Sex trafficking case : ట్రంప్, క్లింటన్ స్నేహితురాలు ఘిస్లెయిన్ మేక్స్‌వెల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-06-29T20:48:09+05:30 IST

మైనర్ బాలికలను లైంగికంగా వేధించడంలో ఓ ఫైనాన్షియర్‌కు సహకరించినందుకు

Sex trafficking case : ట్రంప్, క్లింటన్ స్నేహితురాలు ఘిస్లెయిన్ మేక్స్‌వెల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

న్యూయార్క్ : మైనర్ బాలికలను లైంగికంగా వేధించడంలో ఓ ఫైనాన్షియర్‌కు సహకరించినందుకు సోషలైట్ ఘిస్లెయిన్ మేక్స్‌వెల్‌కు 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ మన్‌హాటన్ ఫెడరల్ కోర్టు మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) తీర్పు చెప్పింది. లైంగిక కార్యకలాపాల కోసం మైనర్ బాలికలను అక్రమ రవాణా చేసినట్లు నమోదైన కేసులో ఆరు ఆరోపణల్లో ఐదు రుజువైనట్లు తెలిపింది. 


బ్రిటిష్ మీడియా దిగ్గజం రాబర్ట్ మేక్స్‌వెల్ (లేటు) కుమార్తె ఘిస్లెయిన్ మేక్స్‌వెల్ (Ghislaine Maxwell) (60). ఆమె ఆక్స్‌ఫర్డ్ (Oxford) విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. మైనర్ బాలికలను లైంగికంగా వేధించడంలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (లేటు)కు ఆమె సహకరించినందుకు ఈ కేసు నమోదైంది. విచారణను ఎప్‌స్టీన్ తప్పించుకున్నారని, ఘిస్లెయిన్ బాల్యం అత్యంత బాధాకరంగా గడిచిందని, అందువల్ల ఆమెకు తేలికపాటి శిక్షను విధించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఆమెను అన్యాయంగా శిక్షిస్తున్నారని ఆరోపించారు. గరిష్ఠంగా ఐదేళ్ళు మాత్రమే జైలు శిక్ష విధించాలని కోరారు. అయితే ప్రాసిక్యూషన్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది మాత్రం ఆమెకు 30 నుంచి 55 ఏళ్ళ జైలు శిక్ష విధించాలని కోరారు. చివరికి జడ్జి అలిసన్ నథన్ అమెరికా ప్రొబేషన్ ఆఫీస్ సిఫారసు చేసినట్లుగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 


బాలికలను ప్రలోభపెట్టి, వారి చేత తనకు మసాజ్ చేయించుకోవాలనేది ఎప్‌స్టీన్ పథకం. ఈ పథకానికి ఘిస్లెయిన్ సహకరించినట్లు, ఆ విధంగా మసాజ్ చేయడానికి వెళ్ళిన బాలికలను ఆయన లైంగికంగా వాడుకున్నట్లు ప్రాసిక్యూటర్లు 2021లో నిరూపించగలిగారు.  ఇద్దరు బాధిత బాలికలు ఈ విషయాన్ని ధ్రువీకరించి, సాక్ష్యం చెప్పారు. 


ఘిస్లెయిన్ బాల్యం దారుణంగా గడిచిందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమె తండ్రి మానసిక అస్వస్థతతో బాధపడేవారని తెలిపారు. ఆమె తన తండ్రి మరణించిన తర్వాత ఎప్‌స్టీన్‌ను కలిశారని, ఆయన చెప్పినట్లు ఆమె చేశారని చెప్పారు. మొత్తం శిక్షను ఆమెకే విధించవద్దని, ఈ నేరాలకు బాధ్యుడు ఎప్‌స్టీన్ అని చెప్పారు. 


2019లో ఎప్‌స్టీన్ (66) జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఘిస్లెయిన్ మేజర్ అని, ఆమె తన నిర్ణయాలను తానే తీసుకునేవారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 1994 నుంచి 2004 వరకు చేసిన నేరాల పట్ల ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని తెలిపింది. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ అటారన్నీ డామియన్ విలియమ్స్ మాట్లాడుతూ, బాలలపై అమానుష నేరాలకు పాల్పడినందుకు ఘిస్లెయిన్ మేక్స్‌వెల్ దోషి అని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ తీర్పుతో స్పష్టమవుతుందన్నారు. 


ట్రంప్, క్లింటన్ కుటుంబాలతో స్నేహం

ఘిస్లెయిన్ మేక్స్‌వెల్‌కు గొప్ప గొప్పవారితో సంబంధాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ కుటుంబాలు; బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ వంటివారితో ఆమె సన్నిహితంగా ఉండేవారు. ప్రిన్స్ ఆండ్రూకు అమ్మాయిలను సరఫరా చేసినట్లు కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్స్ ఆండ్రూ ఫిబ్రవరిలో ఓ మహిళకు సంబంధించిన కేసును పరిష్కరించుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనను ప్రిన్స్ వద్దకు ఎప్‌స్టీన్, మేక్స్‌వెల్ పంపించారని చెప్పారు. 


Updated Date - 2022-06-29T20:48:09+05:30 IST