కొవిన్‌కు సాఫ్ట్‌వేర్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-03-02T08:38:31+05:30 IST

రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైంది. 60 ఏళ్లకు పైబడిన వారు, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.

కొవిన్‌కు సాఫ్ట్‌వేర్‌ కష్టాలు

  • రిజిస్ట్రేషన్‌లో తీవ్ర ఇబ్బందులు...
  • నేటి నుంచి టీకా కేంద్రాల వద్ద కూడా నమోదు
  • పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్‌కు విశేష స్పందన
  • కోమార్బిడిటీస్‌ ధ్రువపత్రానికి సొమ్ములు  అడుగుతున్న  ప్రైవేటు వైద్యులు 
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా  తీసుకోవాలి: ప్రజారోగ్య సంచాలకుడు

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైంది. 60 ఏళ్లకు పైబడిన వారు, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. తొలిరోజు సాఫ్ట్‌వేర్‌ సంబంధిత సమస్యల వల్ల వైద్య శాఖ నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగలేదు. అయితే ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది టీకాలు తీసుకున్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకే కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కాగా.. 10 గంటల నుంచి ఆ వెబ్‌సైట్‌లో సమస్యలు తలెత్తాయి. కొందరు విజయవంతంగా రిజిస్టర్‌ చేసుకొని అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌తో టీకా కేంద్రాలకు వెళ్లగా వెబ్‌సైట్‌లో పేరు కనిపించకపోవడంతో టీకా ఇవ్వలేదు.


 చేదు అనుభవాల రీత్యా.. 

రెండో విడత వ్యాక్సినేషన్‌లో మొదటి వారం రోజులు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే టీకా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొవిన్‌ పోర్టల్‌లో సమస్యల రూపంలో తొలి రోజు ఎదురైన చేదు అనుభవాల రీత్యా మంగళవారం నుంచి టీకా కేంద్రాల వద్దే నేరుగా లబ్ధిదారులు రిజిస్టర్‌ చేసుకొని, వెంటనే టీకా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి కూడా టీకాలిస్తారు. కేవలం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లతో వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని త్వరితగతిన సాధించడం కష్టమని భావించిన వైద్య శాఖ ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ పద్ధతిని వెంటనే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారు ‘కో-మార్బిడిటీస్‌’ ధ్రువపత్రాన్ని కొవిన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఈ సర్టిఫికెట్ల కోసం సోమవారం ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లిన కొందరికి చేదు అనుభవం ఎదురైంది. దీన్ని కూడా కొందరు వైద్యులు క్యాష్‌ చేసుకునేందుకు యత్నించారు. కో-మార్బిడిటీస్‌ సర్టిఫికెట్‌ కావాలంటే రూ.500 చెల్లించాలని కొందరు ప్రైవేటు వైద్యులు డిమాండ్‌ చేశారని వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందాయి. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి ఉచితంగా ఆ సర్టిఫికెట్‌ను తీసుకోవాలని వైద్యశాఖ సూచిస్తోంది. 


ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌..

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల ప్రజలు టీకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. కొన్ని పట్టణాల్లో ప్రజలు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోనప్పటికీ తమ గుర్తింపు కార్డులతో టీకా కేంద్రాలకు వచ్చారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోవడంతో వారికి టీకాలివ్వలేదన్నారు. ఇలా టీకా కోసం వచ్చేవారి గుర్తింపు కార్డులను పరిశీలించి, అర్హత ఉంటే వెంటనే ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి టీకాలివ్వాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు వ్యాక్సినేషన్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్‌ శాతం రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. 

Updated Date - 2021-03-02T08:38:31+05:30 IST