సొసైటీల్లో ఉద్యోగుల కుదింపు

ABN , First Publish Date - 2021-10-25T05:19:26+05:30 IST

సహకార సంఘాలకు కొత్త హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

సొసైటీల్లో ఉద్యోగుల కుదింపు

జీవో 90 జారీతో సొసైటీలకు కష్టాలు

 ఆందోళనలో సహకార ఉద్యోగుల 


సహకార సంఘాలకు కొత్త హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సహకార కమిటీల సిఫారసుల మేరకు ప్రభుత్వం జారీచేసిన జీవో 90 వల్ల సొసైటీ ఉద్యోగులను పెద్ద ఎత్తున కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉత్తర్వుల మేరకు సిబ్బందిని కుదిస్తే సహకార వ్యవస్త కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. 


భీమవరం, అక్టోబరు 24 :సుదీర్ఘ కాలం సేవలందించి పదవీ విరమణ చేసిన సహకార రిటైర్డ్‌ ఉద్యోగులకు 90 జీవో ద్వారా గ్రాట్యుటీని కేవలం రెండు లక్షలకే పరిమితం చేయడంతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సొసైటీల పరిధి విస్తరించింది. ఈ నేపథ్యంలో ఎరువులు, పురుగుల మందులు, ధాన్యం కొనుగోళ్ళు ఇతర రైతు అవసరాల వ్యాపారాలు కూడా సొసైటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతీ సొసైటీకి పెద్దఎత్తున సిబ్బంది అవసరం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బందిని కుదించాలని ఉత్తర్వులు రావడంతో సిబ్బంది కొరత వల్ల సహకార వ్యవస్థ కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.

 ఉద్యోగుల ఆందోళనతో..

సహకార సంఘాల్లో ఉద్యోగం చేస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలంటూ 10 ఏళ్ళుగా ఆందోళన, 45 రోజుల పాటు సమ్మె కూడా చేయడంతో గత ప్రభుత్వం విచారణకు ఓ కమిటీని నియమించింది. నివేదిక ఇవ్వలేదు. ఉద్యోగులు మళ్లీ ఒత్తిడి తేవడంతో గత ఏడాది డిసెంబరు నాలుగున ప్రభుత్వం 90 జీవోను జారీచేసింది. ఆ ప్రకారం సొసైటీలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఈ జీవో ప్రకారం ఏ కేటగిరిలో రూ.10 కోట్లు పైగా టర్నోవర్‌ చేసే సొసైటీలు, బి కేటగిరిలో రూ.5–10 కోట్లు టర్నోవర్‌ చేసే సొసైటీలు, సి కేటగిరిలో రూ.2–5 కోట్లు టర్నోవర్‌ చేసే సొసైటీలు, డి కేటగిరిలో రూ.2 కోట్లు లోపు టర్నోవర్‌ చేసే సొసైటీలుగా విభజించారు. ఈ ప్రకారం ఏ కేటగిరిలో ఆరుగురు ఉద్యోగులు, బి కేటగిరిలో నలుగురు ఉద్యోగులు, సి కేటగిరిలో ఇద్దరు ఉద్యోగులు, డి కేటగిరిలో ఒక ఉద్యోగి మాత్రమే ఉండాలి. 

జీవోతో జిల్లాపై తీవ్ర ప్రభావం..

   కొత్త జీవో అమలు వలన మన జిల్లా పై తీవ్ర ప్రభావం చూపించబోతుంది. ఇక్కడి సొసైటీలు ఎక్కువగా రైతులకు బహుముఖంగా సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 258 సహకార సంఘాలు ఉండగా సుమారు 150 సొసైటీలు 30 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లతో టర్నోవర్‌ చేస్తున్నాయి. ఈ సొసైటీల్లో 22 మంది చొప్పున ఉద్యోగులు పనిచేస్తూ రెండేసి ఎరువుల డిపోలను, సూపర్‌ బజార్‌లు నిర్వహిస్తూ ఏటా రూ.50 లక్షలు నుంచి కోటి రూపాయల వరకూ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సొసైటీలలో ఆరుగురు ఉద్యోగులు ఎంతవరకు సరిపోతారనేది ప్రభుత్వానికే తెలియాలని ఉద్యోగులు అంటున్నారు. ఇదే పరిస్థితి 100 సొసైటీలు ఉన్న డి కేటగిరిలో కూడా ఎదురవుతుంది. జీవో సవరణ కోసం పెదపాడు మండలం గోగుంట మాజీ అధ్యక్షుడు కుటుంబ శాస్ర్తి ఈ మధ్యనే కోర్టుకు వెళ్ళారు. 

చిన్న సొసైటీలకు మాత్రమే ప్రయోజనం

జీవో 90 ప్రకారం చిన్న సహకార సంఘాలకు ప్రయోజనం కలుగుతుంది. రైతులకు రుణపరపతితో పాటు బహుముఖ సేవలు అందింస్తున్న ఉభయగోదావరి, కృష్ణాజిల్లా సొసైటీలకు ఎక్కువ నష్టం కలుగుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మేజర్‌ సొసైటీలు భారీగా ఆదాయం కోల్పోతాయి. లాభాలతో నడుస్తున్న సొసైటీలకు సిబ్బంది కుదిస్తే ఆదాయం పడిపోతుందని, సహకార సంఘాల లక్ష్యాలు నెరవేరబోవని చెబుతున్నారు. 


Updated Date - 2021-10-25T05:19:26+05:30 IST