హైదరాబాద్ సిటీ/అనకాపల్లి టౌన్ : ఉద్యోగపరమైన ఒత్తిడితో పాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సి వస్తుందనే బాధతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ కథనం మేరకు.. అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నగిరెడ్డి నవీన్‌వెంకట్(23)కు నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పటి వరకూ ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. హైదరాబాద్ రావాలని ఇటీవల కంపెనీ యాజమాన్యం సూచించింది. కొత్త ఉద్యోగంలో ఒత్తిడితోపాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లడానికి ఇష్టపడని నవీన్‌వెంకట్ శనివారం తెల్లవారుజామున తల్లిదండ్రులు పై పోర్షన్‌లో నిద్రపోతుండగా కింద ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్‌వెంకట్ సున్నిత మనస్కుడని స్నేహితులు చెబుతున్నారు.