Lakshmanan: అమరజవాన్‌ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-08-14T13:58:01+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దళాల దాడిలో అశువులు బాసిన మదురై జిల్లాకు చెందిన సైనికుడు లక్ష్మణన్‌కు కుటుంబీకులు, స్థానికుల అశ్రునయ

Lakshmanan: అమరజవాన్‌ అంత్యక్రియలు

                  - ‘లక్ష్మణన్‌ అమర్‌ రహే’ అంటూ హోరెత్తిన నినాదాలు


చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దళాల దాడిలో అశువులు బాసిన మదురై జిల్లాకు చెందిన సైనికుడు లక్ష్మణన్‌కు కుటుంబీకులు, స్థానికుల అశ్రునయనాల నడుమ సైనిక లాంఛనాలతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. డి.పుదుపట్టికి చెందిన లక్ష్మణన్‌ (22) రెండు రోజుల క్రితం కశ్మీర్‌లోని రజ్జవురి జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో లక్ష్మణన్‌ భౌతికకాయాన్ని జమ్ముకశ్మీర్‌లోని సైనిక శిబిరంలో  అక్కడి సైనికాధికారులు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం మదురైకి తరలించారు. విమానాశ్రయం వద్ద లక్ష్మణన్‌(Lakshmanan) భౌతికకాయానికి ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌, జిల్లా కలెక్టర్‌ అనీష్ శేఖర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ సిమ్రన్‌జిత్‌సింగ్‌ కలోన్‌, ఎస్పీ శివప్రసాద్‌, మేయర్‌ ఇంద్రాణి, డిప్యూటీ మేయర్‌ నాగరాజన్‌, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai), సైనికదళాధికారులు నివాళులర్పించారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి సైనికవాహనంలో భౌతికకాయాన్ని లక్ష్మణన్‌ స్వస్థలమైన డి.పుదుపట్టికి తరలించారు. లక్ష్మణన్‌ భౌతికకాయం పేటికను చూడగానే తల్లిదండ్రులు, కుటుంబీకులు, గ్రామస్తులు బోరున విలపించారు. ప్రజల సందర్శనార్ధం భౌతికకాయాన్ని లక్ష్మణన్‌ నివాసం వద్ద ఉంచారు. శనివారం సాయంత్రం లక్ష్మణన్‌ కుటుంబానికి చెందిన తోటలో సైనిక లాంఛనల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సందర్భంగా సైనిక దళం సభ్యులు గాలిలోకి తుపాకులు పేల్చి నివాళులర్పించారు.

Updated Date - 2022-08-14T13:58:01+05:30 IST