి.
  2.  స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో స్టవ్‌ ఆర్పేసి దింపుకోవాలి.
  3.  బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. మెత్తటి ఉండలా చేసుకోవాలి. 
  4.  తరువాత కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ చిన్న పూరీలా చేసుకోవాలి. 
  5.  ఇప్పుడు మధ్యలో నువ్వుల లడ్డూ పెట్టి చుట్టూ కొనలు దగ్గరకు చేర్చి మోదక్‌లా చేసుకోవాలి.
  6.  తరువాత కుక్కర్‌లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.




 3. ఉండ్రాళ్ల పాయసం

ఇది తెలుగు ప్రజలు లంబోదరునికి ఆరగింపు చేసే స్వీటు.

కావలసినవి.

బియ్యం పిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, బాదం - నాలుగైదు పలుకులు, ఎండు కొబ్బరి - కొద్దిగా, పంచదార - అర కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, ఎండుకొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌, 

తయారీ

  1.  ముందుగా స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలోనే రుచి కోసం చిటికెడు ఉప్పువేయాలి.
  2.  తరువాత బియ్యం పిండి వేయాలి. చిన్న మంటపై ఉంచి బాగా కలుపుకోవాలి.
  3.  స్టవ్‌ పైనుంచి దింపుకొని చల్లారిన తరువాత పిండిని ఒక ఉండలా చేసుకోవాలి.
  4.  తరువాత కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్‌ తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  5.  ఇప్పుడు స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి నెయ్యి వేయాలి. అందులో బాదం, జీడిపప్పు, ఎండుకొబ్బరి వేసి వేగించుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
  6.  అదే గిన్నెలో అర లీటరు నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో తయారుచేసి పెట్టుకున్న బాల్స్‌ వేయాలి.
  7.  కాసేపయ్యాక రెండు టేబుల్‌స్పూన్ల బియ్యం రవ్వ వేయాలి. పాయసం చిక్కదనం కోసం ఈ రవ్వ ఉపయోగపడుతుంది.
  8.  చిన్నమంటపై పెట్టి కాసేపు ఉడికించాలి. తరువాత పంచదార వేసి కలుపుకోవాలి. 
  9.  పంచదార పూర్తిగా కరిగాక యాలకుల పొడి వేయాలి. ఎండుకొబ్బరి తురుము వేసి కలియబెట్టుకోవాలి. 
  10.  ఐదు నిమిషాలు ఉడికిన తరువాత స్టవ్‌ పైనుంచి దింపుకొని సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకోవాలి.

Updated Date - 2020-08-22T05:44:26+05:30 IST