ఐటీలో కొత్త ప్రాజెక్టులు కష్టమే!

ABN , First Publish Date - 2020-03-27T05:56:57+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి ని కట్టడి చేయడానికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు లాక్‌డౌన్‌ నిబంధనలను అమలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని...

ఐటీలో కొత్త ప్రాజెక్టులు కష్టమే!

  • హైదరాబాద్‌లో 95 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని 
  • ఫ్రెషర్ల నియామకాలు జాప్యం!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కరోనా వైరస్‌ వ్యాప్తి ని కట్టడి చేయడానికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు లాక్‌డౌన్‌ నిబంధనలను అమలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో 95 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేయడానికి వీలు లేని కొన్ని ప్రాజెక్టుల నిర్వహణకు మాత్రమే ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. వీరికి అవసరమైన ద్రువపత్రాలను, పాస్‌లను కంపెనీలు జారీ చేస్తున్నాయని హైసియా ప్రెసిడెంట్‌ బొల్లు మురళీ తెలిపారు. హైదరాబాద్‌లో దాదాపు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులుండగా ఇందులో కొంత మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే.. లాక్‌డౌన్‌ ప్రకటన అనంతరం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అన్ని కంపెనీల్లో 95 శాతం మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారని మురళీ వివరించారు. ఇప్పటి వరకూ సాధారణ పరిస్థితుల్లో ఐటీ కంపెనీల్లో 5 శాతం వరకూ ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు ఉండే వారు. కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత కూడా భవిష్యత్తులో 15 శాతం వరకూ ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు ఉండే వీలుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 


ఆదాయాలు తగ్గే చాన్స్‌

భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 70-80ు అమెరికా నుంచే లభిస్తోంది. అమెరికాలో కొత్త ప్రాజెక్టులపై సాధారణం గా జనవరి, ఫిబ్రవరి నెలల్లో కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటాయి. కరోనా తీవ్రత కొత్త ప్రాజెక్టులపై నిర్ణయాలను అమెరికా కంపెనీలు వాయిదా వేసే వీలుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రాజెక్టులను ఖాతాదారు కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయి. దాదాపు 5ు ప్రాజెక్టులను సస్పెండ్‌ చేసినట్లు అంచ నా. కొత్త ప్రాజెక్టుల వాయిదా, ఉన్న ప్రాజెక్టుల రద్దు కారణం గా పరిశ్రమలో వృద్ధి నిలిచిపోయే అవకాశంతోపాటు ఆదాయాలు తగ్గే వీలుందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


వేతనాలు పెంచకపోవచ్చు!

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాల పెంపును ఐటీ కంపెనీలు వాయిదా వేసే అవకాశం ఉంది. గత అనుభవాల ను పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక ఇబ్బందుల కారణంగా ఇటువంటి నిర్ణయాలను కంపెనీలు తీసుకోకపోవచ్చని హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. రెండు, మూడు నెలల్లో కరోనా ప్రభావాన్ని అధిగమించే వీలుందని..అందువల్ల వేతనాల తగ్గింపు వంటివి ఉండవని అన్నారు. మరోవైపు భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి ప్రధాన ఐటీ కంపెనీలు ప్రాంగణాలకు వెళ్లి విద్యార్థులకు భారీగా ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయి. పరిశ్రమకు అనుకోని అవరోధం ఎదురైనందున ఫ్రెషర్ల నియామకాల్లో కొంత జాప్యం జరగొచ్చని అంటున్నారు. 

Updated Date - 2020-03-27T05:56:57+05:30 IST