Abn logo
Oct 20 2021 @ 10:50AM

విహారయాత్రలో.. ఆ రాత్రి కాళరాత్రి

వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ సాప్ట్‌వేర్‌ ఉద్యోగినులు 

మా బిడ్డ బతుకుపై ఆశ వదులుకున్నాం : సుష్మ తల్లిదండ్రుల


హైదరాబాద్/మల్కాజిగిరి:  విహారయాత్రకని వెళ్లిన ఐదుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులకు ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలింది. ఆ స్నేహితులు మృత్యువు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మల్కాజిగిరి ఆర్‌కే నగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగులు ప్రసాద్‌, ఉషారిణిల కూతురు సుష్మ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. గతంలో ఆమెతో కలిసి  పనిచేసిన నలుగురు స్నేహితులు శృతి, సూచి, హోళి, కృతిలతో కలిసి దసరా సెలవుల సందర్భంగా నైనిటాల్‌కు విహార యాత్రకని ఈనెల 14న వెళ్లారు. సుష్మతో పాటు వెళ్లిన మిగతా నలుగురిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా మిగతా వారు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు చెందిన వారు. 


ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకొని..

మూడు రోజుల పాటు నైనటాల్‌ ప్రాంతాలను చూసిన వీరు ఈనెల 17న సోమవారం సాయంత్రానికి ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు. ఆ రోజు రాత్రి ఉత్తరాఖండ్‌లోని లెమన్‌ టీ ప్రాంతంలోని ఓ లాడ్జ్‌లోని మూడో అంతస్తులో ఉన్నారు. అప్పటికే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారే సరికి వీరు ఉంటున్న లాడ్జి మొదటి అంతస్తు వరకు వరదనీరు వచ్చి చేరింది. ఆ వరదలను చూసిన వారు బతుకుపై ఆశ వదులుకున్నారు. మల్కాజిగిరిలో ఉంటున్న తల్లిదండ్రులకు బోరున ఏడ్చుకుంటూ తాము  ప్రమాదంలో ఉన్న విషయాన్ని సుష్మ చెప్పింది. తల్లిదండ్రులు హుటాహుటిన తమకు తెలిసిన మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్‌ జగదీ్‌షగౌడ్‌, అదే ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు ఆర్‌కే శ్రీనివా్‌సను కలిసి తమ కూతురును కాపాడాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన వారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. మైనంపల్లితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు ఉత్తరాఖండ్‌ అధికారులతో మాట్లాడి వరదల్లో చిక్కుకున్న వారందరినీ రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి అధికారులు రంగంలోకి దిగి సుష్మతో పాటు ఆమె స్నేహితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారంతా మంగళవారం రాత్రి వరకు ఢిల్లీకి చేరుకున్నారని, శృతితో పాటు నగరానికి చెందిన మరో యువతి బుధవారం ఉదయానికల్లా నగరానికి చేరుకుంటారని సుష్మ తల్లిదండ్రులు చెప్పారు. 


కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు 

 ఆపదలో ఉన్న తమ అమ్మాయితో పాటు మిగతా వారిని రక్షించేందుకు కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ కార్పొరేటర్‌ జగదీ్‌షగౌడ్‌, బీజేపీ నాయకులు ఆర్‌కే శ్రీనివా్‌సలకు సుష్మ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

పెద్దపెద్ద అరుపులు.. కేకలు

‘‘వరదలు చుట్టుముట్టిన సమయంలో లాడ్జిలో సుమారు వంద మంది వరకు యాత్రికులు ఉంటారని ప్రమాదం నుంచి బయటపడ్డ సుష్మ తెలిపారు. వరదల ఉధృతి శబ్ధానికి నిద్ర నుంచి మేల్కొన్న లాడ్డిలోని వారందరూ ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడంతో ఏమైందోనని మేమూ భయపడ్డాం. వరదలు మేమున్న లాడ్జి చుట్టూ సుడులు తిరుగుతుండడాన్ని చూసి ఇక ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం’’ అని ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో  చెప్పారు సుష్మ. లాడ్జి యాజమాన్యం మొదటి అంతస్తు రెండో అంతస్తులో ఉన్న వారిని టెర్రస్‌ పైకి పంపించిందని, ఉత్తరాఖండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌  అధికారులు తమను రక్షించారని వివరించారు. అక్కడి ప్రభుత్వ ఆదేశాలతో వరదలకు కారణమైన డ్యామ్‌ గేట్లను మూసివేశారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో తమను టెర్రస్‌ పైనుంచి కింది అంతస్తుకు తీసుకొచ్చి ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారని తెలిపారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరామన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption